రష్యా ఉక్రెయిన్ యుద్ధం పీక్స్: ఐసీజే జోక్యం: విచారణ తేదీలివే
వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతోన్న యుద్ధం ఏడో రోజుకు చేరుకుంది. యూరోపియన్ యూనియన్ సహా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి పలు దేశాలు రష్యాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోన్నాయి. అనేక ఆంక్షలను విధించాయి. ఆర్థికపరమైన కార్యకలాపాలను పూర్తిగా నిషేధించాయి. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న దాడిని అంతర్జాతీయ వేదికల మీద తప్పుపడుతున్నాయి. పాశ్చాత్య దేశాలన్నీ తనకు వ్యతిరేకంగా నిలిచినప్పటికీ- రష్యా మాత్రం వెనుకంజ వేయట్లేదు. పైగా తన యుద్ధ తీవ్రతను పెంచింది.
Recommended Video
రాజధాని కీవ్‌ను లక్ష్యంగా చేసుకుంది. కీవ్‌ను హస్తగతం చేసుకోవడానికి కౌంట్‌డౌన్ ఆరంభమైంది. రష్యన్ సైనిక బలగాలు కీవ్‌ను చుట్టుముట్టాయనే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం ధృవీకరించారు. ఖార్‌కీవ్‌లో రష్యా వైమానిక దళం ల్యాండ్ అయింది. ఈ నగరం దాదాపుగా రష్యా వశమైనట్టే కనిపిస్తోంది. ఖార్‌కీవ్‌లో రష్యా ఎయిర్ ఫోర్స్ ల్యాండ్ అయిన విషయాన్ని అక్కడి గవర్నర్ ధృవీకరించారు. తమ సైన్యం తీవ్రంగా ప్రతిఘటిస్తోందని చెప్పారు. సుమీలోనూ దాదాపుగా ఇవే పరిస్థితులు నెలకొని ఉన్నాయి.

యుద్ధం పతాకస్థాయికి చేరుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ రంగంలోకి దిగింది. ఈ యుద్ధంపై విచారణ చేపట్టనుంది. దీనికి తేదీలను కూడా ఖరారు చేసింది. ఈ నెల 7, 8వ తేదీల్లో విచారణ కొనసాగుతుందని అంతర్జాతీయ న్యాయస్థానం తెలిపింది. వారం రోజులుగా రష్యా ఏకధాటిగా కొనసాగిస్తోన్న దాడులు, సాధారణ పౌరులు మృతి చెందడం, ఆస్తుల ధ్వంసం, మానవహక్కుల ఉల్లంఘన.. వంటి అంశాలపై అంతర్జాతీయ న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.
ఈ విషయాన్ని ఐసీజే ప్రాసిక్యూటర్ కరీమ్ ఖాన్ వెల్లడించారు. సమగ్ర విచారణ చేపట్టడానికి అన్ని రకాలుగా ఉక్రెయిన్ దాఖలు చేసిన పిటీషన్‌కు అర్హతలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. యుద్ధ నేరాల గురించి రెండు దేశాలు కూడా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటోన్నాయని పేర్కొన్నారు. 2014 నుంచీ రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయని, వాటన్నింటి మీద సమగ్ర దర్యాప్తు చేసే అవకాశాలు ఉన్నాయని అన్నారు.
యుద్ధం ఆరంభమైన మూడో రోజే ఉక్రెయిన్ ప్రభుత్వం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. రష్యా తమ దేశాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తోందని, ఈ విషయంలో అంతర్జాతీయ చట్టాలు, మానవ హక్కుల ఉల్లంఘన, ఒప్పందాలను యథేచ్ఛగా ఉల్లంఘించిందని ఆరోపించింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం- రష్యాపై మరిన్ని ఆంక్షలు, నిషేధాలను విధించేలా చేయాలంటూ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌లో పిటీషన్‌ను దాఖలు చేసింది. తక్షణమే యుద్ధాన్ని నిలిపివేసేలా ఆదేశాలను ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.












Click it and Unblock the Notifications