Tsunami 2024: జపాన్‌లోని భారత ఎంబసీల్లో హెల్ప్‌లైన్లు: ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్స్ ఇవే..
Japan Tsunami 2024: జపాన్‌లో మరోసారి పెను భూకంపం సంభవించింది. పశ్చిమ తీర ప్రాంతాన్ని వణికించింది. భూకంప తీవ్రత అనూహ్యంగా ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. సునామీ హెచ్చరికలను జారీ చేశారు. ముందు జాగ్రత్త చర్యలను తీసుకున్నారు.
తీర ప్రాంతంలోని ఇషికవా ప్రీఫెక్షర్ రీజియన్‌ను భూకంప కేంద్రంగా గుర్తించారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.4గా రికార్డయింది. జపాన్ పశ్చిమ ప్రాంతంలో ఉంటుందీ ఇషికవా ప్రీఫెక్షర్. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4:10 నిమిషాలకు ఈ భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది.

ఇషికావ ప్రీఫెక్షర్ పరిధిలో ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున ఫలకాల్లో సంభవించిన పెను కదలికల వల్ల భూమి ప్రకోపించింది. దీని తీవ్రత.. తీర ప్రాంతంలోని ఇషికావ, నిగిట, టొయొమా, యమగట ప్రీఫెక్షర్స్‌లో అల్లకల్లోలాన్ని సృష్టించింది. ఈ మూడు రీజియన్ల పరిధిలో ఉన్న నగరాలను భయభ్రాంతులకు గురి చేసింది.
ఈ భూకంపం వల్ల సునామీ సంభవించింది. ఇషికావ, నిగిట, టొయొమా, యమగట ప్రీఫెక్షర్స్ రీజియన్ల తీర ప్రాంతాలను అల్లకల్లోలానికి గురి చేసింది. సునామీ అలల ధాటికి పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సముద్రం.. తీర ప్రాంతాల్లో కొన్ని మీటర్ల దూరం వరకు ముందుకు దూసుకొచ్చింది.
భూకంపం, సునామీ ప్రభావిత ప్రాంతాల్లో బ్లాక్ అవుట్స్ ఏర్పడ్డాయి. విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది. అనేక ప్రాంతాల్లో మొబైల్ నెట్ వర్క్ కూడా అందుబాటులో ఉండట్లేదు. కొన్ని చోట్ల ఇంటర్నెట్ సైతం బంద్ అయింది. కుప్ప కూలిన భవనాల మధ్య పలువురు చిక్కుకుని ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాలతో విదేశాంగ మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. భారతీయుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. టోక్యో సహా ఇతర నగరాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయం, హైకమిషన్ ఆఫీసుల్లో ప్రత్యేక హెల్ప్‌లైన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటి ఫోన్ నంబర్లను వెల్లడించింది.
ఆయా కార్యాలయాల్లో పని చేసే అధికారులు, వారి కాంటాక్ట్ నంబర్లతో కూడిన ఓ అధికారిక ప్రకటనను విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. యాకుబ్ టోప్నా +81-80-39301715, అజయ్ సేథీ +81-70-14920049, డీఎన్ బర్న్‌వాల్ +81-80-32144734, ఎస్ భట్టాచార్య +81-80-62295382, వివేక్ రాఠీ +81-80,32144722 నంబర్లకు ఫోన్ చేయవచ్చు. లేదా [email protected], [email protected] అనే చిరునామాలకు ఇమెయిల్ చేయవచ్చు.












Click it and Unblock the Notifications