వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాల మాస్టిన్‌లు: పొట్టకూటి కోసం ప్రమాదానికి ఎదురెళ్లే ఈ సాహసగాళ్లు ఎవరు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

వారు పది కేజీల బ‌రువుండే రాయిని గాల్లోకి విసిరి అది కిందపడుతున్నప్పుడు తమ ఛాతీతో ఢీకొడతారు..

పొట్టేలుతో పోటీ పడి దాని కొమ్ములు వంచి కుదేలు చేస్తారు..

బరువుతో ఉన్న వాహనాలను జుత్తుకు కట్టుకుని లాగుతారు..

శరీరంపైనుంచి బరువైన వాహనాలను పోనిస్తారు..

ఒకటా రెండా ఇలాంటి ఎన్నో విన్యాసాలు వారికి కొట్టిన పిండి.

సాహస విన్యాసాలు

'మాల మాస్టిన్’ అనే కులానికి చెందిన వీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉంటారు.

వీధుల్లో ప్రదర్శనలిస్తూ వచ్చే అరకొర సంపాదనతో కుటుంబాలను పోషించుకుంటారు.

అయితే సంచార జీవులు కావడంతో వారికి ప్రభుత్వ పథకాలు దక్కడం లేదు.

తమ వృత్తికి ఆదరణ లేకపోవడం, ప్రభుత్వ సహకారం లేకపోవడంతో సమస్యల్లో ఉన్నామంటూ మాల మాస్టిన్‌లు చెబుతున్నారు.

తూర్పు గోదావరి జిల్లాలో కోరుకొండ ప్రాంతంలో ఈ గ్రామీణ సాహసవీరులు నేటికీ కనిపిస్తారు.

వివిధ ప్రాంతాలకు వెళ్లి తమ సాహసాలను ప్రదర్శించడం వారి వృత్తి.

అక్కడ ప్రజలిచ్చే కానుకలు తీసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చిన్న వయసు నుంచే వీరు ఈ వృత్తిలో శిక్షణ పొందుతూ ఉంటారు.

చిన్న చిన్న విన్యాసాలు చేస్తూనే పెరుగుతారు. ప్రజలను మెప్పించడమే లక్ష్యంగా ప్రమాదకర విన్యాసాలు చేస్తుంటారు.

రామాంజనేయులు

''శ్రీకృష్ణదేవరాయల కాలంలో రాజ్య రక్షకులు’’

'గ్రామీణ భారతంలో ఎగువ కులాల వారికి వినోదం కోసం అనేక వృత్తుల వారు ఉన్నారు.

జానపద కళారూపాల ద్వారా వారిని అలరించేవారు. అదే తరహాలో మాల, మాదిగలను రంజింపజేసేందుకు మాల మాస్టిన్, మాదిగ మాస్టిన్ అనే తరగతులను తయారు చేశారు’’ అని కొందరు పరిశోధకులు చెబుతున్నారు.

శ్రీకృష్ణదేవరాయులు కాలంలో రాజ్య రక్షణ కోసం ఎంపిక చేసిన వారి వారసులు ఆ తర్వాత ఈ వృత్తిలోకి దిగినట్టు చరిత్ర పరిశోధకుడు వి.శివరామకృష్ణ అంటున్నారు.

బీబీసీతో ఆయన మాట్లాడుతూ ''మాల మాస్టిన్, మాదిగ మాస్టిన్ అంటే ఒకప్పుడు షెడ్యూల్డ్ కులాలవారే.

కానీ, వారు వృత్తి రీత్యా సంచార జీవులుగా మారడంతో ఎస్సీలుగా కూడా గుర్తింపు దొరకలేదు. వారు తమ సాహసాలతో కృష్ణదేవరాయులు కాలంలో రాజ్య రక్షణలో భాగంగా ఉండేవారు.

ఆయుధాలను చేబూని వివిధ గ్రామాల్లో ప్రజలకు అండగా ఉండేవారు.

ఆ తర్వాత రానురాను వారిలో అనేక మంది సాహసాలు చేసే వృత్తి మానుకున్నారు.

దాంతో ప్రస్తుతం వారి క్రీడలు అరుదుగా మారుతున్నాయ’’ని వివరించారు.విన్యాసాలు చేస్తూ కథలు చెబుతారుపగలు విన్యాసాలు చేస్తూ, రాత్రిళ్లు వివిధ రకాల కథలు చెబుతూ ప్రజలను రంజింపజేసేవారు ఈ మాల మాస్టిన్‌లు.

రానురాను ప్రజల జీవనశైలిలో వచ్చిన మార్పులతో గ్రామీణ జీవనంలో వారికి ఆదరణ తగ్గిపోతోంది. ఈ కులానికి చెంది, సాహస విద్యలు ప్రదర్శించే రామాంజనేయులు తమ వృత్తి వివరాలు బీబీసీకి వివరించారు.

''మొదట పెనుగొండ అనే పట్టణంలో శ్రీకృష్ణదేవరాయుల ప్రోత్సహంతో మా సాహసాలు మొదలయ్యాయని పూర్వీకులు చెబుతుంటారు.

అప్పట్లో కరవు వల్ల తలో దిక్కు చెదిరిపోయన సమయంలో మాల కులానికి చెందిన ఒకరికి సాహసాలు చేసేందుకు అవసరమైన సామగ్రి అందించారు. మాల పేటల్లో ఉండడం, వారి పెట్టింది తినడం అలవాటుగా మారింది.

పగలు విన్యాసాలు చేయడం, రాత్రి వేళ అనేక కథలు చెప్పడం అలవాటు. ఎన్నో ఏళ్లుగా ఇలానే సాగుతున్నాం’’ అని ఆయన తెలిపారు.

విన్యాసాలు

విన్యాసాలతో ప్రాణాలు పోతున్నాయి..

అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఎలాంటి రక్షణ లేకుండా ఈ విన్యాసాలు సాగించే క్రమంలో పలువురు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అయినప్పటికీ మరో దిక్కు లేక ఈ వృత్తి కొనసాగుతున్నామని వారు చెబుతున్నారు.

"మేము చేసే విన్యాసాలే మాకు క‌డుపు నింపుతాయి. ఏదయినా ఓ ఊరు పోతాం. అక్కడే పిల్లా పాపలతో ఉంటాం. ఆ పేటలో మాలలు పెట్టింది తింటాం. అయినా ప్రభుత్వాలు కొన్ని వృత్తుల వారిని గుర్తించారు.

కానీ మమ్మల్ని దూరం పెట్టేశారు. గంగిరెద్దులు, జంగాలు, మందులోళ్లు, బుడబుక్కలవారిని గుర్తించారు కానీ మాల మాస్టిన్‌లకు ఎలాంటి గుర్తింపు లేదు. దాంతో మా తాతలు, తండ్రులు చేసినదే మేం చేశాం.

ఇప్పుడు మా బిడ్డలు, మనవళ్లు కూడా అదే పనిలో ఉన్నారు. ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవడమే. దానికి ట్రైనింగ్ అంటూ ప్రత్యేకంగా ఉండదు. ఇలాంటి ప్రమాదకర ఆటల్లోనే నాకొడుకు చనిపోయాడు.

నా ఆరోగ్యం దెబ్బతిన్నది. అయినా తప్పకపోవడంతో అలానే గడుపుతున్నాం. మా కులం ఏంటో కూడా చెప్పే పరిస్థితి లేదు. దాంతో చదువుకున్న వాళ్లు కూడా ఇదే వృత్తిలో సాగాల్సి వస్తోంది " అని రామాంజనేయులు వివరించారు.

నాగేశ్వరరావు

'కళ్లెదుటే ఐదుగురు చనిపోయారు'

ఒక్క రామాంజనేయులు కుటుంబమే కాదు.. అలాంటి వారు అనేక మంది ఈ విన్యాసాల్లో మరణించారు. ప్రాణాలు ప‌ణంగా పెట్టి వీరు చేసే సాహసాలు తీరని శోకాన్ని కలిగిస్తున్నాయి.

అనేక మందిని శాశ్వతంగా దూరం చేస్తున్నాయి. త‌మ బృందంలోనే, త‌మ క‌ళ్లెదురుగా వివిధ ప్ర‌మాదాల్లో గాయ‌ప‌డి ఐదుగురు చనిపోయారని పి.నాగేశ్వ‌రరావు అనే వ్యక్తి బీబీసీతో చెప్పారు.

ప్రమాదమని తెలిసినా గత్యంతరం లేక ఈ పనిచేస్తున్నామన్నారు."మా తాత‌, తండ్రుల కాలంలో కూడా ఇలా జ‌రిగింది. కానీ వారు మాన‌లేదు.

మేమూ అంతే. మాకు ఈ సాహ‌సాలు చేయ‌డం, జ‌నాల‌ను సంతృప్తి ప‌ర‌చ‌డం, వారు ఇచ్చిన దానితో బతకడం మిన‌హా మ‌రోటి తెలియ‌దు. వేరే అవ‌కాశం ఉంటే వ‌దిలేసే వాళ్లం.

మాకు పొలాలు ఏమీ లేవు. అందుకే డ‌ప్పులు వాయిస్తూ, పాట‌లు పాడ‌తాం. ఆట‌లు ఆడ‌తాం. ఎన్నో ర‌కాల విన్యాసాలు చేస్తాం.

కొన్నిసార్లు ఈ విన్యాసాలు చేస్తున్నప్పుడు ప్రమాదాలు జరుగుతాయి. తీవ్రంగా గాయపడి కొందరి ప్రాణాల మీదకు వచ్చింది. మా బృందంలో ఇప్పటికే ఐదుగురు అదే రీతిలో ప్రాణాలు కోల్పోయార’’ని నాగేశ్వరరావు వివరించారు.

ఇప్పుడిప్పుడే మార్పు ..

అవ‌కాశాలు లేక త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ఈ గ్రామీణ విన్యాసాల‌తో గ‌డుపుతున్నామ‌ని మాల మాస్టిన్ కుటుంబానికి చెందిన పి.సుబ్బ‌ల‌క్ష్మి బీబీసీకి తెలిపారు.

"ఒక‌సారి రోడ్డు మీద విన్యాసాల‌కు వెళితే ఏమ‌వుతుందో చెప్ప‌లేం.

అయినా మాకు మ‌రో దారి లేదు. ప్ర‌భుత్వం ఎలాంటి స‌హాయం అందించ‌డం లేదు.

చివ‌ర‌కు పిల్లల చ‌దువుల కోసం స‌ర్టిఫికెట్లు కూడా ఇవ్వ‌లేదు.

ఇంకేం చేయాలి? మేం తక్కువ మంది ఉన్నాం. ఎప్పుడు ఎక్క‌డ ఉంటామో తెలియ‌దు. ఇంకేం చేయ‌గ‌లం" అంటూ ఆమె వాపోయారు.

ప్ర‌స్తుతం ఈ మాల మాస్టిన్‌లలో చిన్నారుల‌ను బ‌డికి పంపించే అల‌వాటు మొదలైంది.

దీంతో వీరిలో అక్ష‌రాస్యత పెరుగుతుందని, భ‌విష్య‌త్ త‌రాలు ప్ర‌మాద‌క‌ర విన్యాసాలకు దూరంగా ఉంటారన్న ఆశాభావం ఆయా కుటుంబాల్లో వ్యక్తమవుతోంది.

మాల మాస్టీల విన్యాసాలు

ఎస్సీ కుల సర్టిఫికెట్లు అందించాలి...

ప్ర‌భుత్వ లెక్క‌ల ప్ర‌కారం మాల మాస్టీలు, మాదిగ మాస్టీలు అనే జాతులు ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సంచారజీవులుగా ఉన్నారు.

అయితే వారికి కుల సర్టిఫికెట్లు మాత్రం ఇవ్వడం లేదు.

ఎస్సీలలోని ఉప కులాల్లో వారి తరగతి లేదు. అంతేగాకుండా ఎస్సీలతో కలిసి జీవిస్తున్నప్పటికీ వారికి మాత్రం సర్టిఫికెట్లు ఇప్పించాలనే అంశంలో ప్రయత్నాలు ఫలించడం లేదు.

కుల సర్టిఫికెట్ల అంశంపై కొంత ప్రయత్నం చేస్తున్నామని ఎస్సీ సంక్షేమ సంఘం నాయ‌కుడు అయితాబ‌త్తుల రామేశ్వరరావు బీబీసీకి తెలిపారు.

"మాల మాస్టిన్‌ల విష‌యంలో అధికారిక లెక్క‌లు కూడా లేవు.

అన‌ధికార స‌మాచారం ప్ర‌కారం ఏపీ, తెలంగాణల్లో క‌లిపి వీరు 800 మంది ఉంటార‌ని అంచ‌నా.

వారంతా ఎస్సీల్లో భాగంగానే ఉన్నారు. వారిని కూడా గుర్తించి స‌బ్ కేట‌గిరీలో స‌ర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉంది. కానీ ఎవరు, ఎక్కడ ఎంత మంది ఉన్నారనే విషయంలో స్పష్టత లేకపోవడంతో వారి సమస్య పరిష్కారం కావడం లేదు. మేము కొంత ప్రయత్నం చేశాం.

అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు. కానీ ఫలితం ఇంకా రాలేదు" అని చెప్పారు.

ఆదుకుంటాం..రక్షణ ఏర్పాట్లు లేకుండా ప్రమాదకర విన్యాసాలు చేయాల్సిన అవసరం వీరికి ఏర్పడకుండా చూస్తామని ప్రభుత్వం చెబుతోంది.

ఆయా కుటుంబాలను ఆదుకుంటామని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వ‌రూప్ బీబీసీకి తెలిపారు.

"ఎస్సీల జీవ‌న‌విధానంలో మాస్టీలు ఒక భాగం. తెలుగునాట ఎస్సీ కాల‌నీల్లో వారి విన్యాసాలు తెలియ‌ని వారి ఉండ‌రు. మారుతున్న కాలానికి త‌గ్గ‌ట్టుగా వారిలో మార్పు తీసుకురావాల్సి ఉంది. కుల‌ స‌ర్టిఫికెట్లు, శాశ్వ‌త గృహవ‌స‌తి క‌ల్పిస్తాం. వారికి ప్ర‌త్యేక సదుపాయాలు ఏర్పాటు చేస్తాం.

యువ‌త‌రం విద్యావంతులు కావ‌డానికి తోడ్పాటు అందిస్తాం. కుల‌ప‌రంగా వివ‌క్ష‌కు గురైన సామాజిక‌వ‌ర్గాల‌కు మాల మాస్టీలు ఎన్నో సేవ‌లు చేశారు. అందుకు త‌గ్గ‌ట్టుగా వారికి గుర్తింపు అవ‌స‌రం. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని" ఆయన బీబీసీతో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Mala Mastin caste people living in telugu states take risk for living
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X