ముఖ్యమంత్రి సొంత జిల్లాలో బీజేపీకి పరాభవం: సజ్జనార్ వెనుకంజ: ఆధిక్యతలో ప్రత్యర్థి
బెంగళూరు: కర్ణాటకలో అధికారంలో భారతీయ జనతా పార్టీకి మిశ్రమ ఫలితాలు ఎదురవుతున్నాయి. రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించగా.. ఒక్కదాంట్లో మాత్రమే విజయం సాధించేలా కనిపిస్తోంది. మరో స్థానంలో ప్రత్యర్థి కాంగ్రెస్ భారీ ఆధిక్యతను సాధించింది. రౌండ్ రౌండ్‌కూ తన ఆధిక్యతను మెరుగుపర్చుకుంటోంది. కాంగ్రెస్ లీడింగ్‌లో ఉన్న ఈ నియోజకవర్గం- ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సొంత జిల్లాలోనిది కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కర్ణాటకలో సిందగి, హనగళ్ అసెంబ్లీ నియోజకవర్గాలకు కిందటి నెల 30వ తేదీన ఉప ఎన్నికలను నిర్వహించారు. సిందగిలో బీజేపీ తరఫున రమేష్ భూసనూర్, కాంగ్రెస్ అభ్యర్థిగా అశోక్ మనగూళి, జనతాదళ్ (సెక్యులర్) నుంచి షకీలా అంగడి పోటీ చేశారు. హనగళ్‌లో బీజేపీ శివరాజ్ సజ్జనార్‌ను బరిలోకి దింపింది. కాంగ్రెస్ తరఫున శ్రీనివాస్ మానె, జేడీఎస్ నుంచి నియాజ్ షేక్ పోటీలో ఉన్నారు. ప్రధానంగా ఈ మూడు పార్టీల మధ్యే పోటీ నెలకొంది.

తాజాగా వెలువడుతోన్న ఫలితాలు అధికార బీజేపీకి మిశ్రమ ఫలితాలను ఇస్తోన్నాయి. సిందగిలో పార్టీ ఆధిక్యతలో కొనసాగుతోంది. ఎనిమిదవ రౌండ్ ముగిసేసరికి రమేష్ భూసనూర్ 60,478 ఓట్ల మెజారిటీని సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థికి 34,692 ఓట్లు పోల్ అయ్యాయి. జేడీఎస్ 374 ఓట్లకే పరిమితమైంది. ఇక్కడ బీజేపీ గెలవడం లాంఛనప్రాయమే అయింది. రమేష్ భూసనూర్ వ్యక్తిగత ప్రతిష్ఠకు బీజేపీ తోడు కావడం ఆయన విజయానికి దారి తీస్తుందని అంటున్నారు.
ఎటొచ్చీ- హనగళ్ ఎన్నికల ఫలితాలు బీజేపీకి మింగుడు పడట్లేదు. పార్టీ అభ్యర్థి శివరాజ్ సజ్జనార్ వెనుకంజలో ఉన్నారు. శ్రీనివాస్ మానె ఆధిక్యతలో దూసుకెళ్తో్నారు. ఎనిమిదవ రౌండ్ ఫలితాలు వెలువడే సమయానికి శ్రీనివాస్ 4,413 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. ఆయనకు 36,415 ఓట్లు పడ్డాయి. శివరాజ్ సజ్జనార్ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ఆయనకు పోల్ అయిన ఓట్లు 32,002. జేడీఎస్ ఇక్కడ కూడా మూడో స్థానానికే పరిమితమైంది.
హవేరి జిల్లాలో ఉంటుందీ హనగళ్ నియోజకవర్గం. ఇది ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సొంత జిల్లా. ఆయన ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న షిగ్గావ్ నియోజకవర్గం ఉండేది ఈ జిల్లాలోనే. అందుకే అందరి దృష్టీ ఈ నియోజకవర్గం మీదే నిలిచింది. ఇక్కడ పార్టీ లీడ్‌లోకి వస్తుందా? రాదా? అనేది ఉత్కంఠతగా మారింది. రౌండ్ రౌండ్‌కూ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ మానె ఆధిక్యత పెరిగిపోతుండటంతో బీజేపీకి పరాభవం తప్పదనే అంచనాలు వెలువడుతున్నాయి.












Click it and Unblock the Notifications