చైనా బాటలోనే రష్యా-ఇరాన్ సుప్రీం లీడర్ కు భారీ ఊరట..!
ఇరాన్ (iran)పై ఏకపక్షంగా యుద్దం ప్రారంభించి, ఆ దేశ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖొమైనీని పొట్టనపెట్టుకున్న అమెరికా-ఇజ్రాయెల్ కు ఈ వార్ ను ఎలా ముగించాలో తెలియడం లేదు. ఇప్పటికే ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఆస్తుల్ని టార్గెట్ చేస్తూ ఇరాన్ చేస్తున్న దాడులతో ఆయా దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఇలాంటి సమయంలో వీరిపై మరింత ఒత్తిడి పెంచేందుకు ఇరాన్ తమ కొత్త సుప్రీం లీడర్ గా మొజ్తబా ఖమేనీని ఎంపిక చేసుకుంది. దీంతో అమెరికా, ఇజ్రాయెల్ ఆయనకు వ్యతిరేకంగా హెచ్చరికలు మొదలుపెట్టేశాయి.
వీటిని ఇప్పుడు ముందుగా చైనా ఖండించగా.. ఇప్పుడు రష్యా కూడా అదే బాట పట్టింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (vladimir putin) ఇరాన్ కొత్తగా నియమితులైన సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ (moztaba Khamenei)కి మద్దతు ప్రకటించారు. కొత్త నాయకుడికి పంపిన ప్రత్యక్ష సందేశంలో పుతిన్ .. "టెహ్రాన్‌కు మా అచంచలమైన మద్దతును, మా ఇరానియన్ స్నేహితులకు సంఘీభావాన్ని నేను పునరుద్ఘాటించాలనుకుంటున్నాను" అని రాశారు. రష్యా ఇరాన్‌కు నమ్మకమైన భాగస్వామిగా ఉందని, అలాగే ఉంటుందని కూడా తేల్చిచెప్పేశారు. ఇరాన్ సాయుధ దురాక్రమణను ఎదుర్కొంటున్న సమయంలో ఈ ఉన్నత స్థానంలో మీ పదవీకాలం నిస్సందేహంగా గొప్ప ధైర్యం , అంకితభావం అవసరమని జూనియర్ ఖమేనీకి రష్యా అధ్యక్షుడు తెలిపారు.

మరోవైపు ఇప్పటికే ట్రంప్.. ఖమేనీ కుమారుడు తనకు ఆమోదయోగ్యం కాదని, ఇరాన్‌కు సామరస్యం, శాంతిని తీసుకువచ్చే వ్యక్తిని తాము కోరుకుంటున్నామని వెల్లడించారు. అతను మా ఆమోదం పొందకపోతే ఎక్కువ కాలం ఉండడని కూడా హెచ్చరికలు చేశారు. ఆ తర్వాత ఇరాన్ మొజ్తబా సుప్రీం లీడర్ గా ఎంపికైనట్లు ప్రకటించింది. దీంతో భగ్గుమంటున్న అమెరికా-ఇజ్రాయెల్ కు ఇప్పుడు చైనా ముందుగా షాకిచ్చింది. మొజ్తబాకు తాము పూర్తి మద్దతిస్తున్నట్లు తెలిపింది. ఆ తర్వాత పుతిన్ కూడా అలాంటి ప్రకటనే చేయడంతో అమెరికా-ఇజ్రాయెల్ స్పందన ఏంటన్నది చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications