Rahul Gandhi Assets: రాహుల్ గాంధీ ఆస్తులివే..! ఫ్లాట్ లేదు, కారూ లేదు..!
కాంగ్రెస్ పార్టీ యువనేత, ఎంపీ రాహుల్ గాంధీ గతంలో తాను పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచిన కేరళలోని వాయనాడ్ సీటు నుచే మరోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఆయనకు వాయనాడ్ సీటును మరోసారి కేటాయించింది. దీంతో ఆయన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి వెళ్లి నిన్న వాయనాడ్ లో లోక్ సభ ఎంపీగా నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో తన ఆస్తుల వివరాలతో కూడిన అఫిడవిట్ ను కూడా సమర్పించారు.
వాయనాడ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద రాహుల్ గాంధీ సమర్పించిన అఫిడవిట్ ప్రకారం రాహుల్ గాంధీ పేరు మీద కేవలం రూ.20 కోట్ల ఆస్తులు మాత్రమే ఉన్నాయి. రాహుల్ కు ఫ్లాట్ కానీ సొంత కారు కానీ లేవు. రాహుల్ కు ఉన్న ఆస్తుల్లో 9.24 కోట్ల చరాస్తులు ఉన్నాయి. ఇందులో 55 వేల నగదు, 26.25 లక్షల బ్యాంకు డిపాజిట్లు, 4.33 కోట్ల బాండ్లు, 3.81 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్స్, రూ.15.21 లక్షల విలువైన బంగారం బాండ్లు, రూ.4.20 లక్షల విలువైన బంగారు అభరణాలు మాత్రమే ఉన్నాయి.

రాహుల్ కు ఉన్న స్ధిరాస్తుల విలువ రూ.11.15 కోట్లు. ఇందులో తన సోదరి ప్రియాంక గాంధీతో ఉమ్మడిగా పంచుకంటున్న ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో ఉన్న వ్యవసాయభూమి ఉంది. అలాగే గురుగ్రామ్ ప్రాంతంలో రూ.9 కోట్ల విలువైన ఆఫీసు ఉన్నాయి. అలాగే ఈ ఆఫీసు తన స్వార్జితం అని, వ్యవసాయ భూమి తన తాత ముత్తాల వారసత్వంగా వచ్చిందని రాహుల్ తెలిపారు.
మరోవైపు తనపై ఉన్న కేసుల వివరాలను కూడా రాహుల్ వెల్లడించారు. ఇందులో పోస్కో కేసు కూడా ఉంది. అత్యాచార బాధితురాలి వివరాలు బయటపెట్టినందుకు ఇది నమోదైనట్లు తెలిపారు. అలాగే బీజేపీ నేతలు దాఖలు చేసిన పరువు నష్టం కేసులు కూడా ఉన్నట్లు రాహుల్ తెలిపారు.












Click it and Unblock the Notifications