మెత్తపడిన సిద్ధూ-పీసీసీ ఛీఫ్ గా కొనసాగుతానని సంకేతాలు-కొత్త హామీలేవీ లేకుండానే...
పంజాబ్ కాంగ్రెస్ లో నెలకొన్న సంక్షోభానికి తాత్కాలికంగా తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం వైఖరిపై అసంతృప్తితో పీసీసీ ఛీఫ్ పదవికి రాజీనామా చేసిన నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ రెండు రోజుల తర్వాత మెత్తపడ్డారు. కాంగ్రెస్ దూతలతో పాటు పంజాబ్ సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీతో జరిపిన సంప్రదింపులు ఫలించడంతో ఆయన పీసీసీ ఛీఫ్ గా కొనసాగేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
నవజోత్ సింగ్ సిద్ధూ పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌గా ఉంటూ వచ్చే ఏడాది ఎన్నికల్లో కాంగ్రెస్‌కు నాయకత్వం వహిస్తారని, ఆయన సలహాదారు మొహమ్మద్ ముస్తఫా ఇవాళ వెల్లడించారు. సిద్ధూ తన రాజీనామాపై వెనక్కి తగ్గవచ్చని ఈ వ్యాఖ్యలతో తేటతెల్లమైంది. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని ముస్తఫా చేసిన వ్యాఖ్యలు.. సిద్దూ సమస్య తాత్కాలికంగా సద్దుమణిగినట్లేనని సూచిస్తోందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ నవజ్యోత్ సిద్ధూను అర్థం చేసుకుందని, సిద్ధూ కాంగ్రెస్ నాయకత్వానికి అతీతుడు కాదని ముస్తఫా తెలిపారు. సిద్ధూ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ, అధిష్టానం గురించి కామీ ఎప్పుడూ ఆలోచించని అమరీందర్ సింగ్ కాదని ముస్తాఫా నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.

సిద్ధూ కొన్ని సమయాల్లో భావోద్వేగంతో వ్యవహరిస్తాడని, ఈ వ్యవహారశైలిని కాంగ్రెస్ హైకమాండ్ అర్థం చేసుకుంటుందని ఆయన సలహాదారు ముస్తఫా ఇవాళ వెల్లడించారు. దీంతో పీసీసీ ఛీఫ్ పదవికి సిద్ధూ చేసిన రాజీనామా భావోద్వేగంతో కూడుకున్న నిర్ణయమేనని ఆయన చెప్పకనే చెప్పినట్లయింది. పంజాబ్ లో తాజాగా కొలువుదీరిన చన్నీ ప్రభుత్వంలో కొన్ని నియామకాలు ఆయనకు అసంతృప్తి కలిగించాయని ముస్తఫా తెలిపారు. దీంతో పంజాబ్ కేబినెట్ బెర్తుల విషయంలోనే సిద్దూ హైకమాండ్ తో పాటు సీఎం చన్నీతో విభేదించినట్లు అర్ధమవుతోంది. అయితే త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని ముస్తఫా వెల్లడించారు. దీంతో పంజాబ్ కాంగ్రెస్ లో నెలకొన్న వివాదానికి తాత్కాలికంగా తెరపడబోతోందని అంతా భావిస్తున్నారు.
ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితుల నేపథ్యంలో పంజాబ్ సీఎం చన్నీని కానీ, కేబినెట్ మంత్రుల్ని కానీ మార్చలేమంటూ కాంగ్రెస్ అధిష్టానం నుంచి క్లారిటీ వచ్చేయడంతో ఇక చేసేది లేక సిద్ధూ రాజీనామా నిర్ణయంపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఎన్నికలకు ముందు సిద్ధూ మాట ప్రకారమే నిర్ణయాలు ఉండేలా చూస్తామనే హామీ మాత్రమే కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఆయనకు లభించినట్లు తెలుస్తోంది. దీంతో చేసేది లేక రాజీనామాపై సిద్దూ వెనక్కి తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications