మారుతున్న యూపీ రాజకీయ ముఖచిత్రం- థర్డ్ ఫ్రంట్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతతోంది. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ లో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. దేశంలోనే అత్యధికంగా 402 అసెంబ్లీ స్థానాలు ఉన్న అతిపెద్ద రాష్ట్రం కావడం, బీజేపీకి గట్టి పట్టు ఉండటం వల్ల ఈ ఎన్నికలపై అందరి దృష్టీ నెలకొనడం సహజమే. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో వరుసగా రెండుసార్లు బీజేపీ ఇక్కడ అధికారంలోకి వచ్చింది. హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉంది. దీంతో రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది.
ఈ పరిస్థితుల మధ్య ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అనూహ్య ఎత్తుగడ వేసింది. ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని ఆజాద్ సమాజ్ పార్టీ కలిసి ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించింది. ఎంఐఎం- ఆజద్ సహా తమతో కలిసి వచ్చే ఇతర పార్టీలతో కలిపి థర్డ్ ఫ్రంట్ గా ఆవిర్భవించనుంది. నేడు లక్నోలో నిర్వహించే విలేకరుల సమావేశంలో ఈ పొత్తును అధికారికంగా ప్రకటించనున్నాయి.

రాబోయే శాసనసభ ఎన్నికలకు సంబంధించి సీట్ల సర్దుబాటు, ఉమ్మడి ప్రణాళికలను ఖరారు చేయనున్నాయి ఈ రెండు పార్టీలు కూడా. సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్‌లకు మద్దతుగా నిలుస్తూ వచ్చిన దళిత, ముస్లిం ఓటు బ్యాంక్‌ను తమవైపు తిప్పుకోవడమే ఈ థర్డ్ ఫ్రంట్ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. దళితులు, మైనారిటీ సామాజిక వర్గాల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి.
సంభాల్, రామ్ పూర్, మీరట్, కుందర్కి, ఆసమోలి, నగీనా, కాన్పూర్ కంటోన్మెంట్, బహ్రాయిచ్, శ్రావస్తి వంటి 25- 30 నియోజకవర్గాల్లో ఈ థర్డ్ ఫ్రంట్ ప్రభావం చూపొచ్చనే అంచనాలు ఉన్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్- 95, ఆజాద్ సమాజ్ పార్టీ- 110 స్థానాల్లో పోటీ చేశాయి. కొన్నిచోట్ల ప్రత్యర్థి పార్టీ అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేశాయి.
ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎంఐఎం సత్తా చాటింది. అయిదు మున్సిపాలిటీల చైర్మన్ పదవులు, 83 కౌన్సిలర్ స్థానాలను గెలుచుకోగలిగింది. బీసీలు, మైనారిటీ, దళిత వర్గాల గొంతుకను చట్టసభల్లో బలంగా వినిపించడానికి థర్డ్ ఫ్రంట్ పని చేస్తుందని మజ్లిస్ రాష్ట్ర అధ్యక్షుడు షౌకత్ అలీ స్పష్టం చేశారు. ఈ పొత్తు ద్వారా దళితులు, పేదలు, మైనారిటీలకు రాజకీయంగా తగిన ప్రాతినిధ్యం లభిస్తుందని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.













Click it and Unblock the Notifications
