అధికారిక ప్రకటన: యూపీ కాంగ్రెస్ సీఎం అభ్యర్ధిగా షీలా దీక్షిత్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొత్త సంప్రదాయానికి తెరలేపింది. కాంగ్రెస్ పార్టీ తరుపున ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పేరు ఖరారు చేసింది. ఈ మేరకు గురువారం కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది.

కాగా, యూపీ సీఎం అభ్యర్ధి రేసులో ప్రియాంక గాంధీ, గులాం నబీ ఆజాద్ తదితరుల పేర్లు వినిపించినప్పటికీ చివరకు షీలా దీక్షిత్ వైపే కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గు చూపింది. గురువారం న్యూఢిల్లీలోని ఏఐసీసీ హెడ్ క్వార్టర్‌లో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

Sheila Dikshit named Congress UP CM candidate

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఆమెకు ఉన్న రాజకీయ అనుభవం, హార్డ్ వర్క్‌ను దృష్టిలో పెట్టుకుని ఆమెను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.అనంతరం షీలా దీక్షిత్ మీడియాతో మాట్లాడుతూ యూపీ బాధ్యతలను ఇచ్చినందుకు కాంగ్రెస్ హైకమాండ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

నాపై చాలా పెద్ద బాధ్యతను పెట్టారని అన్నారు. నాపై కాంగ్రెస్ పెద్దలు నమ్మకం ఉంచినందుకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు వస్తాయని నమ్మకం ఉందని చెప్పారు. ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రమని, ఈ ఎన్నికలను తాము ఛాలెంజ్‌గా తీసుకుంటున్నామని అన్నారు. ఎస్పీ పాలనలో యూపీ ప్రజలు విసిగిపోయారని కాంగ్రెస్‌ను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయానికి కృషి చేస్తానని ఆమె చెప్పారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కూతురు ప్రియాంక గాంధీపై ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ పొగడ్తల వర్షం కురిపించారు. ప్రియాంకా గాంధీ పాపులర్ అని పేర్కొన్నారు. ఆమెకు అటు ప్రజల్లో ఇటు పార్టీ కార్యకర్తలో మంచి ఆదరణ ఉందని పేర్కొన్నారు.

అందుకే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో ఆమె సేవలను ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ మూడు పర్యాయాలు పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్ సలహా మేరకు ఆమెను సీఎం అభ్యర్ధిగా ప్రకటించారని సమాచారం.

ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి ఉమా శంకర్ దీక్షిత్ కుమార్తె షీలా దిక్షిత్‌. ఢిల్లీలోనే కాకుండా యూపీలో కూడా షీలా దీక్షిత్‌కు మంచి ఇమేజి ఉంది. యూపీలో కాంగ్రెస్‌కు ఎప్పటినుంచో మద్దతుదారులుగా ఉన్న బ్రాహ్మణ ఓటర్లు మండల్ ఉద్యమం అనంతరం బిజెపి వైపు తిరిగారు.

ఆ తర్వాత కొంతకాలం పాటు మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ పార్టీ వైపు మొగ్గు చూపారు. కాగా వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో యూపీలో తిరిగి పాగా వేయడం కోసం బ్రాహ్మణ ఓటర్లను ఆకట్టుకోవడం కోసం కాంగ్రెస్ ప్రస్తుతం భారీ స్థాయిలో కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా యూపీ సీఎం అభ్యర్ధిగా షీలా దీక్షిత్‌ను ప్రకటించింది.

షీలా దీక్షిత్‌కు ఏసీబీ సమన్లు

కాంగ్రెస్ పార్టీ యూపీ సీఎం అభ్యర్థిగా షీలా దీక్షిత్‌ను అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ఆమెకు సమన్లు జారీ చేసింది. కోట్లాది రూపాయల వాటర్ ట్యాంక్ కుంభకోణంలో షీలాకు నోటీసులు జారీ చేశామని, ఆమెను ఆగస్టు 26న తమ ఎదుట హాజరు కావాల్సిందిగా కోరామని ఏసీబీ చీఫ్ ఎమ్ కే మీనా తెలిపారు.

వివరాల్లోకి వెళితే... ఢిల్లీకి సీఎంగా షీలా దీక్షిత్ ఉన్న సమయంలో ఆమే వాటర్ బోర్డు చైర్మన్‌గా కూడా ఉన్నారు. ఆ సమయంలో ఢిల్లీ వాటర్ బోర్డులో అవినీతి చోటు చేసుకుంది. దీనిపై ఆమ్ ఆద్మీ సర్కార్ విచారణకు ఆదేశించింది. ఈ క్రమం లోనే ఆమెను విచారించేందుకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former Delhi chief minister Sheila Dikshit was on Thursday named as Congress CM face in Uttar Pradesh where assembly elections are due next year.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి