షారూక్ ఖాన్ ఇంటి వద్ద ర్యాంప్ కూల్చివేత
ముంబై: బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ ఇంటి వెలుపల అక్రమంగా నిర్మించిన ర్యాంప్‌ను ముంబై నగర అధికారులు శనివారంనాడు కూల్చేశారు. ఆయన మన్నత్ బంగళా వద్ద అక్రమంగా నిర్మించారనే ఆరోపణపై ర్యాంప్‌ను అధికారులు కూల్చేశారు. ఈ ర్యాంప్ విషయమై బృహ ముంబై నగర పాలక సంస్థ (బిఎంసి) అధికారులు గత వారం నోటీసు ఇచ్చారు.
ఆ నిర్మాణాన్ని తొలగించడానికి బిఎంసి అధికారులు షారూక్ ఖాన్‌కు వారం రోజుల గడువు ఇచ్చారు. ర్యాంప్ వల్ల ఇబ్బంది ఎదురవుతోందని, ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని బిజెపి ఎంపి పూనం మహాజన్ ఫిర్యాదు చేయడంతో బిఎంసి అధికారులు ఆ చర్యలు చేపట్టారు.

ర్యాంప్‌పై మహాజన్ జనవరి 29వ తేదీన మున్సిపల్ కమిషనర్ సితారాం కుంటేకు లేఖ రాశారు. ఆమె తన లేఖలో షారూక్ ఖాన్ పేరును ప్రస్తావించలేదు. ఓ బంగళా యజమాని నిర్మించిన ర్యాంప్ వల్ల రోడ్డుపై ప్రజలు సాగడానికి ఇబ్బంది అవుతుందని ఆమె తన లేఖలో ఫిర్యాదు చేశారు.
తన వ్యక్తిగత భారీ మోటారు వాహనాన్ని పార్కు చేసుకోవడానికి ఆ ర్యాంప్‌ను నిర్మించినట్లు అనిపిస్తోందని, పౌరుల భద్రత, సౌకర్యం దృష్ట్యా ఆ అక్రమ ర్యాంప్‌ను తొలగించాలని ఆమె అన్నారు. షారూక్ ఖాన్ వ్యానిటీ వ్యాన్‌ను అక్కడ అప్పుడప్పుడు పార్కు చేస్తూ ఉంటారు. మౌంట్ మేరీ చర్చికి వెళ్లే మార్గంలో ఆ ర్యాంప్ వల్ల తీవ్రమైన అసౌకర్యం కలుగుతోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications