చైనా గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న భారత ఇంజనీరింగ్ అద్భుతం ‘సెలా టన్నెల్’!
భారత రక్షణ రంగానికి కొండంత అండగా నిలుస్తూ సరిహద్దుల్లో వ్యూహాత్మక బలాన్ని పెంచిన ఇంజనీరింగ్ అద్భుతం 'సెలా సొరంగం'. చైనా సరిహద్దులకు ఆనుకుని అత్యంత కీలకమైన అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ ప్రాంతానికి భారత సైనిక బలగాలను, యుద్ధ సామాగ్రిని వేగంగా తరలించేందుకు సరిహద్దు రహదారుల సంస్థ ఈ సొరంగ మార్గాన్ని నిర్మించింది. ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన ఈ కలల ప్రాజెక్టును దాదాపు రూ.825 కోట్ల వ్యయంతో పూర్తి చేసి జాతికి అంకితం చేశారు.
13వేల అడుగుల ఎత్తులో నిర్మించారు
సముద్ర మట్టానికి దాదాపు 13,000 అడుగుల ఎత్తులో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత పొడవైన రెండు లైన్ల సొరంగ మార్గంగా ఇది ప్రపంచ రికార్డు సృష్టించింది. మొత్తం 12 కిలోమీటర్ల మేర కొత్తగా వేసిన రహదారులతో పాటు ఇందులో రెండు ప్రధాన సొరంగాలు ఉంటాయి. మొదటిది సుమారు 980 మీటర్ల పొడవైన ఒకే మార్గపు సొరంగం కాగా, రెండోది 1,595 మీటర్ల పొడవుతో అత్యవసర సేవల కోసం ప్రత్యేక ఎగ్జిట్ తో ఉండే జంట సొరంగం. మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ దాకా పడిపోయే చలిని, హిమపాతాలను తట్టుకుని 'ఆస్ట్రియన్ సొరంగ నిర్మాణ సాంకేతికత' ద్వారా భారత ఇంజనీర్లు దీనిని అత్యంత దృఢంగా నిర్మించారు.

మూసుకుపోయే మార్గం అందుబాటులోకి
గతంలో శీతాకాలంలో విపరీతమైన మంచు కురిసి సేలా కనుమ మార్గం పూర్తిగా మూసుకుపోయేది, దీనివల్ల తవాంగ్ ప్రాంతానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయేవి. అయితే ఈ సొరంగం అందుబాటులోకి రావడంతో ఏడాది పొడవునా ఎటువంటి ఆటంకం లేకుండా సైనిక వాహనాలు, శతఘ్నులు, బరువైన ట్యాంకులు నేరుగా నియంత్రణ రేఖ వద్దకు చేరుకోగలవు. అంతేకాకుండా అస్సాంలోని తేజ్పూర్ లేదా గౌహతి నుంచి తవాంగ్కు వెళ్లే ప్రయాణ సమయం గంటకు పైగా తగ్గింది.
గంటకు తగ్గిన ప్రయాణ సమయం
ఈ ప్రాజెక్టు వల్ల కేవలం సైనికులకే కాకుండా స్థానిక ప్రజలకు కూడా రవాణా కష్టాలు తప్పాయి. అత్యవసర వైద్య సేవలు అందడంతో పాటు అరుణాచల్ ప్రదేశ్లో పర్యాటక రంగం ఏడాది పొడవునా పుంజుకోవడానికి ఈ మార్గం ఎంతో దోహదపడుతోంది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వెసులుబాటు, అధునాతన గాలి వెలుతురు వ్యవస్థలు, అగ్నిమాపక పరికరాలు, పర్యవేక్షణ కెమెరాలు వంటి రక్షణ సౌకర్యాలతో రూపొందించిన ఈ సేలా సొరంగం సరిహద్దు భద్రతను బలోపేతం చేయడంలో సరిహద్దు రహదారుల సంస్థ సాధించిన అపూర్వ విజయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.














Click it and Unblock the Notifications
