కర్ణాటకకు కాబోయే సీఎం ఆయనే. కొంప కొల్లేరు చేసిన మాజీ డీసీఎం. దేవుడా కాపాడు !
బెంగళూరు/చిక్కమగళూరు: కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీకి ఇప్పుడు పెద్ద తలనొప్పి తయారైయ్యింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్ మోడల్ వర్క్ చెయ్యాలని ప్రయోగాలు చేసిన బీజేపీ హైకమాండ్ కు మొదటికే మోసం వచ్చింది. మాజీ సీఎం, మాజీ ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల్లో చేరిపోయారు.
మాజీ సీఎం జగదీష్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవదితో పాటు మరి కొంత మంది రెబల్ నాయకులతో దెబ్బతో బీజేపీ హైకమాండ్ నానా తంటాలు పడుతున్నది. ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వడానికి నిరాకరించిన నాయకుల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్. ఈశ్వరప్ప కూడా ఉన్న విషయం తెలిసిందే.
చాలా మంది నాయకులు బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల్లో చేరిపోయారు. కొందరు నాయకులు స్వతంత్ర పార్టీ అభ్యర్థులుగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే తనకు, తన కుమారుడికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పించుకోవాలని చివరి వరకు అనేక ప్రయత్నాలు చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్. ఈశ్వరప్ప మాత్రం బీజేపీలోనే ఉండిపోయారు.

బీజేపీ సీఎం అభ్యర్థి లింగాయత్ కులం వ్యక్తికి ఇస్తామని బహిరంగంగా చెప్పాలని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఒకరి మీద ఒకరు చాలెంజ్ చేసుకుంటున్నారు. అయితే సీఎం పదవి ఓ కులం వ్యక్తికి ఇస్తామని చెబితే మిగిలిన కులాల వాళ్లు వేరే పార్టీకి ఓటు వేసే అవకాశం ఉందని భయపడుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు బహిరంగంగా సీఎం అభ్యర్థిని ప్రకటించడానికి వెనకడుగు వేస్తున్నారు.
అయితే కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి, మాజీ మంత్రి సీటీ. రవి అంటూ మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్. ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. స్నేహితుల దగ్గరో, లేకుంటే బీజేపీ నాయకుల దగ్గరో ఈ మాట చెప్పివుంటే పర్వాలేదు, బహిరంగ సభలో కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి సీటీ. రవి అని బీజేపీ సీనియర్ నాయకుడు కేఎస్. ఈశ్వరప్ప చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.
ఇప్పటికే చెయ్యి జారిపోయిన సీనియర్ నాయకుల విషయంలో నానా తంటాలు పడుతున్న బీజేపీ హైకమాండ్ కు ఇప్పుడు కేఎస్. ఈశ్వరప్ప మరో పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టారని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. కేఎస్. ఈశ్వరప్ప వ్యాఖ్యలతో ప్రతిపక్షాల చేతికి మంచి అస్త్రం చిక్కినట్లు అయ్యింది. అయితే బీజేపీ నాయకులకు మాత్రం కేఎస్. ఈశ్వరప్ప వ్యాఖ్యలు మింగుడుపడటం లేదని ఆపార్టీకి చెందిన కొంత మంది నాయకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications