వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టైప్ రైటర్ అంటే భారతీయులకు ఇప్పటికీ ఎందుకంత మోజు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

కొంతమంది భారతీయ ఔత్సాహికులకు, టైప్ రైటర్‌లు పాతకాలపు యంత్రాలు మాత్రమే కాదు. అవి ఆచరణాత్మకమైన, ప్రతిష్టాత్మకమైన ఆస్తులు కూడా.

లేత గులాబీ రంగు వేసివున్న చిన్న గదిలో, దాదాపు డజను మంది పురుషులు, మహిళలు కష్టపడి పని చేస్తున్నారు. ఆ గది గోడలకి ఆనుకున్న డెస్క్‌లకు వారు అతుక్కుపోయారు.

వారి వేళ్లు 'కీ’ ల మీద వేగంతో కదులుతున్నాయి. ఆ టైపింగ్ నుంచి లయబద్దంగా వచ్చే చప్పుడు ట్రాఫిక్ చేసే శబ్దాన్ని పోలివుంది.

గత ఆరు సంవత్సరాలుగా, తమిళనాడులోని మదురైలో అత్యంత రద్దీగా ఉండే వీధుల్లో ధనలక్ష్మి భాస్కరన్ ప్రతి రోజూ వందల మంది విద్యార్థులకు షిఫ్ట్‌ల పద్ధతిలో టైపింగ్ నైపుణ్యాలను బోధిస్తున్నారు.

దాదాపు 20 మాన్యువల్ టైప్‌ రైటర్‌లతో ఆమె ఒక సంస్థను నడుపుతున్నారు.

ఉమాపతి టైప్‌రైటింగ్ ఇన్‌స్టిట్యూట్‌ అంటూ ధనలక్ష్మి భాస్కరన్ తన కొడుకు పేరు మీద ఒక ఇన్‌స్టిట్యూట్ స్థాపించారు. ఇక్కడ ఇంగ్లీష్, హిందీ, తమిళ భాషలలో టైపింగ్ నేర్పిస్తారు.

వారు ఉపయోగించే టైప్ రైటర్ రకం ఫెసిట్. 1950 చివరలో ప్రారంభమైన నాటి నుంచి ఈ మోడల్‌లో పెద్ద మార్పులేమీ రాలేదు.

తన విద్యార్థుల్లో అన్ని రకాల వారు ఉన్నారని భాస్కరన్ తెలిపారు. కొంతమంది ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించేవారు ఉన్నారు.

ప్రస్తుత ఉద్యోగ పోటీ ప్రపంచలో మిగతావారికంటే ఒక అడుగు ముందుడటానికి టైపింగ్ నేర్చుకోవాలనే ఉద్దేశంతో కొందరు. ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యాలయాలలో ఉద్యోగాలు పొందడానికి పోటీ పడేవారు. కొంతమంది యువ తల్లులు కూడా ఉన్నారు.

వీరు పిల్లలు పుట్టాక, కెరీర్‌ని తిరిగి ప్రారంభించాలనే ఆశతో భాస్కరన్ తరగతుల పట్ల ఆసక్తి చూపుతున్నారు.

టైపింగ్ కోసం ప్రభుత్వం ఆమోదించిన అనేక కేంద్రాలలో ఉమాపతి టైప్‌రైటింగ్ ఇనిస్టిట్యూట్‌ కూడా ఒకటి. కోర్సు ముగింపు దశలో, ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్వహించే పరీక్షలకు విద్యార్థులు హాజరవుతారు. ఉత్తీర్ణులైతే, వచ్చే సర్టిఫికేట్లు ఉద్యోగాలు పొందడానికి సాయపడతాయి.

కానీ, మెకానికల్ టెక్నాలజీలను డిజిటల్ పరికరాలు అధిగమించిన ఈ ప్రపంచంలో, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, టాబ్లెట్‌లు కూడా ఎన్నడూలేనంత సరసమైన ధరలకే దొరుకుతున్నాయి.

మరి ఎవరైనా తమ టైప్‌ రైటింగ్ నైపుణ్యాలపై ఎందుకు పెట్టుబడి పెట్టాలి?

ఇంట్లో ల్యాప్‌టాప్‌లు లేదా వ్యక్తిగత కంప్యూటర్‌లు అందుబాటులో లేని ఉద్యోగార్థులకు, మాన్యువల్ టైప్‌ రైటర్‌పై టైపింగ్ నేర్చుకోవడం ఓ మంచి అవకాశమని భాస్కరన్ చెప్పారు.

"మీరు ఈ యంత్రంలో శిక్షణ పొందిన తర్వాత, మీ టైపింగ్ వేగాన్ని మెరుగుపరుచుకోవచ్చు, తప్పులను నివారించవచ్చు. ఈ స్కిల్స్‌ను కంప్యూటర్‌కు బదిలీ చేయడం సులభం" అని ఆమె చెప్పారు.

టైప్‌ రైటర్ పోర్టబిలిటీ సులభమైంది, విలువైనది కూడా. లాక్‌డౌన్ ఆంక్షలు సడలించిన తరువాత, విద్యార్థులు టైప్ చేస్తున్నప్పుడు సామాజికంగా దూరం పాటించవచ్చు. ''ఎక్కువ మంది కంప్యూటర్ సిస్టమ్‌లపై పని చేసే చోట ఇది సాధ్యం కాకపోవచ్చు'' అని భాస్కరన్ అన్నారు.

కొనసాగుతున్న స్తిత్వం

2009లో, టైప్ రైటర్లను తయారు చేసిన చివరి భారతీయ కంపెనీలలో ఒకటైన గోద్రెజ్ & బాయ్స్ వాటి ఉత్పత్తిని నిలిపి వేయాలని నిర్ణయించుకుంది.

ఆ సమయంలో, భారతదేశ గృహాలు, ఆఫీసుల్లో ఒకప్పుడు గర్వంగా ఉండే మాన్యువల్ టైప్‌రైటర్ చివరకు పాతబడిపోతుందని, అందరూ డిజిటల్ టెక్నాలజీని అందిపుచ్చుకుంటారని చాలామంది అంచనా వేశారు.

ఒక దశాబ్దం తర్వాత, భారతదేశంలోని చిన్నపట్టణాల వంపు తిరిగే సందులలో, పెద్ద నగరాల నడిబొడ్డున కూడా, మాన్యువల్ టైప్‌రైటర్ ఇంకా మనుగడ కొనసాగిస్తోంది.

రాజేశ్ పాల్టా యూనివర్సల్ టైప్ రైటర్స్ కో యజమాని. ఆయన 1954 నుండి న్యూదిల్లీలోని కమలా మార్కెట్‌లో తన స్టోర్ ద్వారా టైప్‌రైటర్‌లను రిపేర్ చేసి అమ్ముతుంటారు.

"మా కుటుంబం వంద సంవత్సరాలకు పైగా టైప్‌రైటర్‌ల వ్యాపారంలో ఉంది" అని ఆయన చెప్పారు. ఆయన కుటుంబ వ్యాపారం భారతదేశంలో టైప్‌రైటర్ ప్రయాణాన్ని వివరించే పుస్తకం 'గ్రేట్ ట్రూత్ అండ్ రిగార్డ్: ఎ స్టోరీ ఆఫ్ ది టైప్ రైటర్ ఇన్ ఇండియా'లో రాజేశ్ పాల్టా కుటుంబం గురించిన ప్రస్తావన కూడా ఉంది.

"భారతదేశంలో ముఖ్యమైన విభాగాల్లో టైప్‌రైటర్‌ల వినియోగం ఇప్పటికే దాదాపు లేదు. కానీ, ప్రస్తుతం టైప్ రైటర్ల డీలర్లకు కావాల్సినంత డిమాండ్ ఉంది" అని పాల్టా చెప్పారు. ఆ డిమాండ్ నిపుణుల నుండి, గత కాలపు అద్భుతమైన వస్తువులుగా భావించి సేకరించే వ్యక్తుల వల్ల వస్తోంది.

దేశవ్యాప్తంగా ఉన్న ఇలాంటి వ్యక్తుల కోసం శతాబ్దం కన్నా పాతవైన టైప్ రైటర్‌లను పాల్టా ఎంతో శ్రమతో రిపేర్ చేశారు. పాతకాలపు కార్ల మాదిరిగానే, టైప్‌రైటర్ విలువ అది పూర్తిగా పనిచేసేటప్పుడు తారస్థాయికి చేరుతుంది. కానీ, వాటిని సరి చేయాలంటే చాలా ఏకాగ్రత కావాలి.

"పోల్చి చూస్తే రిఫ్రిజిరేటర్, టైప్ రైటర్ కంటే చాలా పెద్దది. కానీ, మాన్యువల్ టైప్‌రైటర్ భాగాలలో పదోవంతు మాత్రమే రిఫ్రిజిరేటర్‌లో ఉంటాయి" అని ఆయన చెప్పారు.

కొన్ని మోడల్స్‌కు చెందిన విడి భాగాలు అందుబాటులో లేవు. ఎందుకంటే తయారీని నిలిపివేశారు. ఈ సందర్భంలో, క్లయింట్లకు కావాల్సిన విడిభాగాల ఉత్పత్తిని అవుట్‌సోర్సింగ్ చేయడంలో పాల్టాకు ప్రత్యేక అనుభవం ఉంది. కానీ ఆయా భాగాలు కచ్చితంగా తయారు చేయాలి.

"టైప్‌రైటర్ భాగాలు సరిగ్గా అమరకపోతే, అది పనిచేయదు" అని ఆయన అన్నారు. ఒక పాడైన భాగం తయారీకి, బిగించడానికి దాని అసలు ధర కంటే 10 రెట్లు ఎక్కువ ఖర్చు అవుతుంది.

పాల్టా విక్రయించే ప్రతి మెషిన్‌కు వయసు సర్టిఫికేట్‌ను కూడా జారీ చేస్తారు. "ప్రతి టైప్‌రైటర్‌కు ఓ వాహనం ఇంజిన్ నంబర్ వంటి ప్రత్యేక సీరియల్ నంబర్, బాడీపై ఉంటుంది. మేం ఆన్‌లైన్ పోర్టల్స్‌ను చూస్తాం. సీరియల్ నంబర్ జారీ చేసిన తేదీ కోసం తనిఖీ చేస్తాం" అని ఆయన చెప్పారు.

ముంబయిలో ఓ టైప్ రైటర్ పై టైప్ చేస్తున్న వ్యక్తి

పాల్టా రెగ్యులర్ క్లయింట్లలో సేకరణ ఆసక్తి గల కొందరు వ్యక్తులు ఉన్నారు. వీరు కొన్నేళ్లుగా వీటిని బాగు చేయడానికి మెషీన్‌లను పంపుతున్నారు.

అలాంటి ఒక క్లయింట్‌లలో మహారాజా జయేంద్ర ప్రతాప్ సింగ్ ఒకరు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలరాంపూర్ మాజీ రాజకుటుంబానికి చెందిన వారాయన. ఆయన వద్ద 11 టైప్ రైటర్లు ఉన్నాయి. వాటిలో గోద్రేజ్ ప్రైమా, లెట్టెరా 32, అరుదైన హిందీ టైప్‌రైటర్ మోడల్ ఉన్నాయి. అది ఆయన అత్తగారికి చెందినది. 1950ల నుంచి వాడుకలో ఉంది.

కరస్పాండెన్స్‌ కోసం తన తండ్రికి సహాయం చేసినప్పుడు సింగ్‌కు టైపింగ్ పట్ల ప్రేమ మొదలైంది. స్పెల్ చెక్ చేయడానికి కంప్యూటర్ వల్ల బద్దకం వస్తుందని ఆయన గ్రహించారు.

తన సృజనాత్మక రచనను మెరుగు పరచుకోవాలని భావించారు. 2013లో తన మొదటి టైప్ రైటర్ ఒలింపియాను కొనుగోలు చేశారు.

"ప్రారంభంలో, దానిపై టైప్ చేయడం నేర్చుకోవడం చాలా కష్టంగా అనిపించేది" అని సింగ్ చెప్పారు. అక్షరాల అమరికను సరిగ్గా పొందడం ఒక సవాలు. టైప్ చేయడం నేర్చుకోవడానికి అతనికి దాదాపు ఒక సంవత్సరం పట్టింది.

ఈ రోజు, ఆయన టైప్‌రైటర్‌ని తన వ్యక్తిగత కరస్పాండెన్స్ కోసం, బిజినెస్ మీటింగ్‌ల సమాచారాన్ని నోట్ చేయడానికి ఉపయోగిస్తున్నారు.

ఈ సంవత్సరం రక్షా బంధన్ పండుగ సందర్భంగా తన సోదరీమణులందరికీ వ్యక్తిగత లేఖను టైప్ చేసి ఇచ్చారు. దానికి వారందరూ పొంగిపోయారని ఆయన వెల్లడించారు.

"నేను కాగితంపై అక్షరాల ముద్రను ఇష్టపడతాను. కంప్యూటర్ ప్రింటింగ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. టైప్ రైటింగ్ నోట్ ప్రతి దాన్నీ మరింత ప్రత్యేకంగా చేస్తుంది" అని సింగ్ చెప్పారు.

రచయితలకు ఏకాగ్రత

అయోమయ ఆలోచనలను అణచివేయడానికి, డిజిటల్ ప్రపంచం తీసుకువచ్చే పరధ్యానాన్ని నిరోధించడానికి సృజనాత్మక రచయితల కోసం టైప్‌రైటర్ ఒక సాధనం. ఎందుకంటే వారి ఆలోచనలు, వేలిముద్రలు టైప్ రైటర్ మీద నృత్యంగా మార్చుతాయి.

కానీ భారతదేశంలోని చాలా మంది ప్రొఫెషనల్స్‌కు, పాత మెషీన్లలో టైపింగ్‌ నేర్చుకోవడం అంతగా ఇష్టపడరు.

''టైప్ రైటర్‌లు కనికరంలేనివి. వీటిలో దిద్దుబాటుకు ఆస్కారం ఉండదు. ఒక్క తప్పు చేయడం అంటే పని మొత్తాన్ని తిరిగి చేయాల్సిందే'' అని, కోయంబత్తూర్‌లో హ్యూమన్ రిసోర్సెస్ కన్సల్టెన్సీని నిర్వహిస్తున్న జయరామ్ విశ్వనాథన్ అన్నారు.

విశ్వనాథన్ 1979లో స్థానిక కెమికల్ కంపెనీలో స్టెనోగ్రాఫర్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. ఆయన పనిలో ఎక్కువ భాగం మాన్యువల్‌గా పత్రాలను టైప్ చేసేవారు.

భారతదేశంలో నివసిస్తున్న సీనియర్ సిటిజన్లకు, టైప్‌రైటర్‌పై ఎనలేని మక్కువ ఉంది.

"మేం తప్పులు టైప్ చేసినప్పుడు ఒక ప్రత్యేక ఎరేజర్‌ను ఉపయోగించాం. రంధ్రం ఉన్న చిన్న రాయిలాంటిది ఉంటుంది. ఇది చిన్న చిన్న దిద్దుబాట్లకు సహాయపడుతుంది" అని విశ్వనాథన్ చెప్పారు.

"కానీ మీరు చాలా గట్టిగా రుద్దితే, మీ కాగితం నిండా రంధ్రాలే మిగులుతాయి" అన్నారాయన.

అయితే, ప్రొఫెషనల్ టైపిస్టుల్లో తప్పులు తక్కువగా దొర్లుతాయని భాస్కరన్ చెప్పారు. "మా స్టూడెంట్లు ఒక్క తప్పు చేస్తే పరీక్షలో ఉత్తీర్ణులు కాలేరు. టైప్‌ రైటర్‌పై టైపింగ్ నేర్చుకోవడం కచ్చితత్వాన్ని నేర్పుతుంది" అని ఆయన వెల్లడించారు.

భారతీయ బ్యూరోక్రసీ ఇప్పటికీ టైప్‌ రైటర్‌లతో ముడిపడిఉండటానికి మరో ముఖ్యమైన కారణం ఉంది. రికార్డులు శాశ్వతంగా ఉంటాయి. టైప్‌రైటింగ్ చేసిన రికార్డులు ఎక్కువ కాలం ఉంటాయి.

"కొన్నిముఖ్యమైన ప్రభుత్వ పత్రాలు ఇప్పటికీ టైప్‌రైట్ చేస్తారు. ఎందుకంటే కంప్యూటరైజ్డ్ ప్రింట్స్‌ మాదిరిగా కాకుండా సిరా ఎన్నటికీ మసకబారదు" అని మురుగవేల్ ప్రకాశ్ చెప్పారు.

ఆయన చెన్నై సమీపంలోని మధురాంతకంలో శ్రీ కృష్ణ టైపింగ్ ఇనిస్టిట్యూట్‌లో 300 మంది విద్యార్థులకు టైపింగ్ శిక్షణ ఇస్తున్నారు.

2012లో తన తండ్రి మరణించిన తరువాత సివిల్ ఇంజనీరింగ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌ ఉద్యోగాన్ని ప్రకాశ్ విడిచి పెట్టారు. ఈ సంస్థను 1954లో ఆయన మావయ్య ప్రారంభించారు. ప్రస్తుతం ప్రకాశ్‌ దగ్గర 80 యంత్రాలు ఉన్నాయి. వీటిలొ గోద్రేజ్ ప్రైమా ఎక్కువ. రెమింగ్టన్ 14 ఉన్నాయి.

ఆయన, తన భార్య ఉదయం 7 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు రోజువారీ సెషన్లు తీసుకుంటారు. వరుస లాక్ డౌన్‌లతో విసిగిపోయిన తరువాత, ఆయన టైప్ చేయడం గురించి, ప్రజలకు తెలియజేసేందుకు ఒక యూట్యూబ్ ఛానెల్‌ని కూడా ప్రారంభించారు.

గతంలో మాన్యువల్ టైప్‌రైటర్‌లను ఉపయోగించిన ముఖ్య ప్రదేశాలు, దేశంలోని కోర్టు గదుల వెలుపల ఉండేవి. ఇక్కడ చట్టపరమైన పత్రాలు టైప్ చేసేవారు. తరచుగా భారతీయ భాషల్లోకి అనువదించేవారు.

2014 నాటికి కూడా దేశవ్యాప్తంగా 2 వేల మంది టైపిస్టులు కోర్టుల వెలుపల కూర్చునేవారు. అక్కడి మర్రి చెట్ల కింద టార్పాలిన్‌లో కప్పివుంచిన వారి టైప్ రైటర్లను ఎవరూ గమనించరు.

కోల్‌కతా, దిల్లీ నగరాలు ముఖ్యంగా కోర్టు టైపిస్టులకు ప్రసిద్ధి. లిటిగెంట్ల కాగితపు పనిని వారు తక్షణమే పూర్తి చేస్తారు. ముఖ్యంగా విద్యుత్ అంతరాయాలు కలిగిన సమయంలో వీరి పాత్ర అమోఘం. గతంలో తరచూ విద్యుత్ సరఫరా అంతరాయాలు ఏర్పడేవి.

ఏదేమైనా, ఇటీవలి సంవత్సరాలలో టైప్ రైటర్లను ఉపయోగించేవారి సంఖ్య బాగా తగ్గింది. కోర్టు గది టైపిస్టులు ఇప్పటికీ ఉన్నారని పాల్టా చెప్పారు.

"దిల్లీలోని కోర్టు ఛాంబర్ల వెలుపల వెయ్యి మంది టైపిస్టులు ఉండేవారు. కానీ నేడు ఆ సంఖ్య కేవలం 14 లేదా 15" అని పాల్టా అన్నారు. కోర్టు టైపిస్టులలో తగ్గుదల అన్ని టైప్‌ రైటర్లు కనుమరుగవ్వడాన్ని సూచిస్తుందని చాలా మంది అంచనా వేసినప్పటికీ, భారతదేశంలో మాన్యువల్ టైప్‌ రైటింగ్ సంప్రదాయం ఇప్పటికీ మనుగడలో ఉంది.

చరిత్ర చెప్పిన కథలు...

టైప్ రైటర్ ప్రాముఖ్యతను తెలిపే ఒక గాథ కూడా ఉంది.

ఆగష్టు 25, 1936న, ఇప్పటి బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో న్యాయమూర్తి పన్నాలాల్ బోస్ ఒక కేసులో తీర్పును వెలువరించడానికి సిద్ధమయ్యారు. ఈ కేసు వెనక పెద్ద కథ ఉంది.

స్వాతంత్ర్యానికి పూర్వం బెంగాల్ (ఇప్పటి బంగ్లాదేశ్)లోని అతిపెద్ద సంపన్న ఎస్టేట్‌లలో ఒకటైన భవాల్ యువరాజు రామేంద్ర నారాయణ్ రాయ్ విష ప్రయోగంతో మరణించారు. అయితే, ఒక దశాబ్దం తర్వాత, ఆయన లాంటి ఒక వ్యక్తి ఎస్టేట్ సమీపంలో తిరుగుతుండటంతో ఆయనే తిరిగి వచ్చారని స్థానికులు భావించడం ప్రారంభించారు.

కానీ ఆయన తానే ఈ ఎస్టేట్ యజమానిని అని చెప్పుకోలేదు. పైగా పూర్వపు జీవితం గురించిన జ్ఞాపకాలు ఆయనలో లేవు. దీంతో రామేంద్ర నారాయణ్ రాయ్ సన్యాసిగా మారినట్లు చాలామంది అనుకున్నారు.

మొదట రామేంద్ర నారాయణ్ రాయ్ విష ప్రయోగంతో మరణించాడని భావించిన ఆయన్ను శ్మశానానికి తీసుకెళుతుండగా, భారీ వడగళ్ల వాన అంత్యక్రియలకు అంతరాయం కలిగించిందని, ఈ వర్షానికి శవయాత్రలో పాల్గొన్నవారు కూడా ఈ వర్షపు ధాటికి తట్టుకోలేక శవాన్ని అక్కడ వదిలేసి పారిపోవాల్సి వచ్చిందని చెప్పుకునే వారు.

తర్వాత వచ్చి చూస్తే శవం కనిపించకపోవడంతో ఆయన వరదలో కొట్టుకుపోయారని భావించారు.

మళ్లీ పదేళ్ల తర్వాత వచ్చిన రామేంద్ర నారాయణ్ రాయ్‌ పోలికలతో ఉన్న వ్యక్తిని తన దివంగత భర్తగా అంగీకరించడానికి రాజు భార్య నిరాకరించడంతోపాటు, ఆయన ఓ మోసగాడు అంటూ కోర్టులో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసు చరిత్రలో నిలిచిపోయింది.

న్యాయమూర్తి బోస్ తన కుటుంబం భద్రపరిచిన రెమింగ్టన్ రాండ్ పోర్టబుల్‌ టైప్ రైటర్‌పై 531 పేజీల తీర్పును టైప్ చేయడానికి మూడు నెలల పాటు తనను తాను నిర్భంధించుకున్నారు.

చివరకు రాయ్ మరణానికి ఎలాంటి రుజువు లేదని, సన్యాసి నిజంగా యువరాజేనని న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. ఆ తర్వాత వ్యక్తిగత భద్రత దృష్ట్యా భార్య, తన పదకొండు మంది పిల్లలతో ఆయన కోల్‌కతాకు పారిపోవాల్సి వచ్చింది.

ఆయన ఆస్తులలో తీర్పును నమోదు చేసిన టైప్‌రైటర్ కూడా ఒకటి. (తీర్పు తనకు అనుకూలంగా వచ్చిన రెండు రోజుల తరువాత, సన్యాసి-యువరాజు కృతజ్ఞతలు చెప్పడానికి ఒక దేవాలయాన్ని సందర్శించి మరణించారు)

విలువైన ఆస్థి

నవంబర్ 2019లో, కోవిడ్-19 దేశాన్ని కుదిపేయడానికి ముందు, కర్ణాటకలో ఒక కుటుంబం కోసం 90 ఏళ్ల పాత టైప్ రైటర్‌ను పాల్టా పునరుద్ధరించారు. ఆయన దగ్గరకు చేరినప్పుడు అదివిరిగి, తుప్పు పట్టి ఉంది.

పాల్టా దాన్ని రిపేర్ చేసిన తర్వాత ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉంది. ఆయన దానిని పూర్తిగా రిస్టోర్ చేయగలిగారు. వారంతా ఒక సోఫా చుట్టూ కూర్చుని, ఆయన ఒడిలో టైప్‌రైటర్‌ పెట్టుకున్న ఫొటోను పాల్టాకు పంపారు. క్యాప్షన్‌లో "మా కుటుంబ సభ్యుడు, ఇంటికి తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉంది" అని రాశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Why is typewriter still a craze for Indians
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X