షాకింగ్..: జైలులో ప్రతిపక్ష నేత కన్నుమూత
Alexei Navalny: రష్యాలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ప్రతిపక్ష నేత అలెక్సీ నవాల్రీ కన్నుమూశారు. ఆయన వయస్సు 47 సంవత్సరాలు. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అభియోగాలు ఆయనపై ఉన్నాయి. చాలాకాలంలో ఆయన జైలులో ఉంటోన్నారు.
రష్యా కాలమానం ప్రకారం.. ఈ ఉదయం వాకింగ్ తరువాత ఆయన అనారోగ్యానికి గురయ్యారని, ఆ వెంటనే స్పృహ కోల్పోయారని యమలో-నెనెట్స్ రీజియన్ జైలు అధికారులు తెలిపారు. ఆయనకు జైలులోనే అత్యవసర చికిత్స అందించామని, అయినప్పటికీ ప్రాణాలను నిలపలేకపోయామని అన్నారు. ఆయన అనారోగ్యం బారిన పడటానికి గల కారణాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.

రష్యా ఆఫ్ ది ఫ్యూచర్ పార్టీకి అధినేత.. అలెక్సీ. పోలార్ వూల్ఫ్‌గా ఆయనను పిలుచుకుంటారు అభిమానులు. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఆరోపణలను గుప్పించడం, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. 19 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను అనుభవిస్తోన్నారు.
సుదీర్ఘకాలంగా ఆయన యమలో-నెనెట్స్ రీజియన్ నార్త్ ఆర్కిటిక్ సర్కిల్‌లోని పీనల్ కాలనీలో గల జైలులో శిక్షను అనుభవిస్తోన్నారు. మాస్కో నుంచి సుమారు 1,900 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉంటుందీ జైలు. అత్యంత తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని ఆ జైలుకు తరలిస్తుంది అక్కడి ప్రభుత్వం.
2021 జనవరి నుంచి జైలులో ఉంటొోన్నారు అలెక్సీ. గత ఏడాది ఆగస్టులో ఆయనకు శిక్ష ఖరారైంది. 19 సంవత్సరాల కఠిన కారాగారశ శిక్ష పడింది. అదే ఏడాది డిసెంబర్‌లో జైలు నుంచి ఓ వీడియో సందేశాన్ని పంపించారు. తనపై నమోదైన కేసులన్నీ కూడా బూటకమేనని తేల్చి చెప్పారు. అధికార పార్టీ కుట్రగా అభివర్ణించారు.
అలెక్సీ మరణించినట్లు వచ్చిన వార్తలపై రష్యా అధ్యక్షుడి అధికారిక నివాసం క్రెమ్లిన్ స్పందించింది. ఆయన మరణించినట్లు ఇప్పటివరకు తమకు ఎలాంటి సమాచారం అందలేదని తెలిపింది. వాస్తవం ఏమిటనేది తెలుసుకుంటోన్నామని, త్వరలోనే ఓ అధికారిక ప్రకటన జారీ చేస్తామని పేర్కొంది.












Click it and Unblock the Notifications