వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మానవ హక్కుల ఉల్లంఘన తీర్మానం విషయంలో చైనాకు వ్యతిరేకంగా భారత్ ఎందుకు ఓటు వేయలేదు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
షిజిన్‌పింగ్, నరేంద్ర మోదీ )

చైనాలోని షిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో మానవ హక్కుల ఉల్లంఘన అంశంపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (యుఎన్‌హెచ్‌సిఆర్)లో గురువారం చర్చకు తీర్మానం తీసుకువచ్చింది. యుఎన్‌హెచ్‌సిఆర్‌లోని 47 సభ్య దేశాలలో 17 దేశాలు ముసాయిదా తీర్మానానికి అనుకూలంగా, 19 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి.

ఈ విషయంలో చైనాకు వ్యతిరేకంగా వెళ్లకూడదని భారత్ నిర్ణయించుకుంది. దీనిపై విపక్షాలు ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని ప్రశ్నించాయి.

''చైనా విషయంలో భారత ప్రభుత్వ వైఖరిలో ఇంత వ్యత్యాసం ఎందుకు ఉంది'' అని కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ ట్వీట్ చేశారు.

శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ 'హిందీ-చినీ భాయ్-భాయ్. ఎర్రటి కళ్ల నుంచి కళ్లు మూసుకునే వైపు ప్రయాణం'' అంటూ ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మహ్మద్ ట్వీట్ చేస్తూ, "పాకిస్తాన్‌కు చెందిన అబ్దుల్ రెహ్మాన్ మక్కీని అంతర్జాతీయ తీవ్రవాదిగా పేర్కొనే భారత్, అమెరికాల ప్రతిపాదనను చైనా వ్యతిరేకిస్తోంది. కానీ, వీగర్ కమ్యూనిటీకి వ్యతిరేకంగా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినందుకు చైనాపై ముసాయిదా తీర్మానానికి మాత్రం భారతదేశం దూరంగా ఉంది" అని అన్నారు.

https://twitter.com/drshamamohd/status/1578067834550484992

భారత్ తన నిర్ణయంపై ఏం చెప్పింది?

శుక్రవారం సాయంత్రం విదేశాంగ మంత్రిత్వ శాఖ విలేఖరుల సమావేశంలో, ఆ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ చైనాలోని షిన్‌జియాంగ్ ప్రావిన్స్‌ గురించి ప్రస్తావించారు. ఈ స్వయం ప్రతిపత్తి గలిగిన ప్రాంత ప్రజల హక్కులను గౌరవించాలని, వారు దానికి అర్హులనీ అన్నారు.

ఈ అంశంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించడం ఇదే మొదటిసారని విశ్వసనీయ సమాచారం.

షిన్‌జియాంగ్‌లో మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి, చర్చకు తీర్మానంపై ఓటింగ్‌కు దూరంగా ఉండాలని భారత్ ఎందుకు నిర్ణయించిందని విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఇది ఇండియా విదేశీ విధానానికి సంబంధించిన నిర్ణయమని బాగ్చి అన్నారు.

"షిన్‌జియాంగ్ అటానమస్ ప్రాంతంలో నివసించే వీగర్ ప్రజల మానవ హక్కులను గౌరవించాలి. వారికి ఆ హక్కు కల్పించాలి. ఈ విషయంలో పరిస్థితిని న్యాయంగా అర్థం చేసుకుని సమస్య పరిష్కారిస్తారని మేం ఆశిస్తున్నాము" అని ఆయన అన్నారు.

"భారతదేశం మానవ హక్కులను గౌరవిస్తుంది. ఈ విషయంలో ఓటుకు సంబంధించి భారతదేశం తీసుకున్న నిర్ణయం దీర్ఘకాలంగా అనుసరించిన విధానానికి అనుగుణంగా ఉంది. ఎందుకంటే దీనిపై ఏ దేశ ప్రతిపాదనలు మరింత ప్రభావవంతంగా లేవని మేము విశ్వసిస్తున్నాము. సమస్యలు పరిష్కరించడానికి భారతదేశం ఇరువైపులా చర్చలకు మద్దతు ఇస్తుంది'' అని ఆయన సమాధానమిచ్చారు.

https://twitter.com/PTI_News/status/1578343608264331264

చైనాపై మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు ఏంటి?

చైనా తన ఈశాన్య షిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో "తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన"కు పాల్పడుతోందని ఐక్యరాజ్యసమితి నివేదిక ఆరోపించింది. అయితే, ఈ నివేదికను బయటపెట్టవద్దని చైనా విజ్ఞప్తి చేసింది. ఇది పాశ్చాత్య శక్తుల 'నకిలీ'నివేదిక అని చైనా పేర్కొంది.

ఈ రిపోర్టు చైనాలోని షిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో నివసించే మైనారిటీ ముస్లింలు, ఇతర వర్గాలపై అణచివేత ఆరోపణల మీద జరిగిన విచారణకు సంబంధించింది.

అయితే, అణచివేత ఆరోపణలను చైనా ఖండిస్తుండగా, దర్యాప్తు చేసిన వారు మాత్రం మైనారిటీలపై వేధింపులకు సంబంధించి బలమైన ఆధారాలు లభించినట్లు చెబుతున్నారు.

షిన్‌జియాంగ్‌లో మానవ హక్కుల ఉల్లంఘన ఘటనలపై హ్యూమన్ రైట్స్ సంఘాలు కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నాయి.

రీ-ఎడ్యుకేషన్ క్యాంపుల్లో శిక్షణ పేరుతో వీగర్ కమ్యూనిటీకి చెందిన పది లక్షల మందిని నిర్బంధంలో ఉంచారని ఈ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

చైనాకు వ్యతిరేకంగా భారత్ ఎందుకు ఓటు వేయలేదు?

తూర్పు లద్ధాఖ్‌లో దాదాపు రెండేళ్లుగా భారత్‌, చైనాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. అటువంటి పరిస్థితిలో, భారతదేశం ఎందుకు చైనా వ్యతిరేక వైఖరి తీసుకోవడంలేదు అన్న ప్రశ్న వినిపిస్తుంది.

దీన్ని అర్థం చేసుకోవడానికి, ఇండియా-చైనా వ్యవహారాల్లో నిపుణుడు ప్రొఫెసర్ స్వరణ్ సింగ్‌తో బీబీసీ మాట్లాడింది. స్వరణ్ సింగ్ ప్రస్తుతం వాంకోవర్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఉన్నారు.

"ఇది భారతదేశపు పాత విధానం. భారత్, చైనా ఒకరి అంతర్గత వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదని పంచశీల సూత్రాలలో పేర్కొన్నారు. అందుకే భారతదేశం 'వన్ చైనా పాలసీ'ని కూడా అంగీకరిస్తుంది. పాత విధానాలకు వ్యతిరేకంగా పోవడం ద్వారా చైనాతో సంబంధాలను మరింత దిగజార్చాలని ఇండియా కోరుకోవడం లేదు'' అని ఆయన అన్నారు.

జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ చైనీస్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా స్టడీస్ ప్రొఫెసర్ బీఆర్ దీపక్ ఇండియా వైఖరిని విశ్లేషించారు. "మానవ హక్కుల ఉల్లంఘన సమస్య తీవ్రమైన విషయం. పాశ్చాత్య దేశాలు వీగర్ కమ్యూనిటీకి చెందిన పది లక్షలమంది గురించి మాట్లాడుతున్నాయి. భారత్‌కు కూడా ఇది సీరియస్‌ అంశమే. కానీ, అలాంటి అంశంపై చైనాకు వ్యతిరేకంగా వెళితే, చైనా కూడా అంతర్జాతీయ వేదికపై కశ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాల సమస్యలను లేవనెత్తవచ్చు. కాబట్టి భారత్‌ వాటి జోలికి పోవాలని కోరుకోదు. మానవ హక్కుల గురించి చైనా గురించి భారత్ మాట్లాడదు, భారత్ గురించి చైనా మాట్లాడదు'' అని ఆయన అన్నారు.

ఈ విషయంలో ఇరు దేశాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయని బీఆర్ దీపక్ తెలిపారు.

చైనాకు సంబంధించిన ఇటువంటి మానవ హక్కుల సమస్యలపై సాధారణంగా పెద్ద పెద్ద ముస్లిం దేశాలు కూడా మౌనంగా ఉంటాయని ప్రొఫెసర్ స్వరణ్ సింగ్ చెప్పారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశమైన ఇండోనేషియా కూడా ఈ అంశంపై ఓటింగ్‌లో పాల్గొనలేదు. చైనాకు వ్యతిరేకంగా ప్రస్తుత తీర్మానం పెట్టిన వారంతా చైనా అభివృద్ధికి కారణంగా ఇబ్బందులు పడుతున్నవారేనని ప్రొఫెసర్ దీపక్ అభిప్రాయపడ్డారు.

వీగర్ ముస్లిం వర్గాలపై చైనా అణచివేతకు పాల్పడుతోందని విమర్శలున్నాయి

చాలా విషయాల్లో భారత్‌కు వ్యతిరేకంగా చైనా

అంతర్జాతీయ వేదికలపై చైనా చాలాసార్లు భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించింది. కానీ, చైనాకు వ్యతిరేకంగా భారత్ ఎందుకు వెళ్లడం లేదు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వివాదాస్పద ప్రకటనలు చేసే పాకిస్తాన్ మత గురువు మౌలానా మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రౌఫ్ అజార్‌ను 'ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదుల జాబితా'లో చేర్చేందుకు ఈ ఏడాది ఆగస్టు నెలలో అమెరికా, భారత్‌లు ప్రయత్నించాయి. అయితే, సరైన సమాచారం లేదంటూ చైనా ఈ ప్రయత్నాన్ని వాయిదా వేసింది.

సెప్టెంబరులో ఐక్యరాజ్యసమితిలో భారత్, చైనాలు మరోసారి ఘర్షణ పడ్డాయి. 2008 ముంబై దాడుల్లో ప్రధాన నిందితుల్లో ఒకరైన లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్ మీర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చడం గురించి వివాదం ఏర్పడింది.

నిజానికి సాజిద్‌ మీర్‌ను అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితిలో అమెరికా ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు భారత్‌ మద్దతు తెలిపింది. కానీ చైనా తన 'వీటో' అధికారాన్ని ఉపయోగించి ఈ ప్రతిపాదనను అడ్డుకుంది.

ఇది కాకుండా, అణు సరఫరాదారుల గ్రూప్‌లో భారతదేశానికి సభ్యత్వం ఇచ్చే విషయంలో కూడా చైనా తప్పించుకునే వైఖరిని అవలంబించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌ను శాశ్వత సభ్యదేశంగా గుర్తించే విషయంలో కూడా చైనా వైఖరి ఇలాగే ఉంది.

పెద్ద సమస్యలపై భారత్‌తో కలిసొచ్చే దేశాలు ఏవి?

"ఉగ్రవాదుల అంశం ఒక వ్యక్తికి సంబంధించినది. అయితే, మానవ హక్కుల విషయంలో భారతదేశం చైనాకు వ్యతిరేకంగా వెళితే, అది ఒక దేశంపై భారతదేశం చేసిన తీవ్రమైన ఆరోపణ అవుతుంది. అదే జరిగితే, రాబోయే కాలంలో చైనా కూడా భారత్‌పై ఇలాంటి ఆరోపణలు చేయగలదు'' అని ప్రొఫెసర్ స్వరణ్ సింగ్ అన్నారు.

భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేదా ఎన్‌ఎస్‌జీ సభ్యత్వం వంటి అంశాలపై పెద్ద దేశాల వైఖరి భారత్‌కు పూర్తి అనుకూలంగా ఏమీలేదు. చైనా దీన్ని వీటో చేస్తుందన్న సంగతి అమెరికా, రష్యా వంటి దేశాలకు తెలుసు. అందుకే వాళ్లు కూడా భారత్ వైపు ఉన్నట్లు మాట్లాడతారు. చివరకు చైనా వీటో చేస్తుంది.

అయితే, చైనా భారత వ్యతిరేకతకు ప్రొఫెసర్ దీపక్ భిన్నమైన కారణాన్ని చూపిస్తున్నారు. పాకిస్తాన్‌తో స్నేహం కారణంగానే భారత్‌కు అనేక విషయాల్లో చైనా మద్ధతివ్వదని ఆయన అంటున్నారు. అయితే, అన్ని విషయాలలో అలా జరగదు. 2019లో మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే విషయంలో భారత్ కు చైనా మద్ధతు ఇచ్చింది" అని ఆయన అన్నారు.

మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని 2009 నుంచి భారత్ డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్‌ను నెరవేర్చుకోవడానికి భారత్‌కు 10 ఏళ్లు పట్టింది.

నరేంద్ర మోదీ, షిజిన్‌పింగ్

చైనా- భారత్ వాణిజ్య సంబంధాలు

2020 సంవత్సరం నుంచి భారత్, చైనాల మధ్య సరిహద్దులో ప్రతిష్టంభన కొనసాగుతోంది. అయితే, ఇలాంటి స్థితి ఉన్నప్పటికీ రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఎన్నడూ లేనంత ఉన్నత స్థితిలో ఉన్నాయి.

చైనా దిగుమతులపై ఇండియా ఆధారపడటం నిరంతరంగా పెరుగుతోందని, భారత వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ డేటా ద్వారా తెలుస్తోంది.

ఆ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం, 2021-22 సంవత్సరంలో, రెండు దేశాల మధ్య సుమారు $115 బిలియన్ల (సుమారు రూ.92 లక్షల కోట్లు) వాణిజ్యం జరిగింది. గత ఏడాది ఇది 86 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 64 లక్షల కోట్లు)గా ఉంది.

దీంతో పాటు చైనా నుంచి భారత్ దిగుమతులు కూడా పెరిగాయి. ఈ ఏడాది 94 బిలియన్‌ డాలర్లు( సుమారు రూ.75 లక్షల) గా ఉంటే, గతేడాది 65.3 బిలియన్‌ డాలర్లు( సుమారు రూ. 50 లక్షల కోట్లు )గా ఉంది.

ప్రస్తుత తరుణంలో భారత్, చైనాలు తమ సంబంధాలను కొనసాగించాలని కోరుకుంటున్నాయి. అదే సమయంలో, రష్యా-యుక్రెయిన్ యుద్ధం, కరోనా మహమ్మారి, ఉగ్రవాదం వంటి పెద్ద సమస్యలపై భారత్, చైనాల విధానం దాదాపు ఒకే విధంగా ఉంది.

ఇరుదేశాల సరిహద్దుల్లో పరిస్థితులు సాధారణం కానంత వరకు భారత్, చైనాల మధ్య సంబంధాలు మామూలుగా ఉండవని ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు.

స్వరణ్ సింగ్ దీనిని పెద్ద ప్రకటనగా అభిప్రాయపడ్డారు. భారత్ తన పాత విధానాన్ని మార్చుకుంటే, చైనాతో వివాదాలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Why didn't India vote against China on Human Rights Violation Resolution?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X