Amazon Prime:ప్రైమ్ వీడియోల్లో యాడ్స్ వివాదం -చిక్కుల్లో అమెజాన్..!!
అమెజాన్ ప్రైమ్...డిజిటల్ యుగంలో దీని గురించి తెలియని వారుండరు.అలసిపోయి ఉన్నవారికి లేదా మంచి టైంపాస్ కావాలనుకునేవారికి ప్రైమ్ ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. అందులోని సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు సినీప్రియులను ఎంటర్‌టెయిన్ చేస్తున్నాయి. అలాంటి ఘన చరిత్ర ఉన్న అమెజాన్ ప్రైమ్ ఇప్పుడు చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇంతకీ ఏంటా ఇబ్బందులు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
అమెజాన్ ప్రైమ్ పై ఆస్ట్రేలియా కోర్టులో కేసు
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని కేవలం వేగవంతమైన డెలివరీ సేవల కోసమే కాదు, ప్రైమ్ వీడియోలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఒరిజినల్ కంటెంట్‌ను అడ్వర్టయిజ్‌మెంట్ అంతరాయం లేకుండా వీక్షించేందుకు కూడా తీసుకుంటున్నారు. అయితే ఇటీవల ప్రైమ్ వీడియోలో ప్రకటనలను ప్రవేశపెట్టిన అమెజాన్ నిర్ణయం వినియోగదారుల్లో అసంతృప్తిని కలిగించింది. ఇప్పుడు ఇదే అంశం ఆస్ట్రేలియాలో అమెజాన్‌కు పెద్ద న్యాయపరమైన చిక్కులు తెచ్చిపెట్టింది.ఆస్ట్రేలియన్ కంపిటిషన్ అండ్ కన్స్యూమర్ కమిషన్ (ACCC) అమెజాన్ ఆస్ట్రేలియాపై ఫెడరల్ కోర్టులో కేసు దాఖలు చేసింది. వార్షిక ప్రైమ్ సభ్యత్వం తీసుకున్న కస్టమర్ల ఒప్పందాల్లో అన్యాయమైన నిబంధనలను చేర్చి, వాటి ఆధారంగా 2024లో ప్రైమ్ వీడియోలో ప్రకటనలు ప్రవేశపెట్టిందని కమిషన్ ఆరోపించింది.

యాడ్స్ చూడాలా.. లేక అదనంగా డబ్బులు చెల్లించాలా?
ఏడాదికి ఇప్పటికే 79 ఆస్ట్రేలియన్ డాలర్లు చెల్లించిన ప్రైమ్ సభ్యులకు రెండు మాత్రమే ఎంపికలు మిగిలాయని ACCC పేర్కొంది. ఒకటి ప్రకటనలతో కూడిన వీడియోలు చూడటం, లేదా ప్రకటనలు లేకుండా చూడాలంటే నెలకు అదనంగా 2.99 ఆస్ట్రేలియన్ డాలర్లు చెల్లించడం. ఈ నిర్ణయం వల్ల దాదాపు 10 లక్షలకు పైగా వార్షిక సభ్యులు ప్రభావితమైనట్లు కమిషన్ తెలిపింది.
వినియోగదారులకు నష్టపరిహారం కోరిన ACCC
ఈ వ్యవహారంలో అమెజాన్ వినియోగదారుల హక్కులను ఉల్లంఘించిందని ACCC ఆరోపిస్తోంది. ప్రభావితమైన సభ్యులకు నష్టపరిహారం చెల్లించడంతో పాటు సంస్థపై భారీ జరిమానా విధించాలని కోర్టును కోరింది. ఈ నిర్ణయాల్లో అమెజాన్ అమెరికా ప్రధాన కార్యాలయం కూడా కీలక పాత్ర పోషించిందని కమిషన్ ఆరోపించింది.వచ్చిన ఆరోపణలపై అమెజాన్ ఆస్ట్రేలియా స్పందించింది.ACCC దాఖలు చేసిన కేసును పూర్తిగా పరిశీలిస్తున్నామని, విచారణ మొత్తం కాలంలో నియంత్రణ సంస్థకు పూర్తి సహకారం అందించామని వెల్లడించింది.
భారత్ సహా పలు దేశాల్లో ఇదే విధానం
ప్రస్తుతం భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, ఇటలీ, స్పెయిన్ తదితర దేశాల్లో కూడా ప్రైమ్ వీడియోలో ప్రకటనలతో కూడిన సేవ అందుబాటులో ఉంది. ప్రకటనలు లేకుండా చూడాలనుకునే వారికి అదనపు రుసుము చెల్లించే అవకాశం కల్పిస్తోంది. అయితే ఆస్ట్రేలియాలో అమెజాన్ ప్రైమ్ పై పిటిషన్ దాఖలైంది. మరి భారత్‌తో పాటు ఇతర దేశాల్లో ఎలాంటి పిటిషన్ దాఖలు కాలేదు.డిజిటల్ స్ట్రీమింగ్ రంగంలో ప్రకటనల ఆధారిత వ్యాపార నమూనా వేగంగా విస్తరిస్తున్న వేళ, వినియోగదారుల హక్కులు, పారదర్శక ఒప్పందాలు ఎంత ముఖ్యమో ఈ కేసు మరోసారి గుర్తు చేస్తోంది. కోర్టు తీర్పు అమెజాన్‌కే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర OTT సంస్థల వ్యాపార విధానాలపైనా ప్రభావం చూపే అవకాశముంది.














Click it and Unblock the Notifications