
జెట్ ఎయిర్‌వేస్‌కు కేంద్రం నుంచి గుడ్‌న్యూస్: సెక్యూరిటీ క్లియరెన్స్ మంజూరు, త్వరలో సేవలు
న్యూఢిల్లీ: వాణిజ్య విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలనుకుంటున్న జెట్ ఎయిర్‌వేస్‌కు హోంమంత్రిత్వ శాఖ నుంచి తీపి కబురు వచ్చింది. విమాన కార్యకలాపాలు ప్రారంభించేందుకు కావాల్సిన సెక్యూరిటీ క్లియరెన్స్‌ను మంజూరు చేసింది హోంమంత్రిత్వ శాఖ. ఈ విషయాన్ని పౌర విమాన శాఖ జెట్ ఎయిర్‌వేస్‌కు తెలియజేసింది.
మే 6నే ఈ విషయాన్ని లేఖ ద్వారా తెలియజేయగా.. సంబంధిత డాక్యుమెంట్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్‌వేస్ కార్యకలాపాలు గత మూడేళ్లు నిలిచిపోయిన విషయం తెలిసిందే. 2019 ఏప్రిల్ 17న జెట్ ఎయిర్‌వేస్ తన చివరి విమానం నడిపింది. గతంలో నరేష్ గోయల్ యజమానిగా ఉన్నారు. ప్రస్తుతం జలాన్-కర్లాక్ కన్సార్టియం జెట్ ఎయిర్‌వేస్ ప్రమోటర్‌గా వ్యవహరిస్తోంది. ఈ ఏడాది నుంచి తిరిగి విమాన సర్వీసులను ప్రారంభించాలని జెట్ ఎయిర్‌వేస్ భావిస్తోంది.

విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించాలంటే కావాల్సిన ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్‌ను పొందడంలో భాగంగా ఇటీవల హైదరాబాద్ విమానాశ్రయంలో టెస్ట్ ఫ్లైట్ నడిపింది. విమానాలు దాని భాగాలు సరిగా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవడంలో భాగంగా దీన్ని నిర్వహించారు. తదుపరి ప్రూవింగ్ ఫ్లైట్లను విజయవంతంగా నడిపిస్తే పౌర విమానయాన శాఖ రెగ్యూలేటర్ డీజీసీఏ.. ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్ ను మంజూరు చేస్తుంద.ి
కాగా, ప్రూవింగ్ ఫ్లైట్లు కూడా సాధారణ కమర్షియల్ విమానాల్లానే నడుస్తాయి. అయితే, ఇందులో డీజీసీఏ అధికారులు, ఎయిర్ లైన్స్ అధికారులు ప్రయాణికుల్లా వ్యవహరిస్తారు. కేబిన్ సిబ్బంది కూడా ఉంటారు. అన్ని అనుకున్నట్లుగా సాగితే ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ జెట్ ఎయిర్ వేస్ తిరిగి తన కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో దేశంలో మరో విమానయాన సంస్థ సేవలు కూడా అందుబాటులోకి వస్తాయి.