దేశంలో తీవ్రమైన భిన్న వాతావరణం
న్యూఢిల్లీ: భారతదేశంలో భిన్న వాతావరణ పరిస్థితులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో తీవ్రమైన ఎండలు, వడగాలులు.. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ వర్షాలు అతలాకుతలం చేయగా.. ఇప్పుడు అస్సాం రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా, రుతుపవనాలు ఆలస్యం కావడంతో చాలా ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తాజాగా, భారత వాతరవణ శాఖ నైరుతి రుతుపవనాలపై కీలక ప్రకటన చేసింది.
అస్సాంలో భారీ వర్షాలు
నైరుతి రుతుపవనాలు ఈశాన్యంలో చురుకుగా ఉన్నాయని ఐఎండీ తెలిపింది. అసోం, మేఘాలయలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కనీసం తొమ్మిది అస్సాం జిల్లాలు తీవ్రమైన వరద పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. వేలాది మంది ప్రజలు ప్రభావితమయ్యారు. ఈ వారం ఆరెంజ్ (చర్యకు సిద్ధంగా ఉండండి), ఎల్లో (చూడండి, అప్‌డేట్ అవ్వండి) అలర్ట్‌లు జారీ చేయబడ్డాయి.

ఆలస్యమైన రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు కేరళకు జూన్ 1 సాధారణ తేదీ కాగా.. అయితే, ఒక వారం తర్వాత జూన్ 8న భారతదేశాన్ని తాకాయి. ముఖ్యంగా వర్షాలపై ఆధారపడిన ఖరీఫ్ పంటలకు రుతుపవనాలు కీలకం. భారతదేశంలో మూడు పంటల సీజన్లు ఉన్నాయి. అవి వేసవి, ఖరీఫ్, రబీ.
రుతుపవనాలు సిక్కిం, గంగానది, ఉప-హిమాలయన్ పశ్చిమ బెంగాల్, ఈశాన్య జార్ఖండ్, బీహార్, ఒడిశా వైపుకు పురోగమించాయని, ఇక్కడ రాబోయే రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.
మరోవైపు వడగాలులు
ఇదిలా ఉండగా, తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్, గంగానది పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, విదర్భ, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో వేడిగాలులు కొనసాగే అవకాశం ఉంది. కాగా, పెరుగుతున్న ఉష్ణోగ్రతల మధ్య యూపీలోని బల్లియాలో ఐదు రోజుల్లో 68 మంది మరణించారు. పొరుగున ఉన్న బీహార్‌లోని 15 జిల్లాలు వేడిగాలుల జాబితాలో ఉన్నాయి. రెండు రోజుల్లో, బీహార్‌లో 42 మరణాలు నమోదయ్యాయి.

ఇక, రిజర్వాయర్ నీటి మట్టాలపై సెంట్రల్ వాటర్ కమీషన్ డేటా దేశంలోని అన్ని డ్యామ్‌లలో నీటి నిల్వను చూపిస్తుంది. ఇది గత ఏడాది రికార్డు గరిష్ట స్థాయి కంటే ఆరు శాతం దిగువకు పడిపోయింది.
ఎల్ నినో
అధికారికంగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ ఆందోళనను రేకెత్తిస్తూ.. ఎల్ నినో ప్రారంభం జరిగిందని యూఎస్ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) ధృవీకరించింది. ఎల్ నినో, పసిఫిక్ వాతావరణ క్రమరాహిత్యం, రుతుపవనాల ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది.












Click it and Unblock the Notifications