Donald trump: చెత్త ట్రక్కులో ప్రయాణించిన ట్రంప్-కమలా హ్యారిస్ కోసమేనంటూ..!
అమెరికా అధ్యక్ష ఎన్నికల సంగ్రామం దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్ధుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రచారంలో భాగంగా రిపబ్లికన్ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్ అభ్యర్ధి కమలా హ్యారిస్ ఇద్దరూ దూసుకుపోతున్నారు. తాజా సర్వేల్లో వీరిద్దరి మధ్య ఓట్ల తేడా చాలా స్వల్పంగా ఉందని కూడా తేలింది. ఈ నేపథ్యంలో పరస్పరం పైచేయి సాధించుకునేందుకు ఇరువురూ ప్రయత్నిస్తున్నారు.
ఇదే క్రమంలో తాజాగా ప్రచార పర్వంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు అధ్యక్ష ఎన్నికల రిపబ్లికన్ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ ఓ చెత్త ట్రక్కులో ప్రయాణించారు. అంతే కాదు దీన్ని కూడా ప్రత్యర్థులు కమలా హ్యారిస్, జో బైడెన్ కు లింక్ చేస్తూ ట్రంప్ సెటైర్లు వేశారు. దీని వెనుక ఓ కీలక కారణం ఉంది. తన ప్రచారంలో భాగంగా అధ్యక్షుడు జో బైడెన్ ట్రంప్ మద్దతుదారులను ఉద్దేశించి చెత్తగా అభివర్ణించారు. దీనికి కౌంటర్ ఇచ్చేందుకు ట్రంప్ చెత్త ట్రక్కును ఎంచుకున్నారు.

విస్కాన్సిన్‌లో తాజాగా ప్రచారం సందర్భంగా ట్రంప్ చెత్త ట్రక్కు ఎక్కారు. అంతే కాదు ఇది తన ప్రత్యర్ధులు కమలా హ్యారిస్, జో బైడెన్ గౌరవార్దం అంటూ వ్యాఖ్యానించారు. ఓటర్ల దృష్టిని ఆకర్షించడానికి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదాన్ని పదే పదే వినిపిస్తున్న ట్రంప్.. ఇలా చెత్త ట్రక్‌లోకి ఎక్కారు. తద్వారా తన ప్రత్యర్దులు తన మద్దతుదారులను చెత్త అని పిలవడంపై వారిని రెచ్చగొట్టేలా ఈ చర్య ఉందనే వాదన వినిపిస్తోంది. నవంబర్ 5న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ పోరు నెలకొన్న తరుణంలో ప్రధాన అభ్యర్ధుల మధ్య పోరు ఓటర్లను సైతం ఆలోచనలో పడేస్తోంది.












Click it and Unblock the Notifications