రోడ్డు ప్రమాదంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తలకు గాయం!!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైనట్లుగా అధికారులు వెల్లడించారు. బర్ధమాన్ నుంచి కోల్ కత్తా తిరిగి వస్తుండగా మమతా బెనర్జీ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమె తలకు స్వల్ప గాయం అయినట్లు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించడం కోసం తూర్పు బర్ధమాన్ వెళ్లారు. సమీక్ష అనంతరం అక్కడనుండి వాయు మార్గంలో ఆమె కలకత్తా రావాల్సి ఉండగా వాతావరణ అనుకూలించకపోవడంతో రోడ్డు మార్గం నుంచి ప్రయాణం చేశారు. అక్కడ వర్షం కురుస్తున్న క్రమంలో హెలికాఫ్టర్ ప్రయాణం చేసేందుకు వీలు లేకపోవటంతో రోడ్డు మార్గాన బయలుదేరారు.

వర్షం తో పాటు పొగ మంచు ఎక్కువగా ఉండడంతో రహదారి మార్గంలో కూడా వాహనాలు దగ్గరకు వచ్చేవరకు కనిపించని పరిస్థితులలో ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. దట్టమైన పొగ మంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో మమతా బెనర్జీ వాహన డ్రైవర్ సడన్ గా కారుకు బ్రేకులు వేశాడు.
దీంతో ముందు సీట్లో కూర్చున్న సీఎం మమతా బెనర్జీ విండ్ షీల్డ్ కు ఢీకొనడంతో ఆమెకు స్వల్ప గాయమైనట్టు అధికారులు వెల్లడించారు.దీంతో వెంటనే మమతా బెనర్జీని మరో వాహనంలో కోల్ కత్తాకు తరలించినట్టు అధికారులు చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి రోడ్డు ప్రమాదంలో స్వల్ప గాయం కావడంతో అధికారులు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికలలో పశ్చిమ బెంగాల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, కాంగ్రెస్ పార్టీతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని వెల్లడించి ప్రతిపక్ష ఇండియా కూటమికి మమతా బెనర్జీ షాక్ ఇచ్చిన కొద్దిసేపటికే సీఎం మమతా బెనర్జీ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది.












Click it and Unblock the Notifications