హర్యానాలో కాంగ్రెస్ ను భయపెడుతున్న చిన్న పార్టీలు ! సర్వే రిపోర్టుల వేళ కొత్త చికాకు..
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ గెలుస్తుందన్న సర్వే సంస్థల అంచనాల మధ్య ఆ పార్టీకి చిన్న పార్టీల కూటములు సవాళ్లు విసురుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులకు ఆయా పార్టీల అభ్యర్ధులు పోటీ ఇస్తున్నారు. దీంతో రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకోవడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోతోంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 5న జరిగే ఎన్నికల్లో ఏదైనా జరగొచ్చనే చర్చలు ఊపందుకున్నాయి.
హర్యానా అసెంబ్లీలో 90 సీట్లు ఉన్నాయి. వీటిలో ఆధిపత్యం కోసం ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీతో పాటు జేజేపీ-ఏఎస్పీ, ఐఎన్ఎల్డీ-బీఎస్సీ కూటమి పోటీ పడుతున్నాయి. అయితే జాట్ల ప్రభావం ఎక్కువగా ఉండే ఈ ఎన్నికల్లో మరోసారి వారు తమకే అండగా నిలుస్తారని కాంగ్రెస్ గట్టి ధీమాగా ఉంది. కానీ క్షేత్రస్దాయిలో ఐఎన్ఎల్డీ వంటి జాట్ల నాయకత్వంలో ఉన్న పార్టీ అభ్యర్ధుల నుంచి సవాళ్లు తప్పడం లేదు. దీంతో కాంగ్రెస్ గెలుపు అవకాశాలను ఈ చిన్న పార్టీలు దెబ్బతీస్తాయా అన్న చర్చ సాగుతోంది.

కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఈసారి బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, అందులోనూ తమ పార్టీనే ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని చెప్తున్నారు. ముఖ్యంగా వినేష్ ఫోగట్ చేరిక, జాట్ల మద్దతు, ముస్లింల మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉండటంతో చిన్న పార్టీల ప్రభావం తమపై ఉండకపోవచ్చని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ క్షేత్రస్ధాయిలో ఓట్లు చీలితే మాత్రం బీజేపీ కొన్ని స్ధానాల్లో లబ్ది పొందే అవకాశాలూ లేకపోలేదు. అందుకే చిన్న పార్టీల్ని కాషాయ దళం ప్రోత్సహిస్తోందన్న చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications