పుత్రశోకంలోనూ వీడని దాతృత్వం: చివరి కోరిక కోసం రూ. 25,000 కోట్లు దానం!
ఇండియాకు చెందిన దిగ్గజ సంస్థల్లో వేదాంత గ్రూప్ ఒకటి. చాలా రంగాల్లో ఈ కంపెనీ వ్యాపారాలు చేస్తూ ఉంటుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త, వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ ప్రస్తుతం తన జీవితంలోనే చీకటి రోజులను ఎదుర్కొంటున్నారు. అమెరికాలో తన కుమారుడు అగ్నివేష్(49) జనవరి 7న ప్రాణాలు కోల్పోయారు. అగ్నివేష్ ఆకస్మిక మరణంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ విషాదం నుంచి కోలుకుంటూనే తన కుమారుడికి ఇచ్చిన మాట ప్రకారం తన సంపాదనలో 75 శాతం కంటే ఎక్కువ భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు దానం చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
ఇటీవల అమెరికాలో స్కీయింగ్ ప్రమాదంలో గాయపడిన అగ్నివేశ్.. గత కొద్దిరోజులుగా న్యూయార్క్‌లోని మౌంట్ సినాయ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ కోలుకుంటున్న సమయంలో ఆకస్మికంగా గుండెపోటు రావడంతో మరణించారు. అగ్నివేష్ కోలుకుంటారని ఆశించిన కుటుంబ సభ్యులకు ఇది తీరని వేదనను మిగిల్చింది.

కుమారుడికి ఇచ్చిన మాట
అనిల్ అగర్వాల్ ఒక భావోద్వేగపూరిత పోస్ట్‌లో తన కుమారుడితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. "నేను సంపాదించిన దానిలో సింహభాగాన్ని సమాజ సేవకు ఉపయోగిస్తానని నా కొడుకు అగ్నివేష్‌కు గతంలోనే మాట ఇచ్చాను. వాడు లేకపోయినా వాడి కలలను మాత్రం సమాధి చేయను" అని ఆయన పేర్కొన్నారు. ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం, అనిల్ అగర్వాల్ కుటుంబ నికర ఆస్తి విలువ దాదాపు 4.2 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 35,000 కోట్లు). ఇందులో అత్యధిక భాగాన్ని ఆయన దానం చేయనున్నారు. అంటే దాదాపు రూ.25 వేల కోట్లు ఆయన దానం చేయనున్నట్లు తెలుస్తోంది.
భారతదేశాన్ని స్వావలంబన దిశగా తీసుకెళ్లడమే తన కుమారుడి కల అని అనిల్ అగర్వాల్ తెలిపారు. "దేశంలో ఏ ఒక్క బిడ్డ ఆకలితో నిద్రపోకూడదు, ప్రతి ఒక్కరికీ విద్య అందాలి, మహిళా సాధికారత పెరగాలి. యువతకు ఉపాధి అవకాశాలు లభించాలి. వాడు లేని జీవితం వెలితిగా ఉన్నా, ఈ సామాజిక లక్ష్యాలను సాధించడం ద్వారానే వాడికి నిజమైన నివాళి అర్పిస్తాను" ఆయన అన్నారు.
అగ్నివేష్ నేపథ్యం
జూన్ 3, 1976న పాట్నాలో జన్మించిన అగ్నివేష్, మేయో కాలేజీలో విద్యనభ్యసించారు. వృత్తిపరంగా ఎంతో సక్సెస్ అయిన ఆయన, 'ఫుజైరా గోల్డ్' వంటి సంస్థలను నిర్మించడమే కాకుండా 'హిందుస్థాన్ జింక్' చైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. తండ్రికి కొడుకుగా కంటే ఒక మంచి స్నేహితుడిగా అగ్నివేష్ ఉండేవారని అనిల్ అగర్వాల్ స్మరించుకున్నారు.












Click it and Unblock the Notifications