బీజేపీకి శశికళ మరో ఝలక్: రామ్మోహన్ రావుకు సిఎస్‌గా ఛాన్స్?
అన్నాడీఎంకే శాసన సభాపక్ష నాయకురాలిగా ఎన్నికై, మరో రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్న శశికళ కేంద్రానికి మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
చెన్నై: అన్నాడీఎంకే శాసన సభాపక్ష నాయకురాలిగా ఎన్నికై, మరో రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్న శశికళ కేంద్రానికి మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
ఐటీ దాడులతో ఉక్కిరిబిక్కిరి అయి తీవ్ర అవినీతి ఆరోపణల్లో చిక్కుకుని పదవికి దూరమైన తమిళనాడు మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన రావు తిరిగి ఆ పదవిలోకి వచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. సిఎస్ పైన నాటి దాడులు కేంద్ర ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా చేసినవనే ఆరోపణలు ఉన్నాయి.

తమిళనాట జరుగుతున్న తాజా పరిణామాలను చూస్తే అవుననే అంటున్నారు. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాజీనామా చేయడం, శాసనసభా పక్ష నేతగా శశికళ ఎన్నిక కావడం ఆదివారం నాడు చకచకా జరిగిపోయాయి.
తనను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపిన శశికళ పాలనలో తనదైన ముద్ర వేసేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్‌లను పూర్తిస్థాయిలో మార్చనున్నట్టు తెలుస్తోంది.
అలాగే అవినీతి ఆరోపణలతో పదవి కోల్పోయిన మాజీ చీఫ్ సెక్రటరీ రామ్మోహన రావును తిరిగి సీఎస్‌గా నియమించవచ్చునని అంటున్నారు. అంతేకాదు తనపై అసంతృప్తితో ఉన్న వారిని బుజ్జగించడం ద్వారా వారిని అక్కున చేర్చుకుని తనకు ఎదురులేకుండా చేసుకునేందుకు శశికళ పావులు కదుపుతున్నారు.
అన్నాడీఎంకే మూడు ముక్కలేనా?
సీఎం పన్నీర్ సెల్వంది ఒక వర్గంగా, పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళది ఒక వర్గంగా ఏఐడీఎంకే పార్టీ చీలిపోయినట్లు వార్తలు వచ్చాయి. అలాగే జయ మేన కోడలు దీపకు కూడా పార్టీ నుంచి కొంతమంది మద్దతు ఉందని తమిళ ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు.
ఈ లెక్కన చూస్తే రెండు ఆకుల పార్టీ మూడు ముక్కలైందని సోషల్ మీడియాలో నెటిజెన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే సీఎం పీఠంపై కన్నేసిన శశికళ.. తాను అనుకున్నట్లుగానే పన్నీర్ సెల్వంను ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పించింది.
దీనిపై డిఎంకే అధినేత స్టాలిన్ మాట్లాడుతూ.. ప్రజలు జయలలితను చూసి ఓటేశారని, కుటుంబ సభ్యులను చూసి కాదని, శశికళను సీఎంగా అంగీకరించరన్నారు. మరోవైపు, అన్నాడీఎంకే సాసన సభా పక్ష నేతగా ఎన్నికైన అనంతరం శశికళ మాట్లాడారు. తాను సీఎం కావాలని పన్నీరు సెల్వమే ఒత్తిడి తెచ్చారని, ఆయన లాయల్ బ్రదర్ అని కితాబిచ్చారు.












Click it and Unblock the Notifications