ఏడు దశల్లో పోలింగ్- షెడ్యూల్ విడుదలకు కౌంట్ డౌన్
Lok Sabha elections 2024: దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. షెడ్యూల్ విడుదలకు ఎంతో సమయం లేదు. గడువు సమీపించింది. ఇంకో 10 రోజుల్లో షెడ్యూల్ విడుదల కావడం ఖాయంగా కనిపిస్తోంది. దీనితో పాటే- దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుంది.
ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మంగా తీసుకుంటోన్నాయి అన్ని పార్టీలు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీఏ.. ఈ సారి గద్దెనెక్కడానికి ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. దీనికి అనుగుణంగా వ్యూహ, ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి.

ఎన్నికల షెడ్యూల్ విడుదలపై జాతీయ మీడియాలో ప్రత్యేక కథనాలు వెలువడుతున్నాయి. ఈ నెల 14 లేదా 15వ తేదీన షెడ్యూల్ వెలువడుతుందని అంచనా వేస్తోన్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తోన్నట్లు తెలిపాయి.
లోక్‌సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒడిశాలో బిజూ జనతాదళ్, అరుణాచల్ ప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ, సిక్కింలో సిక్కిం క్రాంతికారి మోర్చా- బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలో ఉన్న విషయం తెలిసిందే.
2019 తరహాలోనే దేశవ్యాప్తంగా మొత్తం ఏడు దశల్లో పోలింగ్ పూర్తి అయ్యేలా కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు షెడ్యూల్‌ను రూపొందించినట్లు చెబుతున్నారు. ఏప్రిల్ రెండోవారంలో తొలి దశ పోలింగ్ ఉండొచ్చు. మే 18 లేదా 20వ తేదీ నాటికి పోలింగ్ ప్రక్రియ మొత్తం పూర్తి అవుతుంది. అదే నెల చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications