ఆఫ్ఘనిస్తాన్ లో భారీ భూకంపం
Afghanistan earthquake 2025: పొరుగుదేశం ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఆ దేశ ఉత్తర ప్రాంతాన్ని వణికించింది. తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. సరిహద్దు ప్రాంతం కావడం వల్ల పాకిస్తాన్, తజకిస్తాన్ లోనూ తేలికపాటి ప్రకంపనలు నమోదయ్యాయి. దీనివల్ల ప్రాణ నష్టం చోటు చేసుకున్నట్లు సమాచారం లేదు.
కొన్ని చోట్ల ఆస్తినష్టం సంభవించింది. పలు నివాసాలు బీటలు వారాయి. కొన్ని పాక్షికంగా కూలిపోయాయి. ఆఫ్ఘనిస్తాన్ లో గత కొన్ని రోజుల్లో భూమి వరుసగా ప్రకంపిస్తూ వస్తోంది. ఆ దేశ ఉత్తరప్రాంతంలోనే ఇవి నమోదు అవుతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

తాజా భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9గా రికార్డయింది. శనివారం రాత్రి సరిగ్గా 11:05 నిమిషాలకు 36.83 నార్త్ అక్షాంశం, 71.01 తూర్పు రేఖాంశం పరిధిలోకి వచ్చే ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర ప్రాంతం బడాక్షన్ ప్రావిన్స్‌లో భూమి కంపించింది. ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్స్‌లల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి ప్రకోపించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ వెల్లడించింది.
ఈ ప్రావిన్స్ పరిధిలోని బహరక్, ఫైజాబాద్, దరియా-ఏ- పిష్కాన్.. వంటి పట్టణాలు, గ్రామాల్లో భూకంప తీవ్రత కనిపించింది. కొన్ని చోట్ల నివాసాలు బీటలు వారినట్లు సమాచారం అందింది. భూకంపం సంభవించిన వెంటనే స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు.
పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉంటుంది ఆఫ్ఘన్. కెనడా, అమెరికా, మెక్సికో, గ్వాటెమాలా, కోస్టారికా, చిలీ, పెరు, ఈక్వెడార్, కొలంబియా, రష్యా, జపాన్, ఫిలిప్పీన్స్, ఇండొనేసియా, పపువా న్యూగినియా, న్యూజిలాండ్.. రింగ్ ఆఫ్ ఫైర్ దేశాలు.
2023 అక్టోబర్‌లో ఆఫ్ఘనిస్తాన్ పశ్చిమ ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపంలో అంచనాలకు మించి ప్రాణ, ఆస్తినష్టం సంభవించిన విషయం తెలిసిందే. హెరాత్ సిటీలో భూమి ప్రకోపించిన ఘటనలో 1,500 మంది వరకు మరణించారు. వేలాదిమంది గాయపడ్డారు. భూకంపం సంభవించిన గ్రామాలన్నీ పూర్తిగా నేలమట్టం అయ్యాయి అప్పట్లో.












Click it and Unblock the Notifications