జంతర్ మంతర్ స్ధానంలో కొత్త వేదిక- రోజుకు 1.21 లక్షల ఫీజు-డిసెంబర్లో 3 డేట్స్..!
ఎస్ఐఆర్ అక్రమాల నేపథ్యంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ విపక్షాలు, కాక్రోచ్ జనతా పార్టీ, విద్యార్ధి సంఘాలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలకు పిలుపునిచ్చాయి. దీంతో వారిని అక్కడికి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటూ వస్తున్న కేంద్రం.. తాజాగా జంతర్ మంతర్ ను నిరసన స్థలంగా రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. జంతర్ మంతర్ స్ధానంలో మూడు ప్రత్యామ్నాయ వేదికల్ని నిరసనలకు కేటాయించిన కేంద్రం.. అందులో రామ్ లీలా మైదాన్ (Ramlila Maidan) ను ముందుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
దశాబ్దాలుగా ఢిల్లీలో నిరసనలకు వేదికగా ఉన్న జంతర్ మంతర్ ను ఇప్పుడు రద్దు చేస్తూ ఇతర ప్రాంతాల్లో నిరసనలు చేసుకోవాలంటూ నిరసనకారులకు కేంద్రం సూచించింది. ఇందులో ఒకటైన రాం లీలా మైదానాన్ని నిరసనకారులకు ఇచ్చేందుకు సిద్దమైంది. అయితే గతంలో జంతర్ మంతర్ వద్ద నిరసనలకు ఎలాంటి ఛార్జీలు లేవు. కానీ ఇప్పుడు రామ్ లీలా మైదాన్ కు మాత్రం రోజుకు లక్షకు పైగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ నిరసనలు చేసుకునే వారు రోజుకు రూ.1.21 లక్షల ఫీజు చెల్లించాలని అధికార వర్గాలు తెలిపాయి. అలాగే రాం లీలా మైదానం ఎప్పుడు పడితే అప్పుడు రెగ్యులర్ గా అందుబాటులో ఉండదు. ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ లోని హార్టీకల్చర్ శాఖ నుంచి బుక్ చేసుకోవాలి. అలాగే ఢిల్లీ పోలీసుల అనుమతి కూడా తప్పనిసరి.

రాం లీలా మైదానాన్ని నిరసనల కోసం బుక్ చేసుకునేందుకు ప్రస్తుతం మూడు తేదీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అదీ డిసెంబర్ 29, 30, 31 తేదీల్లో మాత్రమే. అంటే అప్పటివరకూ ఈ మైదానాన్ని ఎవరూ బుక్ చేసుకునేందుకు వీల్లేదు. కేవలం 50 వేల మంది మాత్రమే కూర్చొనేందుకు వీలున్న రాంలీలా మైదానం గతంలోనూ పలు నిరసనలకు వేదికైంది. అయితే జంతర్ మంతర్ తో పోలిస్తే ఫీజు చెల్లించాల్సి రావడం, ముందస్తు బుక్ చేసుకోవాల్సి రావడం, తక్కువ మంది కూర్చుకొనేందుకు మాత్రమే వీలుండటంతో ఇక్కడ నిరసనలకు ఎక్కువ మంది మొగ్గు చూపరు. ఇప్పుడు అలాంటి వేదికను నిరసనకారుల కోసం కేటాయించ్ిన కేంద్రం.. ఫీజు చెల్లించి డిసెంబర్ చివర్లో ఇస్తాం, ముందస్తు బుకింగ్ చేసుకోవాల్సిందే అని చెప్పడం ద్వారా తమ మనసులో మాటను బయటపెట్టుకుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.














Click it and Unblock the Notifications
