రిపబ్లిక్ డే వేడుకలకు ఉగ్రముప్పు: ప్రధాని మోడీతో పాటు ప్రముఖులు టార్గెట్; హెచ్చరించిన ఇంటిలిజెన్స్
రిపబ్లిక్ డే వేడుకలకు ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో పాటు ప్రముఖులను టార్గెట్ చేస్తూ ఉగ్రదాడులకు కుట్రలు జరుగుతున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఢిల్లీ, పంజాబ్ తో పాటు ఇతర నగరాల్లో కూడా ఉగ్ర దాడులు జరుగుతున్న అంచనా వేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ అధికారులు చెబుతున్నారు.

మోడీతో పాటు గణతంత్ర వేడుకలకు హాజరయ్యే ప్రముఖుల ప్రాణాలకు ఉగ్రముప్పు
గణతంత్ర దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోడీ మరియు ఇతర ప్రముఖుల ప్రాణాలకు ముప్పు కలిగించే ఉగ్రవాద కుట్ర గురించి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు హెచ్చరిక అందింది.తొమ్మిది పేజీల ఇంటెలిజెన్స్ అధికారుల హెచ్చరికలలో భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే ప్రధాని మోదీ మరియు ఇతర ప్రముఖులకు ముప్పు ఉందని సూచించింది. భారత్ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఐదు మధ్య ఆసియా దేశాలు - కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్ నాయకులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించింది.

ఐదు మధ్య ఆసియా దేశాల నాయకులకు మోడీ ఆహ్వానం
2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, పీఎం నరేంద్ర మోడీ 2015లో మొత్తం ఐదు మధ్య ఆసియా దేశాలను సందర్శించారు. 2022 రిపబ్లిక్ డే ఈవెంట్‌కు సెంట్రల్ ఆసియా నాయకులను ముఖ్య అతిధులుగా ఆహ్వానించాలనే నిర్ణయం భారతదేశ మధ్య ఆసియా విధానానికి అనుగుణంగా ఉంది.ఐదు మధ్య ఆసియా దేశాలైన ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్‌స్థాన్, తుర్క్‌మెనిస్తాన్, కజకిస్తాన్ మరియు తజికిస్తాన్‌లతో భారతదేశం సాంస్కృతిక, ఆర్థిక మరియు దౌత్య సంబంధాలను పంచుకుంటుందని న్యూఢిల్లీ ఎప్పుడూ చెబుతోంది. ఈ క్రమంలోనే వారిని భారత్ రిపబ్లిక్ డే వేడుకలకు ఆహ్వానించింది.

ముఖ్య ప్రదేశాలు, బహిరంగ సభలు, చారిత్రక కట్టడాలు టార్గెట్
అయితే ఈ నేపధ్యంలో టెర్రరిస్ట్ ల నుండి ముప్పు పొంచి ఉందని ఇంటిలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి . పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ ప్రాంతానికి చెందిన గ్రూపుల నుంచి ముప్పు వచ్చిందని నోట్ పేర్కొంది. ఈ సమూహాలు అత్యంత ఉన్నత స్థానంలో ఉన్న ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని, బహిరంగ సభలు, కీలకమైన సంస్థలు మరియు రద్దీగా ఉండే ప్రదేశాలను విధ్వంసం చెయ్యటం లక్ష్యంగా పెట్టుకున్నాయని పేర్కొంది. చారిత్రక కట్టడాలని కూల్చివేసే కుట్ర జరుగుతుందని వెల్లడించింది. డ్రోన్‌లను ఉపయోగించి కూడా దాడులకు ప్రయత్నించవచ్చునని అనుమానం వ్యక్తం చేసింది

ఉగ్రదాడులకు రెడీ అవుతున్న ఉగ్రవాద సంస్థలు ఇవే
లష్కరే తోయిబా, ది రెసిస్టెన్స్ ఫోర్స్, జైషే మహ్మద్, హర్కత్ ఉల్ ముజాహిదీన్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి తీవ్రవాద గ్రూపులు ఈ ఉగ్ర ముప్పు వెనుక ఉన్నాయని ఇంటెలిజెన్స్ నివేదిక పేర్కొంది. పాకిస్తాన్‌లో ఉన్న ఖలిస్తానీ గ్రూపులు పంజాబ్‌లో మిలిటెన్సీని పునరుద్ధరింపజేసేందుకు క్యాడర్‌లను కూడా సమీకరించుకుంటున్నాయని ఇంటెలిజెన్స్ తెలిపింది. పంజాబ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ లక్షిత దాడులకు ప్లాన్ చేస్తున్నారని వెల్లడించింది.2021లో ఇంటిలిజెన్స్ వర్గాలకు అందిన ఇన్‌పుట్ ప్రకారం, ఖలిస్తానీ టెర్రర్ గ్రూపులు ప్రధానమంత్రి సమావేశం మరియు పర్యటన వేదికలపై దాడికి ప్లాన్ చేస్తున్నాయి. ఇక తాజాగా ఇంటిలిజన్స్ హెచ్చరికలతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు, ప్రధాన నగరాల్లో భద్రత ముమ్మరం చేశారు.












Click it and Unblock the Notifications