జూలై నుంచి ప్రతి నెలా వారి అకౌంట్‌లో రూ. 8,500 జమ
Lok Sabha elections 2024 Phase 7: దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. జూన్ 1వ తేదీన ఏడో విడత పోలింగ్ జరుగనుంది. ఇదే చివరిది. ఇప్పటివరకు ఆరుదశల్లో పోలింగ్ ముగిసింది. ఏపీ అసెంబ్లీ వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది.
చివరి విడతలో మొత్తం ఎనిమిది రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. బిహార్- 8, చండీగఢ్- 1, హిమాచల్ ప్రదేశ్- 4, జార్ఖండ్- 3, ఒడిశా- 6, పంజాబ్- 13, ఉత్తరప్రదేశ్- 13, పశ్చిమ బెంగాల్- 9 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ షెడ్యూల్ అయిందా రోజున.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా మొత్తం 598 మంది అభ్యర్థులు రంగంలో నిలిచారు. మోదీ పోటీలో నిలిచిన ఉత్తరప్రదేశ్‌లోని వారణాశి నియోజకవర్గానికీ అదే రోజున పోలింగ్ ఉంటుంది. చివరి దశలో కూడా పైచేయి సాధించడానికి ఎన్డీఏ, ఇండియా కూటమి నాయకులు విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటోన్నారు. ముమ్మరంగా ప్రచారం సాగిస్తోన్నారు.
ఇందులో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ.. హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కీలక హామీలను ఇచ్చారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టబోయే సంక్షేమ పథకాల గురించి వివరించారు.
జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడుతాయని, కేంద్రంలో తమ ప్రభుత్వం ఏర్పడబోతోందని చెప్పారు. ఆ తరువాతి నెల అంటే జూలై 5వ తేదీ నుంచి తమ సంక్షేమ పథకాలు అమల్లోకి వస్తాయని రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని చెప్పారు. తమ ప్రభుత్వం తొలి కేబినెట్‌లోనే దీనికి సంబంధించిన తీర్మానాలను ఆమోదిస్తామని రాహుల్ గాంధీ అన్నారు.

ఎన్నికల ఫలితాలు వెలువడిన ఈ నెల రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి పేద కుటుంబంలో ఓ మహిళను లబ్దిదారుగా ఎంపిక చేసి, ఆమె పేరు మీద బ్యాంక్ అకౌంట్ తెరుస్తామని చెప్పారు. అందులో ప్రతి నెలా 5వ తేదీన 8,500 రూపాయలను జమ చేస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
పేద మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి జులై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్.. ఇలా ప్రతి నెలా 5వ తేదీ నాటికి వారి అకౌంట్లల్లో 8,500 రూపాయలు జమ అవుతుంటాయని హామీ ఇచ్చారు. అన్ని డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారంటూ మీడియా ప్రశ్నలు అడిగిన ప్రతీసారీ ఈ 8,500 రూపాయలు రెట్టింపు అవుతుంటాయని రాహుల్ గాంధీ వివరించారు.












Click it and Unblock the Notifications