వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Everest: బేస్ క్యాంపులో రాత్రిపూట పెద్దపెద్ద శబ్దాలు ఎందుకు వినిపిస్తున్నాయి

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఎవరెస్టు

ఎవరెస్టు బేస్ క్యాంపును వేరే ప్రాంతానికి తరలించాలని నేపాల్ భావిస్తోంది. భూమి వేడెక్కడంతోపాటు మానవ చర్యల వల్ల ప్రస్తుత బేస్ క్యాంపు ప్రమాదకరంగా మారిపోవడంతో చర్యలు తీసుకుంటోంది.

మార్చి నుంచి జూన్ మధ్య దాదాపు 1500 మంది పర్వతారోహకులు ఈ బేస్ క్యాంపుకు వస్తుంటారు. వేగంగా కరిగిపోతున్న ఖుంబు హిమానీనదంపై ఇది ఉంది.

కొత్త శిబిరం తక్కువ ఎత్తులో ఉండే ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్నట్లు ఒక అధికారి బీబీసీతో చెప్పారు. ఏడాది పొడవునా మంచు ఉండని చోటులో ఈ శిబిరం ఉంటుందని అన్నారు.

మంచు కరిగిపోవడంతో వచ్చే నీరు వల్ల హిమానీనదం ప్రమాదకరంగా మారుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు రాత్రిపూట పడుకున్నప్పుడు బేస్‌ క్యాంప్ దగ్గర నేల బీటలు వారినట్లు కనిపిస్తోందని పర్వతారోహకులు కూడా చెబుతున్నారు.

ఎవరెస్టు

''ఈ క్యాంపును వేరే ప్రాంతంలోకి మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలో అందరితోనూ చర్చలు మొదలుపెడతాం’’అని నేపాల్ పర్యటక శాఖ డైరెక్టర్ జనరల్ తారానాథ్ అధికారి బీబీసీతో చెప్పారు.

''ప్రస్తుతం బేస్‌ క్యాంపులో వస్తున్న మార్పులకు అనుగుణంగా మనం కూడా మారాలి. అప్పుడే పర్వతారోహకులకు, ఈ బిజినెస్‌కు మంచిది’’అని ఆయన అన్నారు.

ప్రస్తుత బేస్ క్యాంపు 5,364 మీటర్ల ఎత్తులో ఉంది. కొత్తది 200 నుంచి 400 మీటర్ల తక్కువ ఎత్తులో ఉండబోతోందని తారానాథ్ చెప్పారు.

ఎవరెస్టు ప్రాంతంలో పర్వతారోహణ, సదుపాయాలపై నేపాల్ ప్రభుత్వం ఇటీవల ఒక కమిటీ ఏర్పాటుచేసింది. ఆ కమిటీ సూచనలపై ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నారు.

ఎవరెస్టు

వేగంగా కరుగుతోంది..

హిమాలయాల్లోని ఇతర హిమానీనదాల్లానే ఖుంబు గ్లేషియర్ వేగంగా కరిగిపోతోంది. భూతాపం దీనిపై తీవ్రమైన ప్రభావం చూపుతోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

బేస్ క్యాంపు సమీపంలోని హిమానీనదంలో ఒక ప్రాంతం సంవత్సరానికి ఒక మీటరు చొప్పున తగ్గిపోతోందని 2018లో లీడ్స్ యూనివర్సిటీ నిపుణులు చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది.

చాలావరకు గ్లేషియర్లలో మంచుతోపాటు రాళ్లు, మట్టి ఉంటాయి. కానీ కొన్నిచోట్ల మంచు ఫలకాలు కూడా ఉంటాయి. ఇవి కరిగినప్పుడు హిమానీనదం ప్రమాదకరంగా మారుతుందని ఆ అధ్యయనంలో పాలుపంచుకున్న స్కాట్ వాట్సన్ బీబీసీతో చెప్పారు.

''ఆ మంచు ఫలకాలు కరిగినప్పుడు వాటిపై ఉండే పెద్దపెద్ద బండరాళ్లు, చిన్న రాళ్లు వేగంగా దొర్లుకుంటూ వస్తాయి. కరుగుతున్న నీటితో చిన్నచిన్న చెరువుల్లాంటివి ఏర్పడతాయి’’అని ఆయన చెప్పారు.

''వీటి వల్ల రాళ్లు పైనపడటం, నీటి ప్రవాహాలు ఒక్కసారిగా రావడం లాంటి చర్యలతో ఈ హిమానీనదం ప్రమాదకరంగా మారుతుంది’’అని ఆయన వివరించారు.

ఏడాదికి ఈ గ్లేషియర్ 9.5 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరును కోల్పోతుందని వాట్సన్ తెలిపారు.

బేస్ క్యాంపు పరిసరాల్లోని ఒక నదీ ప్రవాహం క్రమంగా పెరుగుతూ వస్తోందని పర్వతారోహకులు, నేపాలీ అధికారులు చెబుతున్నారు. ఇదివరకటితో పోలిస్తే, నేలపై బీటలు ఎక్కువయ్యాయని వివరిస్తున్నారు.

''మేం పడుకునే చోట రాత్రికిరాత్రే పెద్దపెద్ద బీటలు కనిపిస్తున్నాయి’’అని నేపాలీ సైన్యంలో పనిచేస్తున్న కల్నల్ కిశోర్ అధికారి చెప్పారు. మార్చి నుంచి మే మధ్య పర్వతారోహకులు ఎక్కువగా వచ్చేటప్పుడు ఇక్కడ అంతా శుభ్రంచేసే బృందానికి ఆయన నేతృత్వం వహిస్తున్నారు.

చాలా భయమేస్తోంది..

''రాత్రిపూట ఆ బీటల్లో పడిపోతామేమోనని మాకు చాలా భయమేస్తోంది. చాలా వేగంగా పగుళ్లు వస్తున్నాయి. అవి చాలా ప్రమాదకరంగా ఉంటాయి’’అని కిశోర్ చెప్పారు.

మరోవైపు ఎవరెస్టు బేస్ క్యాంపు దగ్గర సాగరమాత పొల్యూషన్ కంట్రోల్ కమిటీ (ఎస్‌పీసీసీ)లో పనిచేస్తున్న షెరింగ్ తెంజింగ్ షేర్పా కూడా అక్కడి పరిస్థితులపై ఆందోళన వ్యక్తంచేశారు.

''పెద్దపెద్ద శబ్దాలు కూడా తరచూ వినిపిస్తున్నాయి. హిమానీనదంలో మంచు ఫలకాలు కదలడం, రాళ్లు దొర్లడంతో ఆ శబ్దాలు వస్తున్నాయి’’అని ఆయన అన్నారు. ''బేస్ క్యాంపు దగ్గర టెంటులు ఏర్పాటుచేసే ముందే, ఆ ప్రాంతాన్ని చదును చేయాల్సిన అవసరముంది. హిమానీనదం దిశ మార్చుకున్న ప్రతిసారీ బేస్‌క్యాంపును కూడా మారుస్తుండాలి’’అని ఆయన వివరించారు.

''ఇదివరకు చదునుచేసిన ప్రాంతాలు రెండు, మూడు వారాల్లోగా మళ్లీ గుట్టలుగా మారేవి. కానీ ఇప్పుడు ప్రతివారమూ చదును చేయాల్సి వస్తోంది’’అని ఆయన అన్నారు.

''బేస్ క్యాంపుకు ఎక్కువ మంది ప్రజలు రావడం కూడా ఒక సమస్యగా మారింది’’అని ప్రభుత్వ కమిటీలో సభ్యుడిగానున్న ఖిమలాల్ గౌతమ్ చెప్పారు.

''ఉదాహరణకు మరుగుదొడ్డిల నుంచి రోజూ 4,000 లీటర్ల నీరు వస్తోంది’’అని ఆయన చెప్పారు. ''మరోవైపు కిరోసిన్, గ్యాస్ లాంటి ఇంధనాల వినియోగం కూడా పెరుగుతోంది. ఫలితంగా గ్లేషియర్ మంచు వేగంగా కరుగుతోంది’’అని ఆయన అన్నారు.

ఎవరెస్టు

మరింత ప్రమాదకరంగా..

కొండ చరియలు విరిగిపడటం, రాళ్లు పైనపడటం, మంచు ఫలకాలు విరిగిపోవడం లాంటి ప్రమాదాలు ఈ బేస్‌ క్యాంపు పరిసరాల్లో చోటుచేసుకునే ముప్పు మరింత ఎక్కువవుతోందని మౌంటెయిన్ గైడ్ కంపెనీ అల్పెన్‌గ్లో ఎక్స్‌పీడిషన్స్ వ్యవస్థాపకుడు ఆడ్రియన్ బాలింగెర్ చెప్పారు.

ప్రస్తుతం చాలా వరకు పర్వతారోహకులు నేపాల్ వైపు నుంచే ఎవరెస్టును ఎక్కుతుంటారు. అయితే, చైనా వైపు నుంచి ఎక్కేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

''సమస్యలున్నప్పటికీ ప్రస్తుత బేస్ క్యాంపు బాగానే ఉంది. మరో మూడు నుంచి నాలుగేళ్లు ఇది చక్కగా పనిచేస్తుంది’’అని ఎస్‌పీసీసీకి చెందిన షేర్పా చెప్పారు. మరోవైపు 2024కల్లా కొత్త శిబిరం ఏర్పాటవుతుందని నేపాలీ అధికారులు చెబుతున్నారు.

''మేం బేస్‌ క్యాంపుకు సంబంధించి సాంకేతిక, పర్యావరణ పరమైన అంశాలను అంచనా వేస్తున్నాం. స్థానికులు, నిపుణులుతో మాట్లాడిన తర్వాతే కొత్త క్యాంపు ఎక్కడ ఏర్పాటుచేయాలో నిర్ణయం తీసుకుంటాం’’అని తారానాథ్ అధికారి చెప్పారు.

''అందరితోనూ మాట్లాడిన తర్వాతే, ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటాం’’అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Everest: Why loud noises are heard at night in base camp
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X