India Today CVoter exit Polls: ఆర్టికల్ 370ని రద్దు చేసిన బీజేపీ పరిస్థితేంటీ?
Jammu Kashmir assembly Election 2024 exit polls: కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్, హర్యానాల్లో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడుతున్నాయి. 90 సీట్లు ఉన్న జమ్మూ కాశ్మీర్‌లో మూడు దశల్లో పోలింగ్ ముగిసింది. కిందటి నెల 18, 25, ఈ నెల 1న తమ ఓటు హక్కును వినియోగించుకున్నారక్కడి ఓటర్లు.
హర్యానాలో కూడా 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ సాయంత్రం 6 గంటలకు ఒకే విడతలో పోలింగ్ ముగిసింది. 6:30 గంటల నుంచి ఎగ్జిట్ పోల్స్ అంచనా పోటెత్తుతున్నాయి. ఆర్టికల్ 370 రద్దు, దశాబ్దకాలం తరువాత అసెంబ్లీ ఎన్నికలు జరగడం వల్ల అందరి దృష్టి కూడా జమ్మూ కాశ్మీర్ మీదే నిలిచింది.

ఇక్కడ హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని దైనిక్ భాస్కర్ సంస్థ అంచనా వేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 46. ఈ సంఖ్య ఏ పార్టీకి కూడా అందబోదని అభిప్రాయపడింది. నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ అలయెన్స్‌గా ఆవిర్భవిస్తుందని పేర్కొంది.
ఈ కూటమికి 35 నుంచి 40 వరకు స్థానాలు లభించే అవకాశం ఉందని దైనిక్ భాస్కర్ వివరించింది. భారతీయ జనతా పార్టీ 20 నుంచి 25 నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం కావొచ్చు. అలాగే మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సారథ్యాన్ని వహిస్తోన్న పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ సైతం ఏ మాత్రం ప్రభావం చూపలేకపోవచ్చు. పీడీపీ 4 నుంచి 7 స్థానాలే దక్కే అవకాశం ఉంది. ఇతరులు 12 నుంచి 16 స్థానాలను గెలుచుకుంటారని దైనిక్ భాస్కర్ పేర్కొంది.
దీనికి పూర్తి భిన్నంగా ఇండియాటుడే - సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. జమ్మూ కాశ్మీర్‌లో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం లేదని అంచనా వేసింది. నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ దక్కుతుందని తేల్చి చెప్పింది.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్‌ను అందుకుంటుందని ఇండియా టుడే- సీఓటర్ తెలిపింది. 40 నుంచి 48 నియోజకవర్గాల్లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేస్తారని పేర్కొంది. భారతీయ జనతా పార్టీ 27 నుంచి 32 స్థానాలకే పరిమితం అవ్వొచ్చు.
ఇక పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ప్రభావం పెద్దగా ఉండదని ఇండియా టుడే తేల్చింది. మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తికి చెందిన పీడీపీ 6 నుంచి 12 స్థానాలతో సరిపెట్టుకుంటుందని పేర్కొంది. ఇతరులు 6 నుంచి 11 సీట్లకు పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.












Click it and Unblock the Notifications