H-1B కోసం భారతీయుల లంచాలు? వెంటనే ఆపండి-ట్రంప్ కు దౌత్యవేత్త రిపోర్ట్..!
అమెరికాలోని టాప్ ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించాక వాటిలో పనిచేసేందుకు హెచ్1బీ వీసాలు పొందుతున్న భారతీయులు వీటి కోసం ఎందాకైనా వెళ్తున్నారా ? లంచాలు సహా ఎన్ని అడ్డదారులు తొక్కయినా హెచ్1బీ వీసాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారా ? అందుకే ట్రంప్ సర్కార్ ఇప్పుడు హెచ్1 వీసా ఇంటర్వ్యూల విషయంలో భారతీయులకు చుక్కలు చూపిస్తోందా ? అంటే తాజా పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి.
అమెరికాలో హెచ్1బీ వీసాలు పొందేందుకు భారతీయులు ఎలాంటి అడ్డదారులు తొక్కుతున్నారో వివరిస్తూ ఆ దేశ దౌత్యవేత్త, భారతీయ మూలాలున్న మాహవాష్ సిద్దిఖీ ఇమ్మిగ్రేషన్ థింక్ ట్యాంక్ కు ఇచ్చిన రిపోర్ట్ ఇప్పుడు సంచలనాలు రేపుతోంది. ఇందులో భారతీయులు హెచ్1బీ వీసాలు పొందేందుకు లంచాలు సహా ఎలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారో ఆధారాలతో సహా వివరించారు. అంతే కాదు చివరిగా ట్రంప్ సర్కార్ కు హెచ్1 వీసాల్ని రద్దు చేయాలనే సలహా కూడా ఇచ్చారు.

అర్హత లేని భారతీయ హెచ్1బీ వీసా దరఖాస్తుదారులు మోసం, లంచాల ద్వారా వీటిని పొందుతున్నట్లు ఆమె ఆరోపించారు. కాబట్టి హెచ్1బీ వీసాలపై పూర్తిస్ధాయి సమీక్ష జరిగే వరకూ వాటి జారీని నిలిపేయాలని సిద్ధిఖీ ట్రంప్ సర్కార్ ను కోరారు. వలస వ్యతిరేక థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ ఇమ్మిగ్రెంట్ స్టడీస్ కు రాసిన లేఖలో ఆమె.. చెన్నైలోని యూఎస్ కాన్సులేట్‌లో జూనియర్ అధికారిగా తన అనుభవాన్ని గుర్తుచేశారు. 20-45 సంవత్సరాల వయస్సు గల భారతీయ పౌరులలో ఎక్కువ మంది మోసపూరిత లేదా పెంచిన ఆధారాలతో అమెరికాలోకి ప్రవేశించడానికి హెచ్1బీని లొసుగుగా వాడుకుంటున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన అమెరికన్ ఐటీ, స్టెమ్ కార్మికులకు అన్యాయం చేస్తున్నట్లు వివరించారు.
కంప్యూటర్ సైన్స్ డిగ్రీలు ఉన్నట్లు చెప్పుకునే చాలా మంది హెచ్1బీ దరఖాస్తుదారులకు సంబంధిత కోర్సులు లేదా ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు లేవని, వారు ప్రాథమిక కోడింగ్ పరీక్షలను క్రమం తప్పకుండా ఫెయిల్ అవుతున్నట్లు సిద్ధిఖీ తెలిపారు. భారత్, అమెరికా రెండు చోట్లా అవినీతిపరులైన హెచ్ ఆర్ అధికారులు నకిలీ ఉపాధి లేఖలను ఉపయోగించడం ద్వారా అర్హత లేని అభ్యర్థుల తనిఖీని తప్పించుకునేందుకు వీలు కల్పించారని ఆమె ఆరోపించారు. ఇది కేవలం ఐటీ రంగంలో మాత్రమే కాదు పాఠశాలల్లో చేరిన భారతీయ వైద్య గ్రాడ్యుయేట్లు జే-1 వీసాలపై అమెరికా రెసిడెన్సీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశించి, చివరికి అమెరికన్ శిక్షణ పొందిన వైద్యుల కంటే తక్కువ నైపుణ్య స్థాయిలతో వైద్య విద్య అభ్యసిస్తున్నారని తెలిపారు.

కొంతమంది భారతీయ మేనేజర్లు అమెరికన్లను మినహాయించే ఇన్సులర్ నియామక నెట్‌వర్క్‌లను సృష్టించారని, అర్హత లేని నియామకాలను కాపాడారని, విజిల్ బ్లోయింగ్ జరగకుండా చూశారని కూడా ఆరోపించారు. దీని వల్ల మరింత కఠినమైన కార్యక్రమాల ద్వారా ఉత్తీర్ణులైన మెరుగైన అర్హత కలిగిన అమెరికన్ ఐటీ గ్రాడ్యుయేట్లు తక్కువ అర్హత కలిగిన హెచ్1నియామకాల ద్వారా క్రమం తప్పకుండా ఉద్యోగాలు మారాల్సి వచ్చిందని, లేదా తక్కువ జీతం కోసం భారతీయులకు శిక్షణ ఇవాల్సి వస్తుందన్నారు. భారతీయ లాబీయిస్టులు, సిలికాన్ వ్యాలీ అధికారులు అమెరికన్ కార్మికులను తక్కువ సామర్థ్యం గల వారిగా చిత్రీకరిస్తూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. అలాగే యూఎస్ కాంగ్రెస్ ను కూడా తప్పుదోవ పట్టించారని తెలిపారు.












Click it and Unblock the Notifications