Imran Khan : పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై హత్యాయత్నం-కాల్పుల్లో కాళ్లకు గాయాలు..
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై హత్యాయత్నం జరిగింది. గుజ్రన్ వాలాలోని వజీరాబాద్ లో ఇవాళ ర్యాలీ నిర్వహిస్తున్న ఆయనపై దుండగులు కాల్పులు జరిపారు. ఇందులో ఆయనతో పాటు మరో నలుగురికి గాయాలయ్యాయి. కాల్పుల్లో ఇమ్రాన్ కాలికి గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇమ్రాన్ కు చికిత్స చేస్తున్న డాక్టర్లు ఆయనకు ప్రాణాపాయం లేదని చెప్తున్నారు.
పాకిస్తాన్ లోని అధికార షాబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇమ్రాన్ ఖాన్ ఇవాళ గుజ్రన్ వాలాలో ర్యాలీ నిర్వహిస్తున్నారు. దీనికి భారీ ఎత్తున జనం హాజరయ్యారు. ఈ సమయంలో దుండగులు ఆయన్ను టార్గెట్ చేసి కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన ఆయన సహాయకులు, పార్టీ నేతలు కాపాడే ప్రయత్నం చేసారు. దీంతో వారికి కూడా గాయాలయ్యాయి. వెంటనే ఇమ్రాన్ ఖాన్ ను అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో ఆస్పత్రికి తరలించారు.

2007లో ఇదే తరహాలో పాకిస్తాన్ మరో మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో ర్యాలీలోనూ దుండగులు కాల్పులు జరిపి ఆమెను పొట్టనబెట్టుకున్నారు. ఇప్పుడు ఇమ్రాన్ ర్యాలీపైనా దాడి చేసి కాల్పులకు దిగడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. పాకిస్తాన్ మీడియా ఇమ్రాన్ ఖాన్ పై దాడి ఘటనను భుట్టోపై దాడి ఘటనతో పోలుస్తోంది. కాల్పుల్లో ఇమ్రాన్ కుడి కాలికి గాయం కావడంతో కట్టు కట్టి ఎస్.యు.విలో తరలించడం కనిపించింది. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇస్లామాబాద్‌కు కొనసాగుతున్న "లాంగ్ మార్చ్"ని ఉద్దేశించి మాజీ క్రికెటర్ కంటైనర్-ట్రక్కుపై నిలబడి ఉన్నప్పుడు కింద నుండి ఓ వ్యక్తి ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పులు జరిపాడు. వెంటనే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications