అదృష్టాన్ని విజయంగా భావిస్తే ఇలాగే ఉంటుంది: ఉద్ధవ్ థాక్రేకు రాజ్ థాక్రే చురకలు
ముంబై: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ప్రారంభమైన నాటి నుంచి ఎలాంటి వ్యాఖ్యలు చేయని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాక్రే.. సోదరుడు, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే వ్యవహారంపై తొలిసారి స్పందించారు. అంతేగాక, ఉద్ధవ్ పేరును ప్రస్తావించకుండా పరోక్షంగా చురకలంటించారు.
Recommended Video


అదృష్టాన్ని విజయంగా భావిస్తే అంతే..: రాజ్ థాక్రే
ఒక వ్యక్తి తన అదృష్టాన్ని సొంత విజయంగా భావించిన నాటినుంచే.. అతని పతనం మొదలవుతుంది అంటూ గురువారం రాజ్ థాక్రే ఓ ట్వీట్ చేశారు. సీఎం పదవికి రాజీనామా చేసిన ఉద్ధవ్ థాక్రే గురించే రాజ్ థాక్రే ఈ ట్వీట్ చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ పేరుతో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఎన్సీపీ, కాంగ్రెస్ కోరడంతో ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ బాధ్యతలు చేపట్టారు.
ఉద్ధవ్ చేసిందేమీ లేదంటూ రాజ్ థాక్రే పరోక్ష వ్యాఖ్యలు
ఈ క్రమంలోనే సీఎం కుర్చీ కేవలం అదృష్టంతో దక్కిందని, అందులో ఉద్ధవ్ థాక్రే చేసిందేమీ లేదనే అర్థం వచ్చేలా రాజ్ థాక్రే తాజా ట్వీట్ ఉండటం గమనార్హం. కాగా, రెబల్ శివసేన నేత ఏక్ నాథ్ షిండే వర్గం.. వెనక్కి రాకపోవడంతో అసెంబ్లీలో బలం లేక ఉద్ధవ్ థాక్రే బుధవారం రాత్రి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. గురువారం అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోవాల్సి ఉండగా.. అంతకుముందే ఉద్ధవ్ థాక్రే సీఎం పదవి నుంచి తప్పుకున్నారు.

బాల్ థాక్రే నిర్ణయంతో శివసేనకు దూరమైన రాజ్ థాక్రే
కాగా, శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే సోదరుడు శ్రీకాంత్ థాక్రే కుమారుడే ఈ రాజ్ థాక్రే. ఉద్ధవ్‌కు వరుసకు సోదరుడు. బాల్ థాక్రే జీవించినంత కాలం రాజ్ థాక్రే కూడా శివసేనలోనే కొనసాగారు. ఆ తర్వాత బాల్ థాక్రే.. పార్టీ బాధ్యతలు ఉద్ధవ్ థాక్రేకు అప్పగించడంతో రాజ్ థాక్రే శివసేనకు దూరమయ్యారు.
2006లో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) పేరుతో కొత్త పార్టీని పెట్టారు. తన పోరాటం శివసేనతో కాదని చెప్పారు రాజ్ థాక్రే. బాల్ థాక్రే మాదిరిగానే రాజ్ థాక్రే కూడా దూకుడు స్వభావం గల నాయకుడు. అయితే, మొదట్నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడం కూడా రాజ్ థాక్రేకు అంతగా నచ్చలేదు. కాగా, ఈ క్రమంలో రాజ్ థాక్రే బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారు.












Click it and Unblock the Notifications