Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ నిర్బంధంపై కేంద్రానికి సుప్రీం షాక్..!
లడఖ్ కు చెందిన పర్యావరణవేత్త సోనమ్ వాంగ్ చుక్ ను స్థానికంగా అల్లర్లు రెచ్చగొట్టారంటూ జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేసి రాజస్థాన్ కు తరలించిన వ్యవహారంపై ఇవాళ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తన భర్త సోనమ్ ను ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియదని, ఆయన్ను ఇప్పటివరకూ కలవనివ్వడం లేదని ఆరోపిస్తూ ఆయన భార్య గీతాంజలి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ పై సుప్రీంకోర్టు కేంద్రానికి కీలక ప్రశ్నలు వేసింది.
జాతీయ భద్రతా చట్టం కింద సోనమ్ వాంగ్ చుక్ ను గత నెల 26న అదుపులోకి తీసుకోవడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన భార్య గీతాంజలి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్వీ అంజారియా ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సోనమ్ ను ఆయన భార్యకు ముందస్తు నోటీసు ఇవ్వకుండా అదుపులోకి తీసుకోవడంపై కేంద్రాన్ని నిలదీసింది.

ప్రస్తుతం జోధ్ పూర్ జైల్లో ఉన్న సోనమ్ వాంగ్ చుక్ విడుదల కోరుతూ గీతాంజలి ఈ పిటిషన్ దాఖలు చేసారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 ప్రకారం సోనమ్ అరెస్టు చెల్లదని ఆమె తన పిటిషన్ లో తెలిపారు. ఆ అరెస్టుకు సంబంధించి తనకు గానీ, తన భర్తకు కానీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదని గీతాంజలి ఆక్షేపించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రంతో పాటు జమ్మూ-కాశ్మీర్, రాజస్థాన్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుపై తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది.

పర్యావరణవేత్త సోనమ్ వాంగ్ చుక్ అరెస్టు ను ఇప్పటికే పలువురు ప్రముఖులు తీవ్రంగా తప్పుబట్టారు. లడఖ్ కు రాష్ట్ర హోదా ఇవ్వాలని కోరుతూ సాగుతున్న ఆందోళనలను ఆయన రెచ్చగొట్టారంటూ అభియోగాలు మోపడాన్ని కూడా తప్పుబట్టారు. ఈ ఆందోళనల్ని విరమించాలని, శాంతియుత నిరసనలు మాత్రమే తెలపాలంటూ యువతకు సోనమ్ ఇచ్చిన సందేశాన్ని వారు గుర్తుచేస్తున్నారు.












Click it and Unblock the Notifications