దళపతి విజయ్ తమిళనాడు చిరంజీవి కాబోతున్నారా ?
తమిళనాడులో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ముక్కోణపు పోరు తప్పేలా లేదు. ఇప్పటికే అధికార డీఎంకేతో పాటు విపక్ష అన్నాడీఎంకే కూటమి (బీజేపీతో కలిపి) ఈ ఎన్నికలపై పూర్తి స్దాయిలో ఫోకస్ పెడుతున్నాయి. అయితే సీఎం ఎంకే స్టాలిన్ తరహాలో జనాకర్షణ కలిగిన నేతలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విపక్ష కూటమికి తాజాగా దళపతి విజయ్ ప్రారంభించిన టీవీకే పార్టీ సవాళ్లు విసురుతోంది. అదే సమయంలో సీఎం పదవిని టార్గెట్ చేసిన విజయ్ .. స్టాలిన్ కు గట్టి పోటీదారుగా మారాలని భావిస్తున్నారు.
సినీ నటుల ప్రభావం ఎక్కువగా ఉండే తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ ఎంట్రీ సంచలనం రేపుతోంది. ఇప్పటివరకూ తమిళ జనాల్ని తన సినిమాలతో మెప్పించిన విజయ్ ఇప్పుడు రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడం ద్వారా చావో రేవో తేల్చుకునేందుకు సిద్దమవుతున్నారు. తాజాగా విజయ్ పార్టీ టీవీకే వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్ధిగా ఆయన్నే ప్రకటించింది. దీంతో సీఎం అభ్యర్ధిగా విజయ్ ఈ ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు సిద్దమవుతున్నారు. అంటే తానే ముందుండి ఈ ఎన్నికల్లో టీవీకే జయాపజయాల్ని నిర్ణయించేందుకు సిద్ధమయ్యారు.

తమిళనాడులో ప్రస్తుతం అధికార డీఎంకే పటిష్టంగా కనిపిస్తోంది. సీఎం స్టాలిన్ నేతృత్వంలోని ఆ పార్టీకి నాయకత్వమే అతి పెద్ద ప్లస్ పాయింట్. ఈ ఐదేళ్లలో డీఎంకే కూటమి ప్రభుత్వం మిత్రపక్షాల్ని కలుపుకుని పటిష్టంగా మారింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ఎలాంటి పోటీ లేకుండా 39కి 39 ఎంపీ సీట్లను గెల్చుకుంది. దీంతో డీఎంకే కూటమికి ప్రత్యామ్నాయమే లేదన్నట్లుగా రాజకీయాలు ఏకపక్షంగా సాగుతున్నాయి. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా ప్రభావం చూపేందుకు సిద్ధమవుతున్న బీజేపీ.. తిరిగి అన్నాడీఎంకేకు దగ్గరైంది. అయితే డీఎంకేతో పాటు అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి సైతం ఇప్పుడు విజయ్ భయం పట్టుకుంది.

బలహీన వర్గాల ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని భావిస్తున్న విజయ్ పార్టీ టీవీకే వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుకుంటుందా లేదా అన్నది ఇప్పుడే పూర్తి క్లారిటీ లేకపోయినా కచ్చితంగా చాలా నియోజకవర్గాల్లో ఓట్లను చీల్చే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. అదే జరిగితే అధికార డీఎంకే కూటమికి నష్టం జరుగుతుందా లేక అన్నాడీఎంకే-బీజేపీ కూటమి నష్టపోతుందా అన్నది తేలాల్సి ఉంది. సరిగ్గా ఇలాంటి పరిస్ధితుల్లోనే ఏపీలో 2009 ఎన్నికల్లో పోటీ చేసిన చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం అప్పటి టీడీపీ కూటమి (టీఆర్ఎస్, కమ్యూనిస్టులతో కలిపి)ని దారుణంగా దెబ్బతీసింది. చాలా నియోజకవర్గాల్లో ప్రజారాజ్యం చీల్చిన ఓట్లు అంతిమంగా ఈ కూటమిని చావుదెబ్బ తీసాయి. దీంతో అధికార కాంగ్రెస్ మరోసారి గెలిచింది.












Click it and Unblock the Notifications