పెళ్లిరోజే గుండెపోటుతో పెళ్ళికూతురు మృతి, అయినా పెళ్లి జరిగిందిగా!!
పెళ్లి రోజు గుండెపోటుతో వధువు మృతి చెందిన ఘటన గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లా సుభాష్ నగర్‌లో చోటుచేసుకుంది. అయినప్పటికీ మృతురాలి కుటుంబ సభ్యులు పెళ్లి చేశారు..
పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలనుకున్న పెళ్లికూతురు పెళ్లి పీటల మీద కాలు పెట్టకుండానే కన్ను మూసింది. కొద్ది గంటల్లో పెళ్లి అనగా, కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండగా, గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయింది. బంధుమిత్రులను పిలుచుకొని, అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసుకుని, కుమార్తె పెళ్లి ఘనంగా నిర్వహిస్తామనుకున్న తల్లిదండ్రులు పెళ్లికూతురు హఠాన్మరణంతో తీవ్ర దుఃఖ సాగరంలో మునిగిపోయారు. అయినప్పటికీ పండితులు పెట్టిన ముహూర్తానికి పెళ్లి మాత్రం ఆగలేదు.

పెళ్లి రోజే కుప్పకూలిన వధువు
గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే గుజరాత్ లోని భావ్ నగర్ జిల్లా సుభాష్ నగర్ కు చెందిన జినాబాయ్ రాథోడ్ పెద్ద కుమార్తె హేతల్ కు నారీ గ్రామానికి చెందిన విశాల్ భాయ్ తో వివాహం జరగాల్సి ఉంది. అయితే మరికొద్ది గంటల్లో పెళ్లి జరగాల్సి ఉండగా పెళ్ళికొడుకు బంధుమిత్రులు, సకుటుంబ సపరివార సమేతంగా భారీ ఊరేగింపుతో వధువు ఇంటికి చేరుకున్నాడు. ఇంతలోనే హేతల్ స్పృహ తప్పి పడిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెని ఆసుపత్రికి తీసుకువెళ్లారు.

గుండెపోటుతో వధువు మృతి
ఆసుపత్రిలో వధువును పరిశీలించిన వైద్యులు ఆమె గుండుపోటుతో అప్పటికే మృతి చెందిందని తెలిపారు. దీంతో అటు వధువు, ఇటు వరుడు కుటుంబంలోనూ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శుభమా అని పెళ్లి చేసుకోవాలని భావిస్తే ఇలా జరిగింది ఏమిటి అని అంతా ఈ ఘటనతో షాక్ కు గురయ్యారు. ఇక ఇటువంటి పరిస్థితుల్లో పెళ్లి కుమార్తె కుటుంబం ఎవరూ తీసుకోని ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

బాధతోనే సంచలన నిర్ణయం.. పెళ్లి చేసిన కుటుంబం..
హేతల్ స్థానంలో ఆమె చెల్లెలిని విశాల్ భాయ్ కు ఇచ్చి అదే ముహూర్తానికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికి విశాల్ కుటుంబం కూడా అంగీకరించింది. దీంతో మృతి చెందిన వధువు హేతల్ మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచి, ఆపై హేతల్ చెల్లెలికి విశాల్ భాయ్ తో వివాహం జరిపించారు. హేతల్ మరణించిన బాధను దిగమింగుతూ పెళ్లి తంతు నిర్వహించారు ఇరు కుటుంబాల సభ్యులు. వివాహనంతరం హేతల్ అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమాన్ని బాధాతప్త హృదయాలతో నిర్వహించారు.












Click it and Unblock the Notifications