
అమెరికాలో మధ్యంతర ఎన్నికలు ఎందుకొస్తాయి? అయిదు పాయింట్లలో తెలుసుకోండి

అమెరికాలో 2022 నవంబర్ 8న మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు రాబోయే రెండేళ్లలో జో బైడెన్ పాలనపై, ఆ తరువాత కూడా పెద్ద ప్రభావాన్ని చూపుతాయి.
1. మధ్యంతర ఎన్నికలు ఎందుకు? ఎవరు పోటీ చేస్తారు?
ఈ ఎన్నికలు అమెరికా కాంగ్రెస్‌కు సంబంధించినవి. కాంగ్రెస్‌లో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ (ప్రతినిధుల సభ), రెండు సెనేట్.
కాంగ్రెస్ ఎన్నికలను ప్రతి రెండు రెండేళ్లకోసారి నిర్వహిస్తారు. అమెరికా అధ్యక్షుడికి నాలుగేళ్ల పదవీ కాలం ఉంటుంది. ఆ నాలుగేళ్ల మధ్యలో ఈ ఎన్నికలు పడితే వాటిని మధ్యంతర ఎన్నికలు అంటారు.
ప్రస్తుతం అమెరికాలో జో బైడెన్ పదవీ కాలం మధ్యలో ఈ కాంగ్రెస్ ఎన్నికలు వచ్చాయి కాబట్టి, వీటిని మధ్యంతర ఎన్నికలు అని పిలుస్తున్నారు.
కాంగ్రెస్ దేశవ్యాప్తంగా చట్టాలు చేస్తుంది. ఏ చట్టాలపై ఓటు వేయాలో ప్రతినిధుల సభ నిర్ణయిస్తుంది. వాటిని ఆమోదించే లేదా నిరోధించే హక్కు సెనేట్‌కు ఉంటుంది. అలాగే, అధ్యక్షుడు చేసిన అపాయింట్‌మెంట్‌లను సెనేట్ నిర్ధరిస్తుంది. చాలా అరుదుగా అధ్యక్షుడికి వ్యతిరేకంగా దర్యాప్తు చేయవచ్చు.
ప్రతి రాష్ట్రానికి ఇద్దరు సెనేటర్లు ఉంటారు. వీరికి ఆరు సంవత్సరాల పదవీకాలం ఉంటుంది. ప్రతినిధుల సభలో ప్రతినిధులకు రెండేళ్ల పదవీకాలం ఉంటుంది. వీరు చిన్న చిన్న జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తారు.
నవంబర్‌లో ప్రతినిధుల సభలో అన్ని సీట్లకు, సెనేట్‌లో మూడింట ఒక వంతు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. వీటితో పాటు, అనేక ప్రధాన రాష్ట్రాలకు గవర్నర్, స్థానిక అధికారుల సీట్లకు ఎన్నికలు జరుగుతాయి.
- పాకిస్తాన్ అత్యంత ప్రమాదకర దేశాల్లో ఒకటని బైడెన్ ఎందుకు అన్నారు?
- చైనా, అమెరికాలు బద్ధ శత్రువులుగా మారుతున్నాయా, మూడోసారి అధ్యక్షుడైన షీ జిన్‌పింగ్ ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు?

2. ఎవరు గెలవవచ్చు?
గత రెండేళ్లుగా హౌస్, సెనేట్ రెండింటిలోనూ డెమోక్రటిక్ పార్టీకే మెజారిటీ ఉంది. అందువల్ల, అధ్యక్షుడు జో బైడెన్‌కు తాను కోరుకున్న చట్టాలకు ఆమోదం సంపాదించడం సులువైంది.
అయితే, డెమోక్రాట్లు, రిపబ్లికన్ల కంటే చాలా తక్కువ మార్జిన్‌తో ఆధిక్యంలో ఉన్నారు. కాబట్టి, ఎన్నికల్లో పోటీ గట్టిగానే ఉండవచ్చు.
ఈసారి ప్రతినిధుల సభను రిపబ్లికన్లు ఆక్రమిస్తారని, సెనేట్‌లో డెమోక్రాట్లే ఆధిక్యం సాధిస్తారని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
ప్రతినిధుల సభలో ఉన్న 435 సీట్లలో చాలావరకు రెండిట్లో ఏదో ఒక పార్టీకి దక్కుతాయి. ఒక 30 సీట్లకు మాత్రం గట్టి పోటీ ఉంటుంది.
పెన్సిల్వేనియా, కాలిఫోర్నియా, ఒహియో, నార్త్ కరోలినా వంటి రాష్ట్రాల్లోని నగరాల చుట్టూ ఉన్న సబర్బన్ ప్రాంతాలు కీలకం కానున్నాయి.
సెనేట్‌లో ఉన్న 35 స్థానాల్లో నాలుగు స్థానాలకు గట్టి పోటీ ఉండవచ్చు. నెవాడా, అరిజోనా, జార్జియా, పెన్సిల్వేనియా స్థానాలలో కీలక రేసులు ఉండవచ్చు.
ఎన్నికలు జరిగిన కొద్ది రోజుల్లో చివరి ఫలితాలను వెల్లడిస్తారు.

3. ఈ ఎన్నికల్లో ప్రధాన అంశాలేమిటి?
2022 ప్రారంభంలో వలసలు, నేరాలు, కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ఇవి సంప్రదాయ రిపబ్లికన్లకు ఓట్లు తెచ్చిపెట్టే అంశాలు.
కానీ, జూన్‌లో అమెరికా సుప్రీంకోర్టు అబార్షన్ చట్టవిరుద్ధమని తీర్పు చెప్పడంతో ప్రాధాన్యాలు మారిపోయాయి. డెమోక్రాట్లు మహిళా హక్కులకు పెద్దపీట వేస్తారు. ఆ దిశలో అనేక ప్రచారాలు చేశారు కూడా. కాబట్టి ఈ అంశం డెమోక్రాట్లకు లాభదాయకం కావచ్చు.
అయితే, అబార్షన్ అంశం ఇప్పటికి కాస్త నెమ్మదించింది కాబట్టి, రిపబ్లికన్లు ప్రజల దృష్టిని ద్రవ్యోల్బణం, వలసలు, హింసాత్మక నేరాల వైపు తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
- ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నపుడు కమోడ్‌లో అధికారిక పత్రాలు వేసి ఫ్లష్ చేసేవారా? కొత్త పుస్తకం వెల్లడిస్తున్న విషయాలేమిటి?
- నరేంద్ర మోదీ వరల్డ్ లీడర్ అయ్యారా, భారత్ అంతర్జాతీయ శక్తిగా మారిందా...

4. ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి?
సాధారణంగా మధ్యంతర ఎన్నికల ఫలితాలు అధ్యక్షుడి పనితీరుపై ఒక తీర్పులాంటిది. అందువల్ల, వైట్ హౌస్‌ను పాలిస్తున్న పార్టీ సీట్లు కోల్పోతూ ఉంటుంది.
ఇది బైడెన్‌కు కాస్త ఆందోళన కలిగించే విషయమే. ఆగస్టు నుంచి ఓటర్ల మధ్య బైడెన్‌కు ఆమోదం తెలిపే రేటు 50 శాతం కన్నా తక్కువగా ఉంటోంది.
ఈ ఎన్నికల్లో డెమోక్రట్లు మెజారిటీ సాధిస్తే, బైడెన్ తన విధానాలను కొనసాగించవచ్చు. వాటిలో ముఖ్యమైనవి.. వాతావరణ మార్పులకు సంబంధించిన విధానాలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే హెల్త్‌కేర్ కార్యక్రమాలు, అబార్షన్ హక్కులను రక్షించడం, గన్ కల్చర్‌ను అదుపుచేయడం.
హౌస్‌లోగానీ, సెనేట్‌లోగానీ రిపబ్లికన్లు ఆధిక్యంలోకి వస్తే బైడెన్ విధానాలకు చెక్ పెట్టగలరు. అలాగే, దర్యాపు కమిటీలపై పట్టుబిగిస్తారు. తద్వారా 2021 జనవరి 6న మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు అమెరికా క్యాపిటల్‌పై దాడి చేసిన కేసును ముగించవచ్చు.
అలాగే, కన్జర్వెటివ్స్‌కు ఆసక్తి ఉన్న అంశాలలో దర్యాప్తు ప్రారంభించవచ్చు. ఉదాహరణకు, జో బైడెన్ చిన్న కొడుక్కి చైనా వ్యాపారాలతో ఉన్న సంబంధాలు లేదా అఫ్గానిస్తాన్‌లో అమెరికా దళాల విరమణ. బైడెన్‌కు కొత్త నియామకాలు చేయడం కష్టం కావచ్చు. అమెరికా సుప్రీంకోర్టు నియామకాలైనా సరే.
రిపబ్లికన్ల ఆధిపత్యం బైడెన్ విదేశాంగ విధానాలను కూడా ఆటకం కలిగించవచ్చు. ముఖ్యంగా, యుక్రెయిన్‌కు సహాయం అందించే అంశంలో.
అయితే, బైడెన్ తన వీటో హక్కును ఉపయోగించుకుని అబార్షన్, వలసలు, పన్నులపై కన్జర్వేటివ్ చట్టాలను అడ్డుకోవచ్చు.
మధ్యంతర ఎన్నికల ఫలితాలు రాగానే, మళ్లీ అధ్యక్ష ఎన్నికలు లేదా కాంగ్రెస్ ఎన్నికలు వచ్చేవరకు సీలు పడ్డట్టే.
- డోనల్డ్ ట్రంప్ నివాసంలో ఎఫ్‌బీఐ సోదాలు: మళ్లీ అధ్యక్ష పదవికి పోటీపడకుండా అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉందా?
- అమెరికా: జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ ల్యాప్‌టాప్‌లో ఉన్న రహస్యాలేంటి, ఏమిటీ వివాదం?

2024 అధ్యక్ష ఎన్నికలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
2024 ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి అద్యక్ష పదవికి పోటీ చేసేదెవరో మధ్యంతర ఎన్నికల ఫలితాలు క్లూ ఇవ్వవచ్చు.
ట్రంప్ మద్దతు ఉన్న అభ్యర్థులకు సరిగా ఓట్లు రాకపోతే, వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో నిలబడేందుకు ట్రంప్‌కు రిపబ్లికన్ పార్టీ మద్దతు ఇవ్వకపోవచ్చు.
ఫ్లోరిడా, టెక్సాస్‌లలో రిపబ్లికన్ గవర్నర్‌లు రాన్ డిసాంటిస్, గ్రెగ్ అబాట్ ఈసారి కూడా ఎన్నికైతే వైట్ హౌస్ వైపు అడుగులు వేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నారు.
మిషిగాన్, విస్కాన్సిన్, పెన్సిల్వేనియాలో డెమోక్రాట్‌లు అధికారాన్ని నిలబెట్టుకోగలిగితే, 2024 అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌కు ప్రచారం కల్పించేందుకు విశ్వాసం కూడగట్టుకోగలుగుతారు.
ఇవి కూడా చదవండి:
- మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ను గెలిపించిన 5 అంశాలేంటి... మిగతా పార్టీలు సాధించిందేంటి?
- బ్రిటిష్ వలస పాలనలో భారతీయ మహిళలను టార్గెట్ చేసిన సబ్బులు, క్రీముల ప్రకటనలు ఎలా ఉండేవి?
- ఏలియన్స్ ఎదురైతే మీరేం చేస్తారు?
- ఒక నగరంలోని ప్రజలంతా ఒకే భవనంలో నివసించే రోజులు వస్తాయా, ఇది ఎలా సాధ్యం?
- సూర్యకుమార్ యాదవ్ భార్య పెట్టిన 'రూల్' ఏంటి, దాన్ని పాటించడం వల్లే అతడు ఒత్తిడి లేకుండా ఆడగలుగుతున్నాడా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)