లండన్‌లో చారిత్రాత్మక ఘట్టం.. థేమ్స్ నదిపై చరిత్ర సృష్టించిన 'గంగా హారతి'!
యూకే రాజధాని లండన్ లోని ప్రసిద్ధ థేమ్స్ నది ఒడ్డున ఓ అద్భుతమైన, చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇండియాలో పవిత్ర గంగా నదీ తీరాల్లో ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించే 'గంగా హారతి' సంప్రదాయాన్ని తొలిసారిగా లండన్ నగరానికి తీసుకువచ్చారు. 'థేమ్స్‌పై గంగా హారతి: కాంతి వేడుక' పేరుతో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వేలాది మంది స్థానిక ప్రజలు, భారతీయులు, పర్యాటకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ వేడుకలో భాగంగా లండన్ వాసులు భారీ సంఖ్యలో హాజరై ప్రమిదల్లో దీపాలు వెలిగించి, వేద మంత్రోచ్ఛారణల మధ్య థేమ్స్ నదికి ఆరతి సమర్పించారు. జీవాన్ని నిలబెట్టే నీటికి, సమస్త వనరులను అందించే ప్రకృతికి తమ హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. గంగా హారతి సంప్రదాయం కేవలం ఓ పూజా విధానం మాత్రమే కాకుండా జీవదాత అయిన ప్రకృతి పట్ల మానవాళికి ఉండే భక్తిభావాన్ని చాటిచెప్పే ప్రతీకగా కార్యక్రమ నిర్వాహకులు పేర్కొన్నారు.

చిన్మయ మిషన్ యూకే సంస్థ తన 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా చేపడుతున్న వేడుకల్లో భాగంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని తలపెట్టింది. లండన్ లో ప్రతి ఏటా ఘనంగా జరిగే "టోటల్లీ థేమ్స్' ఉత్సవంతో భాగస్వామ్యం వహించి ఈ గంగా హారతిని ఎంతో వైభవంగా నిర్వహించారు. భారతీయ ఆధ్యాత్మిక వారసత్వాన్ని, నదుల ప్రాముఖ్యతను లండన్ పౌరులకు పరిచయం చేయడంలో ఈ వేడుక కీలక పాత్ర పోషించింది.
థేమ్స్ నది తీరం వేలాది మంది జనసందోహంతో, దివ్యమైన దీపాల కాంతులతో, మంత్రోఛ్చారణల ధ్వనులతో మార్మోగిపోయింది. ఈ ప్రదర్శన అక్కడకు వచ్చిన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మైమరిపించింది. నదులు కేవలం నీటి ప్రవాహాలు మాత్రమే కాదని, అవి మానవ జీవితంతో, సంస్కృతితో ముడిపడి ఉన్న జీవధారలని ఈ కార్యక్రమం గుర్తిచేసింది. ప్రకృతిని గౌరవించడం, దానిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశాన్ని ఈ ఆరతి వేడుక చాటిచెప్పింది.
భారత ఆధ్యాత్మిక విశ్వాసాలకు, సంస్కృతికి గంగానది మూలస్తంభంగా ఉంటే.. లండన్ నగర చరిత్రకు, ఆధునిక జీవనానికి థేమ్స్ నది అత్యంత ప్రధానమైనది. ఈ రెండు విభిన్న సంస్కృతుల జీవనదుల తీరాలను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా ఓ అద్భుతమైన సాంస్కృతిక వారధి ఏర్పడింది. బ్రిటన్ గడ్డపై భారత ప్రాచీన ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రతిబింబింపజేస్తూ.. నదులకు, మానవ మనుగడకు ఉన్న అవినాభావ సంబంధాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ఘట్టంగా ఈ గంగా హారతి నిలిచింది.
लंदन में पहली बार गंगा आरती 🚩🚩
— Chandan Sharma (@ChandanSharmaG) September 14, 2026
टेम्स नदी, लंदन में पूरे रीति-रिवाज से गंगा आरती
हजारों हिंदू इकट्ठा होकर आनंदित हुए
सनातन धर्म और संस्कृति का दबदबा पूरे दुनिया में हैं। pic.twitter.com/ULWbgOzxpC












Click it and Unblock the Notifications
