దుండగుల చేతిలో హత్యకు గురైన హాలీవుడ్ నటుడు..
ప్రముఖ హాలీవుడ్ నటుడు జానీ వాక్టర్ (37)ను దుండగులు కాల్చి చంపారు. అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో కారులో వెళ్తుండగా కొందరు దుండగులు ఆయనను అడ్డగించి, దోపిడికి ప్రయత్నించారు. అయితే, ఈ క్రమంలో ఆయన ఎదురుతిరగడంతో ఆ దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో వాక్టర్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, చికిత్స తీసుకుంటూ వాక్టర్ మరణించారు. దీంతో హాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
జానీ వాక్టర్ 2007లో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆర్మీ వైవ్స్ అనే ఓ టీవీ ప్రోగ్రామ్‌తో ఆయన కెరీర్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఆయన ఇరవై సంవత్సరాల పాటు తన ఈ ఫీల్డ్‌లో రాణించారు. జనరల్ హాస్పిటల్ అనే షోతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సుమారు 200 ఎపిసోడ్స్‌లో నటించి మెప్పించారు. వీటితో పాటు ఆయన మరెన్నో టీవీ షోలు కూడా చేశారు. అందులో కూడా తన దైన ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించారు. క్రిమినల్ మైండ్స్, వెస్ట్ వరల్డ్, ది OA, NCIS, స్టేషన్ 19, హాలీవుడ్ గర్ల్ వంటి టీవీ షోలెన్నో చేశారు. అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో ఆయన నివసిస్తున్నారు. ఆయన తన తల్లి, తమ్ముళ్లు లాన్స్, గ్రాంట్‌లతో కలిసి ఇక్కడే ఉంటున్నారు. వాక్టర్ మృతితో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది.













Click it and Unblock the Notifications