అమ్మ-నాన్న, అంజలి, కోచ్...: అందరికీ సచిన్ థ్యాంక్స్

ముంబై: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలుకు ముందు తన తండ్రిని, తల్లిని, సోదరుడిని, కోచ్‌ను, స్నేహితులను, అభిమానులను, సహచరులను అందర్నీ తలుచుకున్నారు. వీడ్కోలు సచిన్‌ను భావోద్వేగానికి గురి చేసింది. కంటతడి పెట్టించింది. విండీస్‌తో టెస్ట్‌ను విజయవంతంగా ముగించిన అనంతరం స్టేడియం మొత్తం సచిన్.. సచిన్ అంటుంటే మాస్టర్ తన మనసు విప్పారు.

'నా అద్భుతమైన ప్రయాణం ముగుస్తోందంటే నమ్మడం కష్టంగా ఉంది. ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్పాల్సిన వారి జాబితా నా చేతిలోనే ఉంది. ఇంత సుదీర్ఘ ప్రయాణంలో అందర్నీ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి ఒకవేళ ఎవరినైనా మర్చిపోయి వుంటే క్షమించండి.ముందుగా మా నాన్న.. ఆయన మార్గదర్శకం లేకుంటే నేనీ రోజు మీ ముందు ఇలా నిలబడేవాడిని కాదు. నాకు 11 ఏళ్ల వయసున్నపుడు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుంటాను అని ఆయనతో చెప్పాను.

Sachin Tendulkar leaves India in tears

"నీ కలల సాకారానికి ముందుకు సాగిపో. ఎంత కష్టమైనా వెనుకడుగు మాత్రం వేయవద్దు' అని ప్రోత్సహించారు. దురదృష్టవశాత్తు ఆయన మా మధ్య లేరు. 1999లో కాలం చేశారు. ఆ తర్వాత స్థానం నా తల్లిది. నాలాంటి అల్లరి పిల్లవాడితో ఆమె ఎలా వేగిందో తెలియదు. నేను ఆరోగ్యంగా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంది. నా కెరీర్ ప్రారంభించక ముందు నుంచే ఆమె నాకోసం ప్రార్థనలు మొదలుపెట్టింది. బహుశా ఆ ప్రార్థనలే నాకు ఇంత బలాన్ని ఇచ్చాయేమో!

చిన్నప్పుడు మా ఇంటికి బడి చాలా దూరంలో ఉండేది. అందుకే, నాలుగేళ్లపాటు మా అంకుల్, ఆంటీ వాళ్ల ఇంట్లో పెరిగాను. వాళ్లు నన్ను తమ సొంతబిడ్డలా చూసుకున్నారు. నేను బాగా ఆడేందుకు కావాల్సిన ఆహారం పెట్టేవారు. మా అన్నయ్య నితిన్. ఎక్కువగా మాట్లాడటం ఆయనకు ఇష్టముండదు. 'నువ్వు ఏం చేసినప్పటికీ... వందశాతం మనసుపెట్టి చేస్తావు' అని నాతో అన్నారు. నేను బాగా గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి నా అక్క సవిత. నా ఫస్ట్ క్రికెట్ బ్యాట్‌ను ఆమెనే బహుమతిగా ఇచ్చింది.

అది కశ్మీరీ బ్యాట్. నేను బ్యాటింగ్ చేస్తుంటే ఇప్పటికీ ఆమె ఉపవాసం ఉంటుంది. అత్యంత ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి మా అన్నయ్య అజిత్ గురించి. ఆయన గురించి ఎక్కువగా చెప్పడం తనకు ఇష్టం ఉండదు. ఆయన క్రికెటర్ కావాలనేది మా కల. అయితే నాకోసం అతను తన కెరీర్‌నే త్యాగం చేశాడు. నా 11 ఏళ్ల వయసులో... నన్ను అతనే అచ్రేకర్ సార్ వద్దకు తీసుకెళ్లాడు. ఈ రోజు రాత్రి కూడా అతను నేను అవుటైన తీరు గురించే మాట్లాడాడు. నేను సరిగా ఆడని ప్రతీసారి మా ఇద్దరి మధ్య ఆటలో నా లోపాల గురించే చర్చ సాగుతుంది. అదే గనుక జరిగుండకపోతే నేను ఈ స్థాయి క్రికెటర్‌గా ఎదిగేవాడిని కాదు.

ఇక నా జీవితంలో అత్యంత మధురమైన ఘట్టం అంజలిని కలవడం. ఒక డాక్టర్‌గా ఆమెకు సుదీర్ఘమైన కెరీర్ ఉందన్న విషయం నాకు బాగా తెలుసు. కానీ.. నాకోసం ఆమె తన డాక్టర్ కెరీర్‌ను త్యాగం చేసింది. 'నువ్వు ఆటను కొనసాగించు. నేను పిల్లల్ని చూసుకుంటాను' అని నాకు అండగా నిలిచింది. నా కోసం ఇవన్నీ భరించినందుకు ఆమెకు నా కృతజ్ఞతలు. సచిన్ తన గురించి మాట్లాడుతుండగా అంజలి కన్నీరు పెట్టుకున్నారు.

అంజలీ... నేను చెప్పిన 'నాన్సెన్స్'ను భరించినందుకు చాలా థ్యాంక్స్. నా జీవితంలో అత్యుత్తమ భాగస్వామ్యం నీతోనే! సారా, అర్జున్... ఇద్దరూ నాకు రెండు విలువైన రత్నాలు. వాళ్ల పుట్టిన రోజులు, సెలవులు, స్పోర్ట్స్ డేస్, వార్షికోత్సవాలు ఇలా... చాలా మిస్ అవుతూనే ఉన్నాను. 14-16 ఏళ్లుగా వారికోసం సమయం కేటాయించలేకపోయాను. కాలా అలా గడిచిపోయింది. ఇప్పుడు నా కూతురుకు 16, నా కుమారుడికి 14 సంవత్సరాలు. నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్.

మీ ఇద్దరూ నాకు చాలా ప్రత్యేకమైనవారు. ఇన్నేళ్లు మీతో తగినంత సమయం గడపలేకపోయాను. రాబోయే 16 ఏళ్లు, ఆ తర్వాత వచ్చే సమయమంతా మీకే కేటాయిస్తానని మాట ఇస్తున్నా. ఇక నా అత్తమామలు.. ఆనంద్ మెహతా, యానాబెల్! వారితో ఎన్నో విషయాలు చర్చించాను. మాది బలమైన అనుబంధాలున్న కుటుంబం. అన్నిటికంటే ముఖ్యంగా... అంజలిని పెళ్లి చేసుకునేందుకు వాళ్లు అంగీకరించినందుకు థ్యాంక్స్ చెబుతున్నాను.

నా స్నేహితులు.. గత 24 ఏళ్లుగా నా కోసం వారు ఎంతో చేశారు. నేను ఒత్తిడిలో ఉన్నపుడు అండగా నిలిచారు. తమ సొంత పనివదిలేసి... నేను పిలవగానే నాకోసం బౌల్ చేయడానికి వచ్చేవారు. నేను గాయపడినప్పుడు... 'ఇక కెరీర్ ముగిసినట్లే' అనుకున్నాను. కానీ... చాలామంది తెల్లవారుజామున 3 గంటలకు కూడా ఫోన్ చేసి నాకు ధైర్యం చెప్పారు. 'ఇంకా ముగియలేదు' అనే నమ్మకం కలిగించారు.

నా క్రికెట్ కెరీర్ 11 ఏళ్లపుడు మొదలైంది. నా గురువు అచ్రేకర్ సర్‌ని స్టాండ్స్‌లో చూస్తుంటే మరింత ఆనందం కలుగుతోంది. మా అన్నయ్య నన్ను అచ్రేకర్ సార్ వద్దకు తీసుకెళ్లారు. నా జీవితంలో అత్యంతమైన కీలకమైన ఘట్టం అదే. అచ్రేకర్ సర్ నన్ను స్కూటర్ మీద ముంబై మొత్తం తిప్పేవారు. ఒక ఇన్నింగ్స్ శివాజీ పార్క్‌లో ఆడితే, మరో ఇన్నింగ్స్ ఆజాద్ మైదాన్‌లో ఆడేవాడిని. సాధ్యమైనంత ఎక్కువ ప్రాక్టీస్ ఉండేందుకు సార్ ప్రయత్నించేవారు.

గత 29 సంవత్సరాల్లో 'బాగా ఆడావ్' అని ఆయనెప్పుడూ నన్ను ప్రశంసించలేదు. నాలో ఉదాసీనత ప్రవేశించి, కష్టపడి ఆడటం మానేస్తానేమో అని ఆయన ఉద్దేశం. ఇప్పుడు మా సార్‌తో కొంచెం సరదాగా చెబుతున్నా... 'సార్... ఇప్పుడు మీరు వెల్‌డన్ అని అనొచ్చు. ఎందుకంటే, ఇక ముందు నేను ఆడాల్సిన మ్యాచ్‌లు లేవు'.

నా కెరీర్‌ను ఇక్కడే, ముంబైలో ప్రారంభించాను. తెల్లవారుజామున 4 గంటలకు ఫ్లైట్ దిగి, తెల్లవారగానే రంజీ ఆడిన రోజు నాకు గుర్తుంది. కేవలం 16 ఏళ్ల వయసున్న నాపై నమ్మకముంచి... భారత్ తరఫున ఆడేందుకు తొలి అవకాశమిచ్చిన బిసిసిఐతో నాకు బలమైన అనుబంధముంది. సెలెక్టర్లకు ధన్యవాదాలు. నా కెరీర్ మొత్తం ఎంసీఏతోపాటు బీసీసీఐ నాకు అండగా నిలిచింది. సెలెక్టర్లకు, నాతో కలిసి క్రికెట్ ఆడిన సీనియర్ ఆటగాళ్లు.. ఇక్కడ బిగ్ స్క్రీన్‌పై కనిపిస్తున్న ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ అందరికీ కృతజ్ఞతలు. ఇప్పుడిక్కడ లేకున్నా అనిల్ కుంబ్లేకు, కోచ్‌లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.

నా టీమ్... కుటుంబం తర్వాత కుటుంబం వంటిది మ్యాచ్ ఆరంభానికి ముందు ధోనీ నాకు 200వ టెస్ట్ క్యాప్ అందించినపుడు టీమ్ సభ్యులందరితో మాట్లాడాను. 'దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు మనమంతా గర్వపడాలి. హుందాగా వ్యవహరించాలి. ఇదే స్ఫూర్తితో మీరు కూడా దేశానికి సేవ చేస్తారని భావిస్తున్నాను' అని వారితో చెప్పాను. శక్తివంచన లేకుండా కృషి చేయాలని, దేశానికి ఎంతో కీర్తి సాధించి పెట్టాలని వారిని కోరుకుంటున్నాను.

నా కోసం పనిచేసిన డాక్టర్లు, ఫిజీషియన్లకు కూడా ధన్యవాదాలు. గాయాలైన సమయంలో వాళ్లు నా కోసం అహర్నిశలు కృషి చేశారు. ఎప్పుడు ఫోన్ చేసినా చేయగానే... ముంబై నుంచి చెన్నైకి, ఢిల్లీకి వచ్చేవారు. నా స్నేహితుడు, మేనేజర్ మార్క్ మస్కరెన్హాస్.. కారు ప్రమాదంలో చనిపోయాడు. మార్క్ స్థానాన్ని భర్తీ చేసిన ప్రస్తుత మేనేజ్‌మెంట్ టీమ్ డబ్ల్యూఎస్‌జీకి కూడా థ్యాంక్స్.

ఇక 14 ఏళ్లుగా నాకు సహకరిస్తున్న మిత్రుడు వినయ్ నాయుడు.. మా కుటుంబంలో ఒక సభ్యుడిగా కలిసిపోయాడు. అతని కుటుంబానికి కూడా ధన్యవాదాలు. ఇక నా స్కూల్ రోజుల నుంచి ఈ రోజు దాకా నా కెరీర్ మొత్తం నన్ను ప్రోత్సహిస్తూ.. వచ్చిన మీడియాకి ప్రత్యేక కృతజ్ఞతలు. చిరస్మరణీయంగా నిలిచిపోయే ఫొటోలు తీసిన ఫొటోగ్రాఫర్లకు కూడా అభినందనలు. నేను ఎక్కువ సేపు మాట్లాడుతున్నాను. ముఖ్యంగా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది నా అభిమానులకి. నేనాడే మ్యాచ్ చూసేందుకు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+