ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేసేందుకు భారీగా పోలీసులు, మద్దతుగా ఫ్యాన్స్, ఉద్రిక్తత
లాహోర్: పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు రంగం సిద్దమైంది. లాహోర్‌లో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు ఇస్లామాబాద్ పోలీసులు జమాన్ పార్క్ రెసిడెన్సీకి రావడంతో ముందుగానే పార్టీ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో అక్కడికి చేరున్నారు. పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
దేశాధినేతలు చేస్తున్న అన్యాయాలకు వ్యతిరేకంగా నిలబడకపోతే దేశం బానిసగా మారుతుందని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు ఇమ్రాన్ ఖాన్. అవినీతికి పాల్పడి అరెస్టు అవ్వాల్సిన నేతను ప్రధానిని చేయడం వల్లే తమ దేశ పతనానికి దారితీసిందని ఆయన ఆరోపించారు. భారతదేశ ఛానళ్లను చూడండి.. పాకిస్థాన్ ప్రపంచ వ్యాప్తంగా ఎందుకు విమర్శలకు గురవుతుందో తెలుసుకోండంటూ పిలుపునిచ్చారు. ప్రస్తుత ప్రభుత్వంలోని అగ్రనేతలే నేరస్థులైతే.. ఇక దేశం ఏమవుతుందని ప్రశ్నించారు. పాకిస్థాన్ ఇప్పటికే బెగ్గర్‌గా మారిందన్నారు.

పాకిస్థాన్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో అత్యధిక ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు నలిగిపోతున్నారన్నారు. ప్రభుత్వాధి నేతలు తమ సంపదను విదేశాల్లో ఎంత దాచుకున్నారో ప్రపంచానికి తెలుసన్నారు. వజిరాబాద్‌లో తనపై జరిగిన హత్యాయత్నం వెనుక అధికారంలో ఉన్నవారంతా ఉన్నారని ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇంటీరియల్ మంత్రి రానా సనావుల్లా, ఇంటెలిజెన్స్ అధికారుల పేర్లను ఇమ్రాన్ ప్రస్తావించారు.
ఇది ఇలావుండగా, పోలీసులు మాత్రం ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేయకుండా వెళ్లేది లేనట్లుగా అతని ఇంటి వద్దే కాపు కాసి ఉన్నారు. అయితే, ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రి పదవిలో ఉండగా.. విదేశీ పర్యటనల్లో వచ్చిన బహుమతులను విక్రయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి వీటిని తోఫాఖానాలో జమచేయాలి. ఈ కేసుకు సంబంధించిన మూడు సార్లు విచారణకు పిలిచినా ఇమ్రాన్ హాజరుకాకపోవడంతో సెషన్స్ కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మార్చి 7వ తేదీ నాటికి కోర్టు ఎదుట హాజరుపర్చాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు అన్ని ప్రయాత్నాలు చేస్తున్నారు. అయితే, పోలీసులకు చిక్కకుండా ఇమ్రాన్ ఖాన్ రహస్య ప్రదేశాల్లో తిరుగుతున్నట్లు సమాచారం. మరోవైపు, ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేస్తే.. భారీ ఎత్తున ఆందోళనలకు సిద్ధమవుతున్నారు ఆయన అనుచరులు.












Click it and Unblock the Notifications