జ్ఞానేష్ వివాదం వేళ కేంద్రం కీలక నిర్ణయం- ఈసీలో డిప్యూటీ కమిషనర్ నియామకం..!
ఎస్ఐఆర్ వివాదాల వేళ సీఈసీగా జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోసం విపక్షాలు ఢిల్లీలో తీవ్ర ఆందోళనలు చేస్తున్నాయి. మరోవైపు కేంద్రం మాత్రం సీఈసీ రాజీనామా, తొలగింపుపై మానం వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్ వివాదాలు తలెత్తిన సమయంలోనే ఈసీలో ఓటర్ల జాబితా, ఐటీ విభాగాల బాధ్యతలు చూస్తున్న డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సంజయ్ కుమార్ ను ఈ ఏడాది ఆగస్టులోనే ఆయన మాతృ క్యాడర్ కు కేంద్రం పంపేసింది. ఇప్పుడు ఆయన స్ధానంలో మరో కొత్త డిప్యూటీ కమిషనర్ ను నియమించింది.
కేంద్ర ఎన్నికల సంఘంలో డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ (DEC) పదవికి 2010 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ప్రకాష్ రాజ్‌పురోహిత్‌ను (Prakash Rajpurohit) కేంద్ర మంత్రివర్గ నియామకాల కమిటీ తాజాగా నియమించింది. ఓటర్ల జాబితా, ఐటీ విభాగాల బాధ్యతలు చూస్తున్న అప్పటి డీఈసీ సంజయ్ కుమార్‌ను ఆగస్టులో ఆయన మాతృ కేడర్‌కు తిరిగి పంపడంతో ఏర్పడిన ఖాళీని ఈ నియామకంతో భర్తీ చేశారు. సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల ప్రకారం రాజస్థాన్ కేడర్‌కు చెందిన 2010 బ్యాచ్ ఐఏఎస్ అధికారి రాజ్‌పురోహిత్, సంజయ్ కుమార్ స్థానంలో ఏప్రిల్ 8, 2030 వరకు ఈ పదవిలో కొనసాగుతారు. ఆయన ఈ ఏడాది మే నెల నుండి రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని రక్షణ ఉత్పత్తి విభాగంలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.

సంజయ్ కుమార్ ఆగస్టు 2024 నుండి ఈ ఏడాది ఆగస్టు వరకు డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ గా పనిచేశారు; ఆ తర్వాత ఆయనను మాతృ కేడర్‌కు తిరిగి పంపి, ఢిల్లీ ప్రభుత్వంలో నియమించారు. ఈసీలో ఓటర్ల జాబితా, ఐటీ విభాగాల బాధ్యతలు చూస్తున్న ాయన.. దేశంలో SIR ప్రక్రియను ప్రారంభించేందుకు గతేడాది జూన్ 24న జారీ చేసిన ఉత్తర్వులపై సంతకం చేశారు. ఆయన నేతృత్వంలోని ఈసీ ఐటీ విభాగం పనితీరుకు సంబంధించి ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి అంతర్గత సమాచార మార్పిడిలో కొన్ని అభ్యంతరాలు లేవనెత్తారు. జూలైలో ఐటీ బాధ్యతలు చూస్తున్న డీఈసీ సంజయ్ కుమార్‌ను తొలగించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే ఈసీ ఐటీ విభాగం అధిపతి సీమా ఖన్నా.. సంజయ్ కుమార్ ద్వారా ఫైళ్లను పంపకుండా వ్యవహరిస్తున్న తీరుపై వారు క్యాబినెట్ కార్యదర్శికి లేఖ రాశారు. ఈసీలో ఈ కొత్త నియామకంతో పని విభజనలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో, 2027 ప్రారంభంలో జరగనున్న కీలక అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు వ్యక్తం చేసిన ఆందోళనలను ఇది పరిష్కరిస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications
