Donald Trump: ఉక్రెయిన్ ఏదో ఒక రోజు రష్యాలో భాగం కావొచ్చు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత తన ప్రకటనలు, చర్యలతో ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నారు. జో బైడెన్ రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ కు బేషరతుగా సహాయం చేయగా.. ఇప్పుడు ట్రంప్ "ఉక్రెయిన్ ఏదో ఒక రోజు రష్యాలో భాగం
కావచ్చు..." అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధ సమయంలో ఉక్రెయిన్ కు అందించిన సహాయాన్ని కూడా వెనక్కి తీసుకోవడానికి అమెరికా వెనకాడదని ట్రంప్ పేర్కొనడం గమనార్హం. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని కలవడానికి కొన్ని రోజుల ముందు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను అధ్యక్షుడినైతే ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య యుద్ధాన్ని 24 గంటల్లో ఆపేస్తానని ఎన్నికల ప్రచారంలో భాగంకగా ట్రంప్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ట్రంప్ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. "వారు(రష్యా-ఉక్రెయిన్) ఒప్పందం చేసుకోవచ్చు.. చేసుకోకపోవచ్చు. ఉక్రెయిన్ వారు
రష్యన్లు కావొచ్చు.. కాకపోవచ్చు" అని ట్రంప్ అన్నారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ తో 500 మిలియన్ డాలర్ల డీల్ తో పాటు అరుగైన ఖనిజాల వినియోగం అంశాన్ని ట్రంప్ ప్రస్తావించారు. ఈ పోరాటాన్ని ఆపేందుకు తన రాయభారి కీత్ కెల్లాగ్ ను త్వరలో కీవ్ పంపనున్నట్లు ఆయన వెల్లడించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వచ్చేవారం మ్యూనిచ్ లో జెలెన్ స్కీతో భేటీ కానున్నట్లు తెలిసింది.

ట్రంప్ జెలెన్స్కీని ఎందుకు బెదిరిస్తున్నాడు?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఈ ప్రకటనలు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీకి బెదిరింపుగా ఉన్నాయి. ఆయన ట్రంప్ మాట వినకపోతే అమెరికా ఉక్రెయిన్‌కు సహాయం చేయడం ఆపివేస్తుందని ఆయన అన్నారు. అమెరికా సహాయం లేకుండా ఉక్రెయిన్ బలహీనపడుతుందని, రష్యా దానిని విలీనం చేసుకోగలదని ఆయన స్పష్టంగా చెబుతున్నారు. 500 మిలియన్ డాలర్ల డీల్ లో ప్రకారం.. ట్రంప్ దృష్టి ఉక్రెయిన్ లోని అరుదైన ఖనిజాలపై ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని ఎలక్ట్రానిక్స్, ఇంధనం, రక్షణ రంగాలలో ఉపయోగిస్తారు. ఉక్రెయిన్ కు అమెరికా ఆర్థిక సహాయం అందిస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్ ఖనిజాలను అందించాలని ట్రంప్ కోరుకుంటున్నారు.
మూడేళ్లుగా జరుగుతున్న యుద్ధం..
రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం 2022 ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. సుమారు మూడేళ్లుగా ఉక్రెయిన్-రష్యాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. యుద్ధాన్ని ముగించడానికి అంతర్జాతీయ స్థాయిలో అనేక ప్రయత్నాలు జరిగాయి.. అయినా ఎక్కడా ముగింపుకు వచ్చినట్లు కనపడడం లేదు. గతేడాది జూన్ లపో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ తో యుద్ధాన్ని ముగించడానికి తన షరతులను వివరించారు.
పుతిన్ షరతులు ఇవే..
*డాన్‌బాస్, నోవోరోజియా ప్రాంతాల నుంచి ఉక్రేనియన్ దళాల ఉపసంహరణ.
*నాటోలో చేరకూడదని ఉక్రెయిన్ నిబద్ధత
*ఉక్రెయిన్‌లో రష్యన్ మాట్లాడేవారికి వారి భాషను ఉపయోగించే హక్కు, వారి ప్రయోజనాలను కాపాడుకోవడం
*రష్యాపై ఉన్న అన్ని పాశ్చాత్య ఆంక్షలను తొలగించడం.
*ఉక్రెయిన్ అలీన దేశంగా, అణ్వస్త్ర రహిత దేశంగా ఉండాలి.
సోవియట్ యూనియన్‌లో భాగమైన ఉక్రెయిన్ ఎప్పుడు విడిపోయింది?
1991లో సోవియట్ యూనియన్ రద్దు సమయంలో ఉక్రెయిన్ రష్యా నుంచి విడిపోయింది. డిసెంబర్ 1, 1991న ఉక్రెయిన్ ప్రజలు రష్యా నుండి విడిపోయిన స్వతంత్ర ఉక్రెయిన్‌కు అనుకూలంగా ప్రజాభిప్రాయ సేకరణలో ఓటు వేశారు. 1997లో రష్యా, ఉక్రెయిన్ ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఇది ఉక్రెయిన్ సరిహద్దుల సమగ్రతను నిర్ధారించింది. అయితే స్వాతంత్ర్యం తర్వాత ఉక్రెయిన్‌లోని అనేక ప్రాంతాలలో అశాంతి నెలకొంది.












Click it and Unblock the Notifications