గ్రీన్ ల్యాండ్ కబ్జాకు కదులుతున్న ట్రంప్..! డెన్మార్క్ నాటో రద్దు వార్నింగ్..!
రష్యా, చైనా బూచి చూపుతూ ఆర్కిటిక్ ద్వీపం అయిన గ్రీన్ ల్యాండ్ ను బలవంతంగా ఆక్రమించుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నా వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో గ్రీన్ ల్యాండ్ ను కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న డెన్మార్క్ తాజా హెచ్చరికలు జారీ చేసింది. గ్రీన్ ల్యాండ్ ను ఆక్రమిస్తే తర్వాత ఏం జరుగుతుందో ట్రంప్ కు తేల్చిచెప్పేసింది.
గ్రీన్ ల్యాండ్ ను స్వాధీనం చేసుకునేందుకు బలప్రయోగం చేయక తప్పదని ట్రంప్ మరోసారి వెల్లడించారు. గ్రీన్‌ల్యాండ్‌పై తాము ఏదైనా చేయబోతున్నామని, వారికి నచ్చినా నచ్చకపోయినా అని ట్రంప్ తెలిపారు. తాను సులభమైన మార్గంలో ఈ పని చేయాలనుకుంటున్నానని, కుదరకపోతే మాత్రం కఠినమైన మార్గంలో చేసి తీరుతానని ట్రంప్ ప్రకటించారు. ఆర్కిటిక్‌లో రష్యా , చైనా సైనిక కార్యకలాపాలు పెరుగుతున్నందున ఖనిజ సంపన్న గ్రీన్ ల్యాండ్ ద్వీపాన్ని నియంత్రించడం అమెరికా జాతీయ భద్రతకు చాలా కీలకమని ట్రంప్ స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో డెన్మార్క్ స్పందించింది. గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా దాడి జరిగితే డెన్మార్క్ తనను తాను రక్షించుకోవాల్సి ఉంటుందని డెన్మార్క్ పార్లమెంటు సభ్యుడు, రక్షణ కమిటీ ఛైర్‌పర్సన్ కూడా అయిన రాస్మస్ జార్లోవ్ తెలిపారు. డానిష్ సైన్యం అమెరికాను ఆపలేకపోయినా, దాడి ఆమోదయోగ్యం కాదని ఆయన అంగీకరించారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వూలో ఆయన.. ఇది రెండు నాటో దేశాల మధ్య వినాశకర స్దితికి దారి తీస్తుందన్నారు.

అయితే గ్రీన్ ల్యాండ్ పై అమెరికా సైనిక దాడి కచ్చితంగా నాటోకు ముగింపు అవుతుందన్నారు. ఎందుకంటే అప్పుడు డెన్మార్క్ నాటో రాజ్యాంగంలోని ఆర్టికల్ 5ను అమలు చేయాల్సి ఉంటుందన్నారు. దీని ప్రకారం గ్రీన్ ల్యాండ్ పై దాడి జరిగితే అమెరికన్ల సహా ఇతర నాటో దేశాలు తమకు సాయం చేయాల్సి ఉంటుందని తెలిపారు. అయితే అమెరికన్లు దానిని వీటో చేస్తారని, ఆపై నాటో రద్దవుతుందని తెలిపారు.












Click it and Unblock the Notifications