పొట్టి డ్రెస్సు వేసుకుందని : కారు నుంచి కిందకు దించి మరీ
పూణె : దేశంలో యువతులపై దాడులు, అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా కురచ దుస్తులు ధరించిందన్న కారణంగా 22 ఏళ్ల యువతిపై దాడి చేసేందుకు యత్నించారు కొంతమంది పూణె యువకులు. పూణెలో తెల్లవారు ఝామున చోటు చేసుకున్న ఈ ఘటనలో.. స్నేహితురాలి వివాహం కోసం జరిగిన సంగీత్ రిహార్సల్ లో పాల్గొనడానికి వెళ్లి, ఉదయం 5.30 గంటల ప్రాంతంలో యువతి తన కారులో తిరిగి వస్తుండగా ఘటన చోటు చేసుకుంది.
రాత్రంతా రిహార్సల్ చేసి, పొద్దున్నే తన ఇద్దరు పురుష స్నేహితులతో కలిసి ఇంటికి బయలుదేరింది యువతి. ఆ
సమయంలో ఆమె కురచగా ఉన్న దుస్తులు ధరించి ఉన్నారు. కారులో బయలు దేరిన యువతిని లుల్లా నగర్ సిగ్నల్స్ వద్దకు చేరుకోగానే, పక్కనే వస్తున్న మరో కారులోని యువకులు ఆమెను కామెంట్ చేయడం మొదలుపెట్టారు. అక్కడితో ఆగకుండా కారును వెంబడించిన సదరు యువకులు, వేగంగా వెళ్ళి యువతి ప్రయాణిస్తున్న కారుకు అడ్డంగా తమ కారును నిలిపారు.

ఆ తర్వాత ఆమెను కారు నుంచి బయటకు లాగి రోడ్డుపైనే దుర్భాషలాడారు. దీంతో 100 డయల్ కి చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావించింది. కానీ చాలాసేపు ప్రయత్నించినా..! ఫోన్ ఎవరు ఎత్తలేదని తెలిపింది ఆ యువతి. నిందితులు వెళ్లిపోయిన గంట తర్వాత వచ్చిన పోలీసులు, ముందు కేసు నమోదు చేయడానికి ఒప్పుకోలేదని, ఆ తర్వాత మరి కాసేపటికి కేసు నమోదు చేశారని తెలిపింది.
కాగా.. నిందితుల గురించి ఆరా తీసిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. అమిత్ ముఖేందర్, శుభమ్ అనే ఇద్దరు నిందితులు దొరికారని మరొకరి కోసం గాలిస్తున్నామని తెలియజేశారు. ఎఫ్.ఐ.ఆర్ నమోదు ఆలస్యం కావడానికి కారణం సాంకేతిక కారణాలే అని చెప్పిన పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని యువతికి హామి ఇచ్చారు పూణె డీసీపీ అరవింద్.












Click it and Unblock the Notifications