టిప్పు సుల్తాన్ కు బద్ధ వ్యతిరేకిని..ఆ జ్ఞాపకాలను చెరిపేస్తాం.. పాఠ్య పుస్తకాల్లోంచి కూడా
బెంగళూరు: టిప్పు సుల్తాన్ జ్ఞాపకాలను చెరిపేస్తామని, పాఠ్య పుస్తకాల్లోంచి కూడా వాటిని తొలగిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ప్రకటించారు. తాను టిప్పు సుల్తాన్ కు బద్ధ వ్యతిరేకినని ఆయన స్పష్టం చేశారు. టిప్పు సుల్తాన్ స్వాతంత్య్ర సమర యోధుడు కాదని ఆయన తేల్చి చెప్పారు. ఏటా నవంబర్ 20వ తేదీన టిప్పు సుల్తాన్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ వస్తోంది కర్ణాటక ప్రభుత్వం. ఆ విధానానికి మంగళం పలుకుతామని యడియూరప్ప వెల్లడించారు. ఆయన జయంతిని కాదు కదా.. అసలు జ్ఞాపకాలే లేకుండా తుడి చేస్తామని అన్నారు.
టిప్పు సుల్తాన్ జయంతిని నిర్వహించాలా? వద్దా? అనే విషయంపై అధ్యయనం చేయడానికి కర్ణాటక విద్యాశాఖ మంత్రి సురేష్ కుమార్ ఇటీవలే ఓ కమిటీని నియమించారు. మరో వారం రోజుల్లోగా ఈ కమిటీ తన నివేదికను అందించాల్సి ఉంది. ఈ విషయంపై విలేకరులు ముఖ్యమంత్రి యడియూరప్పను ప్రశ్నించగా.. ఆయన ఘాటుగా స్పందించారు. టిప్పు సుల్తాన్ కు తాను బద్ధ వ్యతిరేకినని, ఆయన వర్ధంతిని నిర్వహించడాన్ని కూడా తాను ఇష్టపడనని అన్నారు. మాధ్యమిక పాఠ్య పుస్తకాల్లోంచి కూడా ఆయనపై రూపొందించిన బోధనాంశాలను తొలగించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కొద్దిరోజుల కిందటే బీజేపీ ఎమ్మెల్యే అపాచు రంజన్ ఈ డిమాండ్ ను లేవనెత్తారు. టిప్పు సుల్తాన్ భారత సంస్కృతి సంప్రదాయాలును నాశనం చేశారని విమర్శించారు. సామ్రాజ్యాన్ని, ఇస్లాం మతాన్ని విస్తరింపజేయాలనే లక్ష్యంతో హిందూ రాజ్యాలపై దాడులు చేశారని అన్నారు. అలాంటి చరిత్ర ఉన్న టిప్పు సుల్తాన్ జయంతిని కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని, ఈ ఆనవాయితీని రద్దు చేయాలంటూ ఆయన ముఖ్యమంత్రి యడియూరప్పకు లేఖ రాశారు. దీనిపై యడియూరప్ప సానుకూలంగా స్పందించారు. కర్ణాటకలో ఇకపై టిప్పు సుల్తాన్ జయంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించబోమని వెల్లడించారు.
యడియూరప్ప చేసిన ప్రకటన పట్ల ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) పార్టీల నాయకులు యడియూరప్పపై భగ్గు మంటున్నాయి. ఓ చారిత్రక తప్పిదానికి బీజేపీ ప్రభుత్వం పాల్పడుతోందని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. టిప్పు సుల్తాన్ బ్రిటీష్ ప్రభుత్వంపై తిరుగుబాటు లేవనెత్తి, వారిని ప్రతిఘటించిన స్వాతంత్య్ర సమరయోధుడని, ఆయనను కించపరిచేలా వ్యాఖ్యానించడం ముస్లింల మనోభావాలపై దెబ్బకొట్టినట్టేనని ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications