Karnataka Polls : కర్నాటక బీజేపీ అభ్యర్ధుల ఎంపికలో ట్విస్ట్ లు తప్పవా ? సీఎం బొమ్మై హింట్..!
ఈసారి కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం నిలబెట్టుకోవాలని భావిస్తున్న బీజేపీ..త్వరలో అభ్యర్ధుల జాబితా ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఈ జాబితాలో ఎవరుంటారో, ఎవరిని తప్పిస్తారో, మరెవరికి కొత్తగా అవకాశం ఇస్తారన్న దానిపై ఉత్కంఠ పెరుగుతోంది. అసలే అధికార పార్టీ కావడం, కేంద్రంలో అధికారంలో ఉండటంతో బీజేపీ అభ్యర్ధుల జాబితాలో చోటుపై ఎమ్మెల్యేల్లోనూ భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్ధుల జాబితా ఎలా ఉండబోతోందనేది సీఎం బొమ్మై చెప్పేశారు.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ప్రకటించే అభ్యర్ధుల జాబితాలో ఆశ్చర్యకరమైన ఎంపికలు ఉంటాయా అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ జాబితానే ఆశ్చర్యకరంగా ఉంటుందంటూ సీఎం బసవరాజ్ బొమ్మై సమాధానం ఇచ్చారు. ఈసారి అభ్యర్ధుల ఎంపికలో పలు ప్రయోగాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఎమ్మెల్యే అభ్యర్ధుల్ని ఎంపిక చేసే విషయంలో ప్రజాస్వామ్యంగానే వ్యవహరిస్తున్నామని, కేంద్రంలో పెద్దలు ఈ నెల 8వ తేదీ కల్లా ఎంపిక పూర్తి చేసి ప్రకటన చేస్తారని బొమ్మై తెలిపారు.

బీజేపీకి ఈసారి పూర్తి మెజారిటీ వచ్చి మళ్లీ అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని సీఎం బొమ్మై తెలిపారు.రెండు రోజులుగా జరిగిన జిల్లా స్థాయి కోర్ కమిటీ సమావేశాలకు కొనసాగింపుగా ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశమైందని, ఆయన తెలిపారు. ఈరోజు, రేపు కేంద్రానికి పంపే ముందు తదుపరి స్క్రీనింగ్ జరుగుతుందన్నారు. ఏప్రిల్ 8న కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత తుది అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ 124 సీట్లకు, జేడీ(ఎస్)లు 93 సీట్లకు అభ్యర్ధుల్ని ఇప్పటికే ప్రకటించాయి.













Click it and Unblock the Notifications