
ఓబీసీ రిజర్వేషన్లపై కేంద్రం సంచలనం- నాలుగు కేటగిరీలుగా వర్గీకరణ-రోహిణి కమిషన్ సిఫార్సు ?
దేశవ్యాప్తంగా రిజర్వేషన్లపై భయాందోళనలు నెలకొంటున్న నేపథ్యంలో ఓబీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ రోహిణి కమిషన్ చేయబోతున్న ఓ కీలక సిఫార్సు తేనెతుట్టెను కదపబోతోందా ? వెనుకబడిన వర్గాలకు కేటాయించిన 27 శాతం రిజర్వేషన్లు సక్రమంగా అమలు కావడం లేదా ? అందుకే వీటిని నాలుగు కేటగిరీలుగా విభజించి అమలు చేయాలని కేంద్రం భావిస్తోందా ? త్వరలో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలతో జస్టిస్ రోహిణి కమిషన్ సంప్రదింపులు ప్రారంభించబోతోందా ? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.

ఓబీసీ రిజర్వేషన్లపై సమీక్ష
దేశంలో ప్రస్తుతం ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇవి కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాలు రాజకీయ పదవుల్లో ఇస్తున్న రిజర్వేషన్లు. దేశవ్యాప్తంగా ఉన్న 2633 వెనుకబడిన కులాలకు గంపగుత్తగా ఈ 27 శాతం రిజర్వేషన్లు ఇప్పటివరకూ అమలవుతున్నాయి. దీంతో ఈ వెనుకబడిన కులాల్లో అత్యంత వెనుక బడిన కులాలకు కాకుండా, ఓ మోస్తరుగా వెనుకబాటు ఉన్న వర్గాలే ఎక్కువగా ప్రయోజనం పొందుతున్నాయనేది ప్రధాన ఆరోపణ. దీంతో రిజర్వేషన్ల లక్ష్యం నెరవేరడం లేదని కేంద్రం భావిస్తోంది. అందుకే వీటి సమీక్ష కోసం 2017లో కేంద్రం జస్టిస్ రోహిణి కమిషన్‌ను నియమించింది.

నాలుగు కేటగిరీలుగా ఓబీసీ వర్గీకరణ
ప్రస్తుతం ఏపీ, తెలంగాణ సహా 11 రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్లు వర్గీకరణ ప్రకారమే అమలవుతున్నాయి. అత్యంత వెనుక బడిన కులాలకు ఎక్కువ రిజర్వేషన్లు, అలాగే తక్కువ వెనుక బడిన కులాలలకు తక్కువశాతం రిజర్వేషన్ అమలవుతోంది. అయితే కేంద్ర జాబితాలో ఉన్న ఇతర ఓబీసీ కులాలకు మాత్రం ఇప్పటివరకూ వర్గీకరణ లేదు. దీంతో రిజర్వేషన్లలో పలు వెనుకబడిన కులాలకు అన్యాయం జరుగుతోంది. దీన్ని సవరించేందుకు ఓబీసీల తాజా పరిస్ధితిపై అధ్యయనం జరిపిన జస్టిస్ రోహణి కమిషన్ నాలుగు కేటగిరీలుగా ఓబీసీ రిజర్వేషన్లను అమలు చేస్తే సరిపోతుందని కేంద్రానికి సిఫార్సు చేయబోతోంది.

ఓబీసీ రిజర్వేషన్ల శాతాలివే
ప్రస్తుతం 27 శాతంగా అమలవుతున్న ఓబీసీ రిజర్వేషన్లను నాలుగు వర్గాలుగా విభజిస్తారు. వీటిని 2, 6, 9,10 శాతాల్లో వీటిని అమలు చేస్తారు. ఇందులో అత్యంత ఎక్కువ వెనుకబడిన కులాలకు 10 శాతం రిజర్వేషన్ దక్కనుండగా.. తక్కువ వెనుకబడిన కులాలకు కేవలం 2 శాతం మాత్రమే వర్తిస్తుంది. దీంతో బాగా వెనుకబడిన కులాలకు న్యాయం జరుగుతుందని జస్టిస్ రోహిణి సిఫార్సు చేయబోతున్నారు. తాజా వర్గీకరణ తర్వాత మొత్తం 2633 ఓబీసీ కులాల్లో 1674 కులాలకు 2 శాతం రిజర్వేషన్ల కేటగిరీలోకి తీసుకొస్తారు. రెండో కేటగిరీలోకి 534 కులాలను, మూడో కేటగిరీలో 328 కులాలను, నాలుగో కేటగిరీలోకి 97 కులాలు రానున్నాయి.
అయితే ఈ నాలుగో కేటగిరీలో ఉన్న 97 కులాలే ఇప్పుడు ఓబీసీలో 27 శాతం రిజర్వేషన్లు ఎక్కువగా అనుభవిస్తూ బలవంతులుగా ఆధిపత్యం చెలాయిస్తున్నారు.

ఓబీసీ వర్గీకరణకు రాష్ట్రాలు ఒప్పుకుంటాయా ?
ఓబీసీ కులాల వర్గీకరణ కోసం జస్టిస్ రోహిణి కమిషన్ సిద్ధం చేసిన ప్రతిపాదనలను త్వరలో రాష్ట్ర ప్రభుత్వాల ముందు ఉంచబోతున్నారు. అయితే ఏపీ, తెలంగాణ సహా 11 రాష్ట్రాల్లో ఇప్పటికే వర్గీకరించిన రిజర్వేషన్లు అమలవుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాలు ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తాయా అన్నది తేలాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు రోహిణి కమిషన్ ప్రతిపాదిస్తున్న 97 కులాల నాలుగో కేటగిరీలో ఉన్న వారు ఇప్పటివరకూ 27 శాతం రిజర్వేషన్ ఫలాలు ఎక్కువగా అనుభవించారు. ఇప్పుడు తాజా ప్రతిపాదన ప్రకారం కూడా వారికి 10 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని భావిస్తున్నారు. దీంతో మిగతా కులాలు ఈసారి దీనికి అంగీకరిస్తాయా, రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు ఎలా ఉన్నాయన్నది తేలాకే కమిషన్ జూన్‌లో కేంద్రానికి తుది నివేదిక ఇవ్వనుంది.