లేఆఫ్స్ వేళ.. బెంగళూరులో భారీ డీల్ సెట్ చేసుకున్న TCS
TCS: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రాక తర్వాత భారీగా కుదుపులకు లోనైంది దేశీయ ఐటీ దిగ్గజం.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. లేఆఫ్స్ కింద వేలాదిమందిని తొలగించింది. తన మొత్తం ఉద్యోగుల్లో 2 శాతం అంటే దాదాపు 12,000 మంది ఉద్యోగులను లేఆఫ్ చేసింది. సంస్థ మరింత వేగంగా, భవిష్యత్తుకు అనుగుణంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. సాంకేతిక రంగంలో వేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా సంస్థను పునర్వ్యవస్థీకరించింది.
ఈ క్రమంలో టీసీఎస్ బెంగళూరులో భారీ డీల్ కుదుర్చుకుంది. యశ్వంత్ పూర్ సత్వ నాలెడ్జ్ పాయింట్ లో 1.75 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ ను లీజుకు తీసుకుంది. దీని కాలపరిమితి అయిదు సంవత్సరాలు. దీని మొత్తం అద్దె వ్యయం సుమారు రూ. 975 కోట్లు. ఈ ఒప్పందం- డార్షిత సదరన్ ఇండియా హ్యాపీ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కుదిరినట్లు రియల్ ఎస్టేట్ అనలిటిక్స్ సంస్థ ప్రాప్‌స్టాక్ వెల్లడించింది.

ఈ లీజు ప్రకారం- టీసీఎస్ నెలకు రూ. 15.37 కోట్లు అద్దె చెల్లించనుంది. ఇది ప్రతి చదరపు అడుగుకు రూ. 87.73 పైసలు అవుతుంది. లీజులో భాగంగా టీసీఎస్ రూ. 25 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్‌ను కూడా చెల్లించింది. ప్రతి మూడేళ్లకోకసారి అద్దె 14 శాతం పెరుగుతుందని, అదనంగా మరో అయిదేళ్లకు లీజును పునరుద్ధరించుకునే అవకాశం కూడా ఈ ఒప్పందంలో ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 8న ఈ ప్రాజెక్ట్ కోసం ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ పొందింది.
టీసీఎస్ టవర్- ఏలోని మూడు బేస్‌మెంట్లు, జీ+ 10 అంతస్తులు అలాగే టవర్ బీలోని రెండు బేస్‌మెంట్లు, జీ+ 12 అంతస్తుల్లో టీసీఎస్ తన కార్యకలాపాలను కొనసాగించనుంది. ఈ ఏడాది ప్రారంభంలో- ఎలక్ట్రానిక్ సిటీలోని నీలాద్రి రోడ్‌లో ఉన్న 360 బిజినెస్ పార్క్‌లో టీసీఎస్ 1.4 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందం కింద నెలకు రూ. 9.31 కోట్ల అద్దె చెల్లిస్తోంది. మొత్తం వ్యయం సుమారు రూ. 2,130 కోట్లు. సెక్యూరిటీ డిపాజిట్ రూ. 112 కోట్లుగా ఉంది.
ఈ ఏడాది మార్చిలో.. చెన్నై నవలూర్‌లో ఉన్న ఓజోన్ టెక్నో పార్క్‌లో టీసీఎస్ 6.3 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని లీజుకు తీసుకుంది. దీనికి నెలకు రూ. 2.8 కోట్ల అద్దె కడుతోంది. ఈ సంవత్సరం బెంగళూరులో అమెజాన్ డెవలప్‌మెంట్ సెంటర్ ఇండియా, అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ మిలియన్ చదరపు అడుగులకు పైగా స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి. దీనికి నెలకు 6.1 కోట్లు అద్దె చెల్లించాయి.












Click it and Unblock the Notifications