రైల్వే శుభవార్త: రైలు బయలుదేరే 5నిముషాల ముందు టికెట్ బుక్ చేసుకునే సదుపాయం
సహజంగా ఎక్కడికైనా వెళ్లాలనుకున్నప్పుడు ముఖ్యంగా దూరాభారం ప్రయాణం చేయాలి అనుకున్నప్పుడు సౌకర్యవంతమైన ప్రయాణం చేయడం కోసం రైలునే బెస్ట్ ఆప్షన్ గా ఎంచుకుంటాం. అందుకోసం కొన్ని నెలల ముందే రైలు టికెట్లు బుక్ చేసుకుంటాం. అలా కాకుండా సడన్ గా మనం ప్రయాణం చేయాలి అనుకుంటే అప్పటికప్పుడు తత్కాల్ టికెట్లను బుక్ చేసుకుంటాం.
రైలు బయలుదేరే 5 నిముషాల ముందు టికెట్ బుకింగ్
అంటే ఇప్పటివరకు మనకు రైల్వే టికెట్లు బుక్ చేసుకోవడానికి రెండు ఆప్షన్లు కనిపించాయి. ఒకటి ముందే ప్లాన్ చేసుకొని కొన్ని నెలల ముందే టికెట్లు బుక్ చేసుకోవడం కాగా రెండవది తత్కాల్ బుకింగ్. ఇప్పుడు మనకు మూడో ఆప్షన్ కూడా రైల్వే శాఖ తీసుకువచ్చింది అదేమిటంటే రైలు బయలుదేరడానికి ఐదు నిమిషాల ముందు కూడా టికెట్లు ఖాళీగా ఉంటే మనం టికెట్లను బుక్ చేసుకోవచ్చు అది ఎలాగంటే..

ప్రయాణ సమయానికి ఖాళీగా ఉన్న టికెట్లను విక్రయించనున్న రైల్వేశాఖ
చాలామంది ప్రయాణం ఫిక్స్ చేసుకున్న తర్వాత అనేక కారణాలతో ప్రయాణం రోజున టికెట్ క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఖాళీగా ఉన్న టికెట్లను విక్రయించేందుకు రైల్వేశాఖ ఈ సదుపాయాన్ని తీసుకువచ్చింది. ప్రతి రైలుకు టికెట్ బుకింగ్ కన్ఫర్మేషన్ కోసం రైల్వేశాఖ రెండు చార్ట్ లను ప్రిపేర్ చేస్తుంది. మొదటిది రైలు బయలుదేరడానికి 4గంటల ముందు ప్రిపేర్ అవుతుంది. రెండవ చార్ట్ రైలు స్టార్ట్ అవ్వడానికి ముందు ప్రిపేర్ అవుతుంది.
ఆన్లైన్లో కానీ, ఆఫ్లైన్ లో కానీ బుక్ చేసుకోవచ్చు
ఇంతకుముందు రైల్వే టికెట్లను బుక్ చేసుకోవాలి అనుకుంటే అరగంట ముందు వరకు మాత్రమే టికెట్ బుకింగ్ అనుమతించేవాళ్ళు కానీ ఇప్పుడు ఖాళీగా ఉన్న సీట్ల కోసం రైలు బయలుదేరడానికి ఐదు నిమిషాల ముందు వరకు కూడా టికెట్లను బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది రైల్వేశాఖ. ఇక రైలు బయలుదేరక ఐదు నిమిషాల ముందు ఆన్లైన్లో కానీ, ఆఫ్లైన్ లో కానీ టికెట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని తీసుకువచ్చింది.
బోర్డింగ్ స్టేషన్ నుంచి మాత్రమే బుక్ చేసుకోండి
అయితే ఈ సదుపాయం బోర్డింగ్ స్టేషన్ నుంచి మాత్రమే బుక్ చేసుకోవాలి. మధ్యలో ఎక్కడో ఉన్న స్టేషన్ నుంచి కావాలంటే సాధ్యం కాదు.. ఒకవేళ మధ్య స్టేషన్ నుంచి టికెట్ కావాలంటే మాత్రం టీటీఈని సంప్రదించాలి. ఇక ఈ విధానంలో ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవాలనుకునేవారు ఐఆర్సిటిసి యాప్ ఓపెన్ చేసి ట్రైన్ సింబల్ పై క్లిక్ చేస్తే చార్ట్ వేకెన్సీ సదుపాయం కల్పిస్తుంది.
సీట్లు ఖాళీ ఉంటే 5 నిముషాల ముందు టికెట్లు బుక్ సదుపాయం
నేరుగా ఆన్లైన్ చార్ట్స్ వెబ్సైట్ లో వెళ్లి చెక్ చేయొచ్చు. అక్కడ రైలు నెంబరు, పేరు, తేదీ ఎక్కాల్సిన స్టేషన్ వివరాలు ఎంటర్ చేసి గెట్ ట్రైన్ చార్ట్ పై క్లిక్ చేస్తే వెంటనే తరగతుల వారీగా అందుబాటులో ఉన్న ఖాళీ సీట్ల వివరాలు వస్తాయి. ఇక అందులో సీట్లు ఖాళీగా ఉంటే టికెట్ బుక్ చేసుకోవచ్చు. ట్రైన్ ప్రారంభమయ్యే స్టేషన్లలో రైలు ఎక్కే వారికే ఈ ఆప్షన్ చాలా బాగా పనిచేస్తుంది.












Click it and Unblock the Notifications